TG: "సింగరేణి గనుల్లోని బొగ్గు మనది.. గోదావరి నుంచి తీసుకుంటున్న నీళ్లు మనవి.. కర్మాగారానికి ఇచ్చిన నేల మనది.. మరి ఇక్కడ తయారయ్యే 800 మెగావాట్ల విద్యుత్‌ను రాజస్థాన్‌కు ఎందుకు అప్పనంగా రాసిస్తున్నారు?" అంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తెలంగాణ ఆస్తులను, సహజ వనరులను పొరుగు రాష్ట్రాల ప్రయోజనాలకు తాకట్టు పెడుతున్నారంటూ ముఖ్యమంత్రికి ఘాటు లేఖ సంధించారు.
మన వనరులతో వేరే రాష్ట్రానికి వెలుగులా
మంచిర్యాల జిల్లా జైపూర్ సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం విస్తరణలో భాగంగా కుదుర్చుకున్న డీల్ వెనుక భారీ లొసుగులు దాగి ఉన్నాయని హరీశ్‌రావు మండిపడ్డారు. రాజస్థాన్ విద్యుత్ సంస్థతో సంస్థ చేసుకున్న ఒప్పందం ప్రకారం కొత్త ప్లాంట్‌లో ఉత్పత్తయ్యే చౌక విద్యుత్‌లో ఏకంగా 800 మెగావాట్లను ఆ రాష్ట్రానికే దారాదత్తం చేయాలని నిర్ణయించడం తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల రక్తం, చెమటతో నిర్మితమైన సింగరేణి సంపదను పక్క రాష్ట్రానికి కట్టబెట్టే హక్కు ప్రభుత్వానికి ఎవరిచ్చారని నిలదీశారు.
ఆ తొందరపాటు ఎందుకు
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని ఆయన విమర్శించారు. 24 గంటల ఉచిత విద్యుత్ మాట దేవుడెరుగు.. కనీసం 7 నుంచి 8 గంటలు కూడా సక్రమంగా సరఫరా చేయకపోవడంతో కళ్ల ముందే అన్నదాతల పంటలు ఎండుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్వరాష్ట్రంలోనే తీవ్ర విద్యుత్ కొరతతో ప్రజలు, రైతులు అల్లాడుతుంటే, ఇక్కడి కరెంటును రాజస్థాన్‌కు మళ్లించే డీల్స్ చేసుకోవడం ముమ్మాటికీ ప్రజాద్రోహమేనని ధ్వజమెత్తారు. సింగరేణి విస్తరణ విద్యుత్ అంతా తెలంగాణకే దక్కాలని, రాజస్థాన్‌తో చేసుకున్న ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.


