Economy Analysis: భారత స్టాక్ మార్కెట్లలో మొన్నటిదాకా నిధుల వర్షం కురిపించిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు ఇప్పుడు ఒక్కసారిగా రివర్స్ గేర్ వేశారు. వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఉపసంహరించుకుంటూ దేశీయ మార్కెట్ల నుంచి తట్టాబుట్టా సర్దుకుని పారిపోతున్నారు.
భారత వృద్ధి రేటు ప్రపంచానికే ఆదర్శమంటూ అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు కితాబులిస్తున్న వేళ.. ఈ గ్లోబల్ ఇన్వెస్టర్లు ఎందుకు భారత్‌పై నమ్మకం కోల్పోయి విక్రయాల సునామీ సృష్టిస్తున్నారు? కేవలం మధ్యప్రాచ్య యుద్ధాలు, అమెరికా బాండ్ ఈల్డ్స్ పెరుగుదలే దీనికి కారణమా? లేక కాగితాలపై కనిపిస్తున్న భారత వృద్ధి గణాంకాల వెనుక దాగిన లోపాలను వాళ్లు ముందే పసిగట్టారా? అసలేమైంది..
"ఇండియా వద్దు.. యూఎస్సే ముద్దు" ఎందుకీ యూ-టర్న్?
కొంతకాలంగా స్థిరమైన రాబడులు ఇచ్చిన దలాల్ స్ట్రీట్ నుంచి విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు దూరం జరగడానికి ప్రధానంగా కొన్ని అంతర్జాతీయ, దేశీయ పరిణామాలు కారణమవుతున్నాయని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నారు.
అమెరికా డాలర్ విలువ వరుసగా బలపడుతుండటంతో భారత రూపాయి విలువ కనిష్ట స్థాయిలకు పడిపోతోంది. రూపాయి బలహీనపడితే విదేశీ ఇన్వెస్టర్ల నికర రాబడులు కరిగిపోతాయి. అమెరికా ట్రెజరీ బాండ్ల రాబడులు మళ్లీ లాభసాటిగా మారాయి. ఎలాంటి రిస్క్ లేకుండానే మంచి ప్రతిఫలం దక్కుతున్నప్పుడు, అభివృద్ధి చెందుతున్న భారత మార్కెట్లలో అధిక రిస్క్ తీసుకోవడం ఎందుకన్నది వారి ఆలోచనగా కనిపిస్తుందంటున్నారు. ముదురుతున్న యుద్ధాలు, అమెరికా వాణిజ్య విధానాల్లో అస్పష్టత ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లను 'రిస్క్-ఆఫ్' మూడ్‌లోకి నెట్టాయని అంటున్నారు. అయితే కేవలం ఈ కారణాల వల్లే వారు పారిపోతున్నారని సరిపెట్టుకుంటే అసలు సమస్య పక్కదారి పట్టినట్టే అనే వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి.
కాగితాలపై 7.8%.. గ్రౌండ్‌లో వాస్తవ పరిస్థితి ఏంటి
విదేశీ నిపుణులు, మార్కెట్ విశ్లేషకులు భారత్ వృద్ధిని లోతుగా పరిశీలిస్తున్నప్పుడు ఒక విచిత్రమైన తేడా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ప్రభుత్వం, అంతర్జాతీయ సంస్థలు జీడీపీ 7 శాతానికి పైగా పరుగులు పెడుతోందని గణాంకాలు చూపుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం తేడా కొడుతుందట. "మార్కెట్లో వస్తువు నిజంగా నాణ్యమైనదైతే కొనుగోలుదారులు ఎందుకు వెనకడుగు వేస్తారు? దేశ ఆర్థిక వ్యవస్థ అంత పటిష్టంగా ఉంటే విదేశీ పెట్టుబడులు దేశం దాటి ఎందుకు వెళ్తాయి?" అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
వాస్తవానికి దేశంలో మధ్యతరగతి కొనుగోలు శక్తి గణనీయంగా క్షీణించింది. ఎంత డిస్కౌంట్లు ఆఫర్ చేసినా వస్తువులు కొనే పరిస్థితి కనిపించడం లేదు. పారిశ్రామిక విస్తరణ కోసం కంపెనీలు తీసుకునే రుణాలు స్తంభించిపోగా.. కేవలం సామాన్యులు తమ మనుగడ కోసం బంగారం తాకట్టు పెట్టి తీసుకుంటున్న గోల్డ్ లోన్స్, పర్సనల్ లోన్స్ మాత్రమే రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ఐఐటీ లాంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లోనే ఉద్యోగాల ఆఫర్ లెటర్లు వెనక్కి వెళ్తుండటం, నిరుద్యోగం పెరగడం వంటి అంశాలు కార్పొరేట్ కంపెనీల భవిష్యత్ లాభాలపై నీలినీడలు కమ్ముకునేలా చేశాయని అంటున్నారు.
ఓవర్‌వ్యాల్యుయేషన్ భయం..
భారత మార్కెట్లలో షేర్ల విలువలు వాటి వాస్తవ ఆర్నింగ్స్ కంటే చాలా ఎక్కువగా పెరిగిపోయాయన్న వాదన ఎప్పటినుంచో ఉంది. క్షేత్రస్థాయి ఆర్థిక బలహీనతల మధ్య ఇంత భారీ ప్రీమియం చెల్లించి షేర్లను కొనసాగించడం భావ్యం కాదని భావించిన విదేశీ ఇన్వెస్టర్లు, అందినకాడికి లాభాలను వెనక్కి తీసుకుంటున్నారట.
గతంలో దేశీయ రిటైల్ ఇన్వెస్టర్లు, సిప్‌ల రూపంలో వచ్చిన దేశీయ నిధులు మార్కెట్‌ను ఆదుకున్నాయి. కానీ ఇప్పుడు విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాల జోరు ఎంత తీవ్రంగా ఉందంటే.. ఆ ఒత్తిడికి దేశీయ కొనుగోళ్లు కూడా చేతులెత్తేయాల్సిన దుస్థితి తలెత్తింది. దీని ఫలితంగానే మార్కెట్ సూచీలు నెత్తురోడుతూ రూ.17 లక్షల కోట్ల సంపద క్షణాల్లో ఆవిరైపోయిందని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
దిద్దుబాటు చర్యలు లేకపోతే మరింత ముప్పు
గతంలోనూ మార్కెట్లు పడిపోయి వెంటనే పుంజుకున్న మాట వాస్తవమే అయినా.. ఈసారి పరిస్థితి భిన్నంగా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ మందగమనం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ఎల్‌నినో ప్రభావం, సేవా రంగంలో మందగించిన జోరు వెరసి మొత్తం ఆర్థిక చక్రాన్ని నెమ్మదింపజేశాయని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
విదేశీ పెట్టుబడుల తరలింపు అనేది ఒక సాధారణ హెచ్చరిక కాదని.. అంతర్జాతీయ ఫైనాన్షియల్ మార్కెట్లు మన ఆర్థిక వ్యవస్థ డొల్లతనాన్ని గుర్తించి ముందుగానే అప్రమత్తమవుతున్నాయనడానికి ఇది స్పష్టమైన సూచిక అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
పాలకులు కేవలం జీడీపీ గణాంకాల ముసుగులో సమస్యలను దాచిపెట్టే ధోరణి వీడి.. ఉపాధి కల్పన, మధ్యతరగతి కొనుగోలు శక్తి పెంపు, పారిశ్రామిక పెట్టుబడుల ప్రోత్సాహం దిశగా తక్షణ దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. లేనిపక్షంలో, ఈ విదేశీ నిధుల బహిష్కరణ దేశ ద్రవ్యోల్బణాన్ని పెంచి, సామాన్యుడి బతుకును మరింత సంక్షోభంలోకి నెట్టే ప్రమాదం పొంచి ఉందనే హెచ్చరికలు జోరుగా వినిపిస్తున్నాయి.












