National

బీజేపీ కుట్రపూరితంగా జ్ఞానేశ్ కుమార్‌ను సీఈసీగా నియమించింది- ఎంపీ చామల

రచన: NK•••4 నిమిషాల పఠనం

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వెంటనే ఆయనను పదవి నుంచి తొలగించాలని విపక్షాలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా ఈ అంశంపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.

CEC Gyanesh Kumar: కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వెంటనే ఆయనను పదవి నుంచి తొలగించాలని విపక్షాలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా ఈ అంశంపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ కుట్రపూరితంగా జ్ఞానేశ్ కుమార్‌ను సీఈసీగా నియమించిందని చామల కిరణ్ ఆరోపించారు. తన రాజకీయ ప్రయోజనాల కోసమే ఆయనను ఆ పదవిలో కూర్చోబెట్టిందన్నారు.

గతంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సభ్యుడిగా ఉన్న కమిటీ ఎంపిక చేసే సాంప్రదాయం ఉండేదని ఎంపీ చామల తెలిపారు. ఇప్పుడా సంప్రదాయానికి బీజేపీ తూట్లు పొడిచిందన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కలిసి సీజేఐని ఆ ఎంపిక ప్రక్రియ నుంచి తప్పించి తమకు అనుకూలమైన వ్యక్తిని సీఈసీగా నియమించుకున్నారని విమర్శించారు.

ఓటు అనేది రాజ్యాంగం పౌరులకు కల్పించిన హక్కు అని, అయితే జ్ఞానేశ్ కుమార్ ఆ ఓటు హక్కును తొలగించే కుట్ర చేస్తున్నారని ఎంపీ చామల ఆరోపించారు. ఫామ్ 6 ద్వారా దేశవ్యాప్తంగా 13కోట్ల ఓట్లను తొలగించారని చెప్పారు. తొలగించిన వారికి మళ్లీ ఓటు హక్కు పొందే అవకాశం కూడా ఇవ్వడం లేదన్నారు. హర్యానా ఎన్నికల వివాదంలో రాహుల్ గాంధీ సీసీటీవీ ఫుటేజ్ అడిగినా ఇవ్వలేదన్నారు. రూల్స్ ప్రకారం 45 రోజుల వరకు ఫుటేజ్‌ను ఉంచాలన్నారు. కర్ణాటకలోని మహదేవపుర నియోజకవర్గంలో లక్షకు పైగా బల్క్ ఓట్లను నమోదు చేసి ఫొటోగ్రఫీలను మార్చేశారని ఎంపీ చామల ఆరోపించారు.

ఈ మొత్తం అంశాలపై సమగ్ర విచారణ జరపాలన్నారు. అలాగే ఓట్ల తొలగింపు ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని, ఇటీవల కాలంలో జరిగిన ఎన్నికలపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తక్షణమే తప్పించాలన్న ఎంపీ చామల.. ఇందుకోసం పార్లమెంటులో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలన్నారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని రాజ్యాంగాన్ని పరిరక్షించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ప్రధాని మోదీ, అమిత్ షాలపై ఎంపీ చామల ఫైర్ అయ్యారు. గుజరాత్ మోడల్ తరహాలో ఎప్పటీకీ దేశంలో అధికారం మాదే అనే భ్రమలో మోదీ, అమిత్ షా ఉన్నారని విమర్శించారు.

#CEC Gyanesh Kumar#Bjp#Congress#Telangana#Swechaa News#Election Commission Row#CEC Row
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి