తెలంగాణ

Harish Rao: గోదావరి జలాలను లిఫ్ట్ చేసి రిజర్వాయర్లు నింపండి- మంత్రి ఉత్తమ్‌కు హరీశ్ రావు లేఖ

రచన: NK•••5 నిమిషాల పఠనం

గోదావరి జలాలపై మాజీ మంత్రి హరీశ్ రావు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు. గోదావరిలో వరద పోతున్నా, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో రిజర్వాయర్లు అడుగంటిపోతున్నాయని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల మీద రాజకీయాలు చేస్తూ రైతుల పంటలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎండగొడుతోందని మండిపడ్డారు.

Harish Rao: గోదావరి జలాలపై మాజీ మంత్రి హరీశ్ రావు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు. గోదావరిలో వరద పోతున్నా, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో రిజర్వాయర్లు అడుగంటిపోతున్నాయని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల మీద రాజకీయాలు చేస్తూ రైతుల పంటలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎండగొడుతోందని మండిపడ్డారు. గోదావరి జలాలను తక్షణమే లిఫ్ట్ చేసి రిజర్వాయర్లను నింపాలంటూ మంత్రి ఉత్తమ్ కు లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు హరీశ్ రావు. ఎల్లంపల్లి వద్ద భారీ వరద ఉన్నా మోటార్లు ఆన్ చేసి నీటిని ఎత్తిపోయకపోవడం ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే అని హరీశ్ రావు మండిపడ్డారు.

అన్నపూర్ణ, రంగనాయక సాగర్ డెడ్ స్టోరేజీకి చేరాయని తెలిపారు. 50 టీఎంసీల సామర్థ్యం ఉన్న మల్లన్న సాగర్‌లో కేవలం 13 టీఎంసీలు మాత్రమే ఉన్నాయని, ఎల్ఎండీలో 11 టీఎంసీలే ఉన్నాయని వివరించారు. రంగనాయక సాగర్‌లో నీళ్లు లేక సిద్దిపేట నర్మెట్టలోని పామాయిల్ ఫ్యాక్టరీ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని, రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని హరీశ్ రావు మంత్రి ఉత్తమ్ దృష్టికి తీసుకెళ్లారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు కాకుండా వెంటనే స్పందించాలన్నారు.

ఇప్పటికైనా ఎల్ నినో సాకులు పక్కనపెట్టాలని రేవంత్ ప్రభుత్వానికి హితవు పలికారు హరీశ్ రావు. వెంటనే 24 గంటల పాటు అన్ని మోటార్లు నడిపించి మిడ్ మానేరు, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, గంధమల్ల, బస్వాపూర్ సహా అన్ని రిజర్వాయర్లను నింపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజకీయాలు మాని రైతుల సాగు, ప్రజల తాగునీటి అవసరాలను తీర్చాలని రేవంత్ సర్కార్ కు సూచించారు హరీశ్ రావు.

''ఎల్లంపల్లిలో నీటి ఎత్తిపోతలు ప్రారంభిస్తే మిడ్ మానేరు సహా అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, గంధమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్లకు నీటిని తరలించడంతో పాటు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు పూర్తి పరిష్కారం లభిస్తుంది. ఈ రిజర్వాయర్లను నింపడం వల్ల దాదాపు 5 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణానికి దోహదం చేసినట్లవుతుంది. గోదావరి నదిలో ఎల్లంపల్లి వద్ద వరద ప్రవాహం భారీగా ఉంది.

ఈ పరిస్థితిని అనుకూలంగా మార్చుకొని అన్ని మోటార్లను నడిపి నీళ్లు లిఫ్ట్ చేసే అవకాశం ఉంది. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఉద్దేశపూర్వకంగా మీరు చేస్తున్న నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారుతోంది. జలకళతో కనిపించాల్సిన రిజర్వాయర్లు ఎండిపోయి కనిపిస్తున్నాయంటే దానికి కారణం నీటి నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యమే'' అని హరీశ్ రావు ధ్వజమెత్తారు.

#Harish Rao#Uttam Kumar Reddy#Godavari Water#Telangana#Reservoirs#Harish Rao Letter#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి