పౌరసరఫరాల శాఖలో కస్టమ్ మిల్లింగ్ రైస్ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చకు దారితీస్తోంది. ఏళ్లుగా కొనసాగుతున్న సీఎంఆర్ లెక్కల్లో భారీగా తేడాలు ఎలా వచ్చాయి? ప్రభుత్వ ధాన్యం మిల్లులకు చేరిన తర్వాత.. తిరిగి రావాల్సిన బియ్యం ఎక్కడికి వెళ్లింది? ఈ వ్యవస్థను పర్యవేక్షించాల్సిన అధికారులు ఏం చేశారు? గత ప్రభుత్వ హయాంలోనే బయటపడిన హెచ్చరికలను ఎందుకు సీరియస్‌గా తీసుకోలేదన్న అంశాలు ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి.
ఇక సీఎంఆర్ వ్యవస్థలో ప్రభుత్వం రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మిల్లర్లకు అప్పగిస్తుంది. మిల్లింగ్ పూర్తయిన తర్వాత నిర్దేశిత నిష్పత్తి ప్రకారం బియ్యాన్ని ప్రభుత్వానికి లేదా ఎఫ్‌సీఐకి తిరిగి అప్పగించాలి. అంటే మిల్లర్ చేతిలో ఉన్న ధాన్యం వ్యక్తిగత ఆస్తి కాదు.. అది ప్రభుత్వానికి సంబంధించిన స్టాక్. తెలంగాణ పౌరసరఫరాల శాఖ కూడా ధాన్యం కొనుగోలు, సీఎంఆర్ ద్వారా బియ్యం సేకరణను తన ప్రధాన విధుల్లో భాగంగా నిర్వహిస్తోంది.
ఇక్కడే 2022 నాటి ఎఫ్‌సీఐ తనిఖీలు ఇప్పుడు మరోసారి చర్చలోకి వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ అధికారిక ప్రకటన ప్రకారం.. 2022 మార్చి 31 నాటికి 40 రైస్ మిల్లుల్లో 4,53,896 బస్తాల ధాన్యం కొరత గుర్తించారు. మరో విడత తనిఖీల్లో 63 మిల్లుల్లో 1,37,872 బస్తాల కొరత నమోదైంది. అంతేకాదు.. 593 మిల్లుల్లో ధాన్యం నిల్వలు లెక్కించడానికి వీలులేని విధంగా ఉన్నాయని, బుక్ కీపింగ్‌పై కూడా సమస్యలు ఉన్నాయని కేంద్ర బృందం పేర్కొంది. అప్పట్లో ఈ డిఫాల్ట్ మిల్లర్లపై తక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్రానికి సూచించినప్పటికీ, జూన్ 2022 వరకు కాంక్రీట్ యాక్షన్ జరగలేదని కేంద్రం అధికారికంగా పేర్కొంది.
అంటే.. సీఎంఆర్‌లో సమస్యలు ఇప్పుడే పుట్టినవి కావన్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. 2022లోనే కేంద్ర బృందాల తనిఖీల్లో స్టాక్ కొరత, లెక్కల సమస్యలు బయటపడ్డాయి. ఆ సమయంలో తీసుకున్న చర్యలు ఎంతవరకు ఫలించాయి? గుర్తించిన కొరతలో ఎంత రికవరీ అయింది? ఎంతమంది మిల్లర్లపై కేసులు నమోదయ్యాయి? ఎంతమంది డిఫాల్టర్లపై శాఖాపరమైన చర్యలు జరిగాయి? వీటికి ఇప్పటి వరకు సమాధానాలు లేవు..
అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పౌరసరఫరాల శాఖను ఎవరు పర్యవేక్షించారు? ఎఫ్‌సీఐ తనిఖీలపై అప్పటి ప్రభుత్వం తీసుకున్న వైఖరి ఏమిటి? కేంద్రం లేవనెత్తిన లోటుపాట్లను రాష్ట్ర స్థాయి తనిఖీలు ఎలా పరిశీలించాయి? కేంద్రం గుర్తించిన కొరత, రాష్ట్రం గుర్తించిన కొరత మధ్య తేడాలు ఎందుకు వచ్చాయి? ఈ ప్రశ్నలకు అధికారిక రికార్డులతో సమాధానాలు బయటకు రావాల్సి ఉంది.
ఇక ప్రస్తుత ప్రభుత్వం మాత్రం గత పాలనలో సీఎంఆర్ బకాయిలు వేల కోట్ల రూపాయలకు చేరుకున్నాయని ఆరోపిస్తోంది. ఆగస్టు 2026లో జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం వేల కోట్ల బకాయిలు పేరుకుపోయేలా చేసిందని ఆరోపిస్తూ, డిఫాల్ట్ మిల్లర్ల నుంచి పూర్తి రికవరీకి మార్గదర్శకాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. బాధ్యతగా వ్యవహరించే మిల్లర్లకు ప్రభుత్వం సహకరిస్తుందని, ఉద్దేశపూర్వకంగా డిఫాల్ట్ చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని ప్రభుత్వం తెలిపింది.
ఇదే సమయంలో.. సీఎంఆర్ వ్యవహారంపై ప్రస్తుతం విజిలెన్స్ తనిఖీలు, రికవరీ చర్యలు కొనసాగుతున్నాయి. కొన్ని కేసుల్లో మిల్లర్లకు సంబంధించిన భారీ స్టాక్ కొరతలు కోర్టు రికార్డుల్లో కూడా నమోదయ్యాయి. ఉదాహరణకు 2026లో ఒక కేసులో విజిలెన్స్ తనిఖీల సందర్భంగా 13,967 మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం కొరత ఉన్నట్లు అధికారులు పేర్కొని, దానికి సంబంధించి రూ.45 కోట్లకు పైగా రికవరీ మొత్తాన్ని లెక్కించినట్లు హైకోర్టు రికార్డులో ఉంది. అయితే ఇలాంటి కేసుల్లో తుది బాధ్యత, చట్టపరమైన నిర్ణయం సంబంధిత విచారణలు, కోర్టు ప్రక్రియలపై ఆధారపడి ఉంటుంది.
మరోవైపు ధాన్యం కేటాయింపు నుంచి మొదలుకొని.. మిల్లుకు స్టాక్ చేరడం, స్టాక్ వెరిఫికేషన్, మిల్లింగ్, సీఎంఆర్ డెలివరీ, బిల్లుల చెల్లింపు, పెండింగ్ బియ్యం రికవరీ వరకు ప్రతి దశలో బాధ్యత ఎవరిది అన్నది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ఎఫ్‌సీఐ 2022లోనే కొరతలను గుర్తించినప్పుడు చర్యలు వేగంగా జరిగి ఉంటే.. డిఫాల్ట్ మిల్లర్ల నుంచి అప్పుడే రికవరీ చేసి ఉంటే.. తరువాతి సీజన్లలో కూడా అదే విధానం కొనసాగిందా? అన్నది ఇప్పుడు పరిశీలనలోకి రావాల్సిన అంశం. ఎందుకంటే ఒక సీజన్‌లో కనిపించిన లోటును సకాలంలో సరిదిద్దకపోతే.. అదే లోపం తరువాతి సీజన్లలో మరింత పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంటుంది.
అలాగే ప్రభుత్వం ఆరోపిస్తున్న వేల కోట్ల బకాయిలు, ఎఫ్‌సీఐ గతంలో గుర్తించిన కొరతలు, ప్రస్తుతం జరుగుతున్న విజిలెన్స్ చర్యలు.. ఈ మూడు అంశాలను కలిపి చూస్తే సీఎంఆర్ వ్యవహారం ఇప్పుడు కేవలం పౌరసరఫరాల శాఖకు సంబంధించిన పరిపాలనా సమస్యగా కాకుండా.. గత పాలనలో పర్యవేక్షణ ఎలా సాగింది, ప్రస్తుత ప్రభుత్వం రికవరీని ఎంతవరకు పూర్తి చేస్తుంది, అసలు నష్టం ఎంత, బాధ్యత ఎవరిపై పడుతుంది అనే రాజకీయ చర్చగా మారుతోంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు సుమారు రూ.13 వేల కోట్ల విలువైన సీఎంఆర్ బియ్యం రికవరీ కాకుండా పేరుకుపోయిందని, ఇందులో సింహభాగం గత ప్రభుత్వ హయాంలోనే జరిగిందని దర్యాప్తు అధికారులు గుర్తించారు. నాడు ఎఫ్‌సీఐ హెచ్చరించినప్పుడే కఠినంగా వ్యవహరించి ఉంటే ఖజానాకు వేల కోట్ల నష్టం వాటిల్లేది కాదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఇక డిఫాల్ట్ అయిన మిల్లర్ల నుంచి ఆస్తుల జప్తు ద్వారా రికవరీలు చేపడుతున్న ప్రభుత్వం.. ఈ మిల్లింగ్ మాఫియా వెనుక నాటి మంత్రులు, ఉన్నతాధికారుల పాత్రపై సమగ్ర విచారణ జరిపేందుకు సిద్ధమవుతుండటంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.










