ఎల్‌నినో ప్రభావం తెలంగాణ వానాకాలం సాగుపై స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా వరి సాగు విస్తీర్ణం తగ్గడంతో ఈ సీజన్‌లో ధాన్యం దిగుబడి, బియ్యం ఉత్పత్తి గణనీయంగా తగ్గే అవకాశం ఉందని ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వెల్లడించింది. అయితే దేశవ్యాప్తంగా కూడా ఎల్‌నినో పరిస్థితులు ప్రభావం చూపుతున్న నేపథ్యంలో.. ధాన్యం, బియ్యం ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగే అవకాశం ఉందని అంచనా వేసింది.
ప్రభుత్వ ఆదేశాల మేరకు వర్సిటీ వైస్‌ఛాన్సలర్ జానయ్య, సుస్థిర వ్యవసాయ కేంద్రం సంచాలకుడు సమరేందు మహంతి నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఈ అంశంపై అధ్యయనం చేసింది. తెలంగాణలో ఎల్‌నినో ప్రభావం.. బియ్యం దృక్పథం పేరుతో విడుదల చేసిన నివేదికలో కీలకమైన గణాంకాలను వెల్లడించింది.
2025 వానాకాలం సీజన్‌లో అనుకూల వాతావరణ పరిస్థితుల కారణంగా తెలంగాణలో 67.30 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. దాదాపు 1.50 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. మిల్లింగ్ అనంతరం సుమారు కోటి టన్నుల బియ్యం ఉత్పత్తి అయింది. అయితే ప్రస్తుత సీజన్‌లో వానాకాలం ప్రారంభంలోని కీలకమైన నాలుగు నెలల్లో తక్కువ వర్షపాతం నమోదవడం వరిసాగుపై ప్రతికూల ప్రభావం చూపింది.
దీంతో సీజన్ ముగిసే నాటికి రాష్ట్రంలో 55.89 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి సాగైంది. గతేడాదితో పోలిస్తే ఇది 16.87 శాతం తక్కువ. ముఖ్యంగా నల్గొండ, సూర్యాపేట, నిజామాబాద్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, జగిత్యాల జిల్లాల్లో వరి సాగు గణనీయంగా తగ్గినట్లు నివేదిక పేర్కొంది. ఇక రానున్న రెండు నెలల్లో వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే.. ఈ వానాకాలం సీజన్‌లో సుమారు 1.13 కోట్ల టన్నుల ధాన్యం మాత్రమే దిగుబడి వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు.
గతేడాదితో పోలిస్తే ఇది దాదాపు 37 లక్షల టన్నులు తక్కువ. మిల్లింగ్ తర్వాత సుమారు 75 లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తి అవుతుందని అంచనా. అంటే గతేడాదితో పోలిస్తే బియ్యం ఉత్పత్తి దాదాపు 25 లక్షల టన్నులు తగ్గే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా కూడా పరిస్థితులు భిన్నంగా లేవు. ప్రస్తుత వానాకాలం సీజన్‌లో దేశంలో 11.01 కోట్ల ఎకరాల్లో వరి సాగు జరగాల్సి ఉండగా.. ఇప్పటివరకు 10.60 కోట్ల ఎకరాల్లోనే సాగు జరుగుతోంది.
ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన వరి ఉత్పత్తి రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో వరి సాగు విస్తీర్ణం అధికంగా ఉండటంతో.. బియ్యం ఉత్పత్తిలో రాష్ట్రం అగ్రస్థానంలోనే కొనసాగే అవకాశం ఉందని నివేదిక స్పష్టం చేసింది. అదే సమయంలో భారత్‌తో పాటు ఆసియాలోని ప్రధాన బియ్యం ఉత్పత్తి దేశాల్లో ప్రస్తుత వానాకాలం, రాబోయే యాసంగి సీజన్‌లోనూ వరిసాగుపై అనిశ్చితి ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. అందుకే ధాన్యం నిల్వలు, సరఫరా, మార్కెటింగ్ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని సూచించారు.
మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా సన్న రకాల వరి, ఎగుమతులకు అనుకూలమైన పొడవైన బియ్యం రకాలు, పారా బాయిలింగ్‌కు అనువైన రకాలను రైతులు సాగు చేసేలా ప్రోత్సహించాలని నివేదిక సూచించింది. యాసంగిలోనూ వరిసాగుపై వాతావరణ ప్రభావం పడే అవకాశం ఉన్నందున.. సాగుకు అవసరమైన నీటి లభ్యతను మెరుగుపరిచేలా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. మొత్తానికి ఎల్‌నినో ప్రభావం ఈ సీజన్‌లో తెలంగాణ వరి ఉత్పత్తికి సవాల్‌గా మారినా.. దేశవ్యాప్త పరిస్థితులతో పోలిస్తే రాష్ట్రం బియ్యం ఉత్పత్తిలో కీలక స్థానాన్ని కొనసాగించే అవకాశం ఉందని వ్యవసాయ విశ్వవిద్యాలయం నివేదిక స్పష్టం చేస్తోంది..








