పాత విద్యుత్తు కనెక్షన్లు ఉన్న వినియోగదారులకు క్రమబద్ధీకరణ ఛార్జీల రూపంలో కొత్త భారం పడుతోంది. ఏళ్ల క్రితం తక్కువ విద్యుత్తు లోడ్‌తో తీసుకున్న కనెక్షన్లలో.. కాలక్రమంలో ఇంట్లో ఏసీలు, గీజర్లు, ఓవెన్లు, వాషింగ్ మెషిన్లు, మోటార్లు వంటి విద్యుత్తు ఉపకరణాలు పెరగడంతో వినియోగం పెరిగింది. ఈ నేపథ్యంలో అనుమతించిన లోడ్ కంటే ఎక్కువ విద్యుత్తు వినియోగిస్తున్నట్లు గుర్తించిన కొన్ని ఇళ్లకు డిస్కంలు క్రమబద్ధీకరణ ఛార్జీల కోసం నోటీసులు జారీ చేస్తున్నాయి.
విద్యుత్తు బిల్లులో సాధారణంగా కాంట్రాక్టెడ్ లోడ్, ఆర్‌ఎండీ అనే రెండు కేటగిరీలు ఉంటాయి. విద్యుత్తు కనెక్షన్ తీసుకునే సమయంలో డిస్కం నుంచి అనుమతి పొందిన గరిష్ఠ లోడ్ పరిమితినే కాంట్రాక్టెడ్ లోడ్ అంటారు. దీన్ని కిలోవాట్లలో కొలుస్తారు. ఉదాహరణకు ఒక ఇంటికి ఒక కిలోవాట్ కాంట్రాక్టెడ్ లోడ్ ఉంటే.. ఆ పరిమితిలోనే విద్యుత్తు వినియోగం ఉండేలా కనెక్షన్ నమోదు అవుతుంది.
ఇక ఆర్‌ఎండీ అంటే రికార్డెడ్ మాగ్జిమమ్ డిమాండ్. ఒక నెల వ్యవధిలో ఇంట్లో ఒకేసారి ఎక్కువ విద్యుత్తు ఉపకరణాలు పనిచేసిన సమయంలో నమోదైన గరిష్ఠ విద్యుత్తు డిమాండ్ ఆర్‌ఎండీలో రికార్డవుతుంది. ఏసీ, గీజర్, వాషింగ్ మెషిన్, మోటార్ వంటి పరికరాలు ఒకేసారి పనిచేస్తే విద్యుత్తు వినియోగం ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో కాంట్రాక్టెడ్ లోడ్ ఒక కిలోవాట్ ఉన్న ఇంట్లో ఆర్‌ఎండీ మూడు కిలోవాట్లకు చేరిన సందర్భాలు కూడా ఉంటాయి.
కాంట్రాక్టెడ్ లోడ్ కంటే ఆర్‌ఎండీ ఎక్కువగా నమోదైతే దాన్ని అదనపు లోడ్ వినియోగంగా పరిగణించే అవకాశం ఉంది. ఆర్థిక సంవత్సరంలో ఏదైనా ఒక నెలలో కాంట్రాక్టెడ్ లోడ్ కంటే ఎక్కువ డిమాండ్ నమోదైనా.. నిబంధనల ప్రకారం క్రమబద్ధీకరణ కోసం డెవలప్‌మెంట్ ఛార్జీలు చెల్లించాలని నోటీసులు జారీ చేస్తున్నారు.
అదనపు లోడ్ క్రమబద్ధీకరణ సమయంలో డెవలప్‌మెంట్ ఛార్జీలు, సెక్యూరిటీ డిపాజిట్‌తో పాటు వర్తించే సర్వీస్ లైన్ ఛార్జీలు కూడా చెల్లించాల్సి రావచ్చు. యునిఫైడ్ లైన్ ఛార్జీల విధానం అమల్లోకి వచ్చిన తర్వాత కొంతమంది వినియోగదారులకు ఈ మొత్తం మరింత పెరిగింది.
అంబర్‌పేటకు చెందిన ఒక వినియోగదారుడి ఉదాహరణను తీసుకుంటే.. ఆయనకు అనుమతించిన కాంట్రాక్టెడ్ లోడ్ ఒక కిలోవాట్. తనిఖీ సమయంలో మూడు కిలోవాట్ల లోడ్ వినియోగిస్తున్నట్లు గుర్తించారు. అంటే రెండు కిలోవాట్ల అదనపు లోడ్ నమోదైంది. దీనికి కిలోవాట్‌కు 1200 రూపాయల చొప్పున రెండు కిలోవాట్లకు 2400 రూపాయల డెవలప్‌మెంట్ ఛార్జీలు, కిలోవాట్‌కు 200 రూపాయల చొప్పున 400 రూపాయల సెక్యూరిటీ డిపాజిట్ విధించారు. దీనికి అదనంగా 1200 రూపాయల సర్వీస్ లైన్ ఛార్జీ కలిపి మొత్తం 4000 రూపాయలు చెల్లించాలని నోటీసు ఇచ్చారు. అయితే వినియోగదారుని వద్ద చెల్లించిన రుసుముల రసీదు ఉంది కాబట్టి రెండోసారి వేసిన ఛార్జీలనుంచి తప్పించుకోగలిగారు. లేదంటే రెండోసారి కూడా కట్టాల్సి వచ్చేది.
ఇక సర్వీస్ లైన్ ఛార్జీలు ప్రతి వినియోగదారుడికి ఒకే విధంగా ఉండవు. వినియోగదారుడి నివాసానికి విద్యుత్తు నెట్‌వర్క్ మధ్య ఉన్న దూరాన్ని బట్టి ఈ ఛార్జీలు మారే అవకాశం ఉంటుంది. ఇక నోటీసు అందుకున్న వినియోగదారులు సాధారణంగా 30 రోజుల్లోపు సంబంధిత రుసుములు చెల్లించి అదనపు లోడ్‌ను క్రమబద్ధీకరించుకోవాలి. ఛార్జీలపై అభ్యంతరం ఉంటే నోటీసు అందుకున్న 15 రోజుల్లోపు డీఈ స్థాయి అధికారికి అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. గడువులోపు రుసుములు చెల్లించకపోతే విద్యుత్తు సరఫరాను నిలిపివేసే అవకాశం కూడా ఉంది.
అయితే రుసుములు చెల్లించడంతో ప్రక్రియ పూర్తయిందని భావించకుండా.. ఆ తర్వాతి నెల విద్యుత్తు బిల్లును వినియోగదారులు తప్పనిసరిగా పరిశీలించాలి. బిల్లుపై కాంట్రాక్టెడ్ లోడ్ సరిగ్గా పెరిగిందో లేదో చూసుకోవాలి. కొన్ని సందర్భాల్లో రుసుములు చెల్లించినప్పటికీ లోడ్ క్రమబద్ధీకరణ నమోదు ఆలస్యమైన ఘటనలు ఉన్నట్లు తెలుస్తోంది. అటువంటి పరిస్థితుల్లో మళ్లీ తనిఖీ జరిగితే అదనపు ఛార్జీలకు సంబంధించిన నోటీసులు వచ్చే అవకాశం ఉంటుంది.
అందుకే రుసుములు చెల్లించినప్పుడు రసీదును తప్పనిసరిగా భద్రపరచుకోవాలి. అలాగే పాత బిల్లులు, నోటీసు, చెల్లింపు వివరాలు కూడా దగ్గర ఉంచుకోవాలి. భవిష్యత్తులో అదే అదనపు లోడ్‌పై మరోసారి ఛార్జీలు విధిస్తే.. ఇప్పటికే రుసుములు చెల్లించినట్లు నిరూపించడానికి ఇవే ఆధారాలుగా ఉపయోగపడతాయి.
మరోవైపు పాత విద్యుత్తు కనెక్షన్లలో కాలక్రమేణా పెరిగిన గృహోపకరణాల వినియోగం, అనుమతించిన లోడ్, వాస్తవ వినియోగం మధ్య తేడాలకు కారణమవుతోంది. అందువల్ల కాంట్రాక్టెడ్ లోడ్, ఆర్‌ఎండీ వివరాలను ఎప్పటికప్పుడు పరిశీలించడం, అదనపు లోడ్ నమోదైతే నిబంధనల ప్రకారం క్రమబద్ధీకరించుకోవడం, చెల్లించిన రుసుములకు సంబంధించిన రికార్డులను భద్రపరచుకోవడం వంటి జాగ్రత్తలు వినియోగదారులు తప్పక తీసుకోవాలని సూచిస్తున్నారు..









