తెలంగాణ

Cm Revanth: మన్మోహన్ సింగ్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం రేవంత్

రచన: NK•••5 నిమిషాల పఠనం

Cm Revanth: మాజీ ప్రధాని, ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించనుంది రాష్ట్ర ప్రభుత్వం.

Cm Revanth: మాజీ ప్రధాని, ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేసింది. గచ్చిబౌలిలోని ఐటీ కారిడార్ లో విప్రో సర్కిల్ వద్ద మన్మోహన్ సింగ్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి శనివారం ఆవిష్కరించనున్నారు.

స్మారక చిహ్నం కాదు.. శాశ్వత ప్రతీక

విగ్రహావిష్కరణ కార్యక్రమ ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా పరిశీలించారు. మన్మోహన్ సింగ్ దేశానికి చేసిన సేవలను ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ విగ్రహం కేవలం ఒక స్మారక చిహ్నం కాదన్నారు. దేశ నిర్మాణంలో మన్మోహన్ సింగ్ పోషించిన పాత్ర, ఆయన ఆర్థిక దార్శనికత, నిస్వార్థమైన ప్రజాసేవ, నిరాడంబర నాయకత్వ లక్షణాలను భవిష్యత్ తరాలకు తెలియజేసే శాశ్వత ప్రతీక అని మంత్రి పొన్నం తెలిపారు.

మహోన్నత ఆర్థికవేత్త

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జరగనున్న మన్మోహన్ సింగ్ కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మన్మోహన్ సింగ్ భారత ఆర్థిక ప్రగతికి దిశానిర్దేశం చేసిన మహోన్నత ఆర్థికవేత్త అని కొనియాడారు. 1991లో ఆర్థిక మంత్రిగా ఆయన చేపట్టిన ఆర్థిక సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక మార్పులకు దోహదపడ్డాయని కీర్తించారు. 2004 నుంచి 2014 వరకు ప్రధానిగా దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం అన్నారు. మన్మోహన్ హయాంలోనే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టం, విద్యా హక్కు చట్టం వంటివి అమల్లోకి వచ్చాయన్నారు.

మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో పార్లమెంట్ సభ్యుడిగా ఆయన మార్గదర్శకత్వంలో పనిచేసే అవకాశం తనకు లభించడం ప్రజా జీవితంలో తనకు ఎంతో గర్వకారణం అని పొన్నం అన్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి మన్మోహన్ సింగ్ అందించిన సహకారం, మార్గదర్శకత్వాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని మంత్రి పొన్నం చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో కీలక పాత్ర

''2009లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో మన్మోహన్ సింగ్ పాత్ర చరిత్రాత్మకం. తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు దిశగా అప్పటి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అనంతరం జరిగిన ప్రక్రియలో ఆయన నాయకత్వం కీలకం. 2009లో ప్రక్రియ ప్రారంభించాలని నాటి యూపీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం నుంచి 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు కేంద్రంలో మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వం కీలక పాత్ర పోషించింది.

రాష్ట్ర ఏర్పాటులో యూపీఏ ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ పాత్రను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది. హైదరాబాద్ గచ్చిబౌలిలో మన్మోహన్ సింగ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయన సేవలను స్మరించుకోవడం తెలంగాణ ప్రజలకు గర్వకారణం. మన్మోహన్ సింగ్ కు తగిన గౌరవం ఇస్తూ ముఖ్యమంత్రి రేవంత్ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయం'' అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

#Cm Revanth#Manmohan Singh Statue#Hyderabad#Gachibowli#Wipro Circle#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి