HAM Roads: తెలంగాణలో హ్యామ్ (హైబ్రిడ్ యాన్యుటీ మోడల్) రహదారుల నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. కాంట్రాక్టర్లు, ఉన్నతాధికారులతో మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. అక్టోబర్ 25 నుంచి రాష్ట్రవ్యాప్తంగా హ్యామ్ రహదారుల పనులు ప్రారంభించాలని చెప్పారు. గ్రామీణ తెలంగాణకు శాశ్వత మౌలిక వసతుల కల్పనే ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు. హ్యామ్ విధానంలో 18,472 కిలోమీటర్ల మేర గ్రామీణ రహదారులు అభివృద్ధి చేస్తామన్నారు. తొలి విడతలో 7,448 కిలోమీటర్ల రహదారుల అభివృద్ధి చేస్తామని, ఇందుకోసం 6 వేల కోట్లకు పైగా వ్యయం అవుతుందని మంత్రి సీతక్క వెల్లడించారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో 1,366 కిలోమీటర్ల మేర 445 రహదారులను అభివృద్ధి చేయనున్నారు.
అక్టోబర్ 25న పనులు ప్రారంభించాల్సిందే
గ్రామీణ తెలంగాణకు మెరుగైన, నాణ్యమైన రహదారి సౌకర్యాలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క స్పష్టం చేశారు. హ్యామ్ (HAM) విధానంలో చేపడుతున్న గ్రామీణ రహదారుల అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేసి, గ్రామీణ ప్రాంతాలకు శాశ్వత మౌలిక వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
హనుమకొండ కలెక్టరేట్‌లో శుక్రవారం ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల ప్రాంతీయ సమీక్షా సమావేశం నిర్వహించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి సీతక్క అధికారులతో సమీక్షించారు. హ్యామ్ రహదారుల నిర్మాణానికి సంబంధించి అధికారులతో పాటు కాంట్రాక్టర్లతో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఉన్నతాధికారులు, ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లు ఈ సమీక్షలో పాల్గొన్నారు. అనంతరం మీడియా సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడారు.
పనులు వేగంగా ప్రారంభించేలా చర్యలు
హ్యామ్ రహదారుల నిర్మాణానికి సంబంధించిన అగ్రిమెంట్లు ఇప్పటికే పూర్తయ్యాయని, పనుల ప్రారంభానికి అవసరమైన సాంకేతిక ప్రక్రియ కూడా పూర్తయిందని మంత్రి తెలిపారు. నిర్మాణ పనులకు ఎదురవుతున్న సమస్యలను అధికారులతో, కాంట్రాక్టర్లతో చర్చించి పరిష్కరించినట్లు చెప్పారు.
అక్టోబర్ 25న అన్ని ప్యాకేజీల్లో హ్యామ్ రహదారుల పనులు ప్రారంభించాల్సిందేనని కాంట్రాక్టర్లకు స్పష్టమైన దిశానిర్దేశం చేసినట్లు మంత్రి వెల్లడించారు. CE నుంచి EE స్థాయి వరకు అధికారుల పరిధిలోని హ్యామ్ రహదారుల పనులపై సమీక్షించి, పనులు వేగంగా ప్రారంభించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.
18,472 కిమీ మేర గ్రామీణ రహదారుల అభివృద్ధి
హ్యామ్ విధానంలో రాష్ట్రవ్యాప్తంగా మూడు విడతల్లో మొత్తం 18,472 కిమీ మేర గ్రామీణ రహదారులను అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు.
తొలి విడతలో 7,448 కిమీ మేర రహదారులను అభివృద్ధి చేయనున్నామని, ఇందుకోసం రూ.6 వేల కోట్లకు పైగా ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. తొలి విడతలో సుమారు 3 వేల గ్రామ పంచాయతీల పరిధిలో 2,145 రహదారులను అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. మొత్తం పనులను 17 సర్కిళ్లు, 17 ప్యాకేజీలుగా విభజించినట్లు మంత్రి వివరించారు.
15ఏళ్ల పాటు నాణ్యతకు కాంట్రాక్టర్లదే బాధ్యత
హ్యామ్ విధానంలో రహదారుల నిర్మాణంతో పాటు వాటి నిర్వహణకు కూడా ప్రాధాన్యత ఉంటుందని మంత్రి సీతక్క తెలిపారు. ప్రాజెక్టు వ్యయంలో 40 శాతం చెల్లింపులు ప్రస్తుత దశలో, మిగిలిన 60 శాతం నిధులను వచ్చే 15 ఏళ్లలో చెల్లించే విధానం అమలు చేస్తున్నట్లు చెప్పారు. దీంతో రహదారుల నిర్వహణకు దీర్ఘకాలిక బాధ్యత ఉంటుందని, 15 ఏళ్ల కాలంలో రహదారులు నాణ్యతతో నిర్వహించేలా వ్యవస్థ ఉంటుందని తెలిపారు. రహదారుల నాణ్యతకు కాంట్రాక్టర్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు.
ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో 445 రహదారులు
ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో 445 హ్యామ్ రహదారులను 1,366 కిమీ మేర అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఇందుకోసం సుమారు రూ.1,130 కోట్ల వరకు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. ఇందులో 90 శాతం మేర ఇప్పటికే ఉన్న రహదారులను అభివృద్ధి చేయడంతో పాటు, 10 శాతం మేర కొత్త రహదారులను నిర్మించనున్నట్లు పేర్కొన్నారు.
ప్రతి ఆవాసం నుంచి గ్రామ పంచాయతీకి, అక్కడి నుంచి మండల కేంద్రానికి, జిల్లా కేంద్రానికి, రాష్ట్ర రాజధానికి మెరుగైన రహదారి సౌకర్యం ఉండాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనకు అనుగుణంగా హ్యామ్ విధానంలో రహదారుల అభివృద్ధి చేపడుతున్నామని మంత్రి సీతక్క వివరించారు.
ఎల్‌నినో నేపథ్యంలో నీటి భద్రతకు ప్రాధాన్యం
ఎల్‌నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించి తీర్మానం చేసినట్లు మంత్రి తెలిపారు. దానికి అనుగుణంగా ప్రతి గ్రామంలో ముందస్తు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. రిజర్వాయర్లలో ఉన్న నీటిని తాగునీటి అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ జాగ్రత్తగా వినియోగిస్తున్నామని, ప్రస్తుతం రాష్ట్రంలో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిపారు. ప్రతి జలాశయంలో నీటి మట్టాలను ప్రతిరోజూ పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.
మిషన్ భగీరథ పరిధిలోని సమస్యాత్మక 86 జనావాసాల్లో తాగునీటి సరఫరాను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. ఆదివాసీ, గిరిజన ఆవాసాల్లో తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం పంచాయతీరాజ్ కమిషనర్ దివ్య దేవ రాజన్ నేతృత్వంలో ప్రత్యేక కమిటీ పనిచేస్తుందని వెల్లడించారు.
ప్రతి ఇంటికి ఇంకుడు గుంత.. ప్రతి పొలానికి పంట కుంట
ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టే లక్ష్యంతో నాలుగు నెలల క్రితమే జలసిరి కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు మంత్రి సీతక్క తెలిపారు. “ప్రతి ఇంటికి ఇంకుడు గుంత.. ప్రతి పొలానికి పంట కుంట.. ప్రతి ఊరికి ఊటకుంట” అనే లక్ష్యంతో నీటి సంరక్షణ చర్యలు చేపడుతున్నామన్నారు. ఉపాధి కోరిన ప్రతి కుటుంబానికి ఉపాధి హామీ పనులు కల్పిస్తున్నామని, ఇప్పటికే రూ.2 వేల కోట్లకు పైగా వేతనాలను ఉపాధి కూలీలకు చెల్లించినట్లు తెలిపారు.
అక్టోబర్ 2న గ్రామసభల ద్వారా వచ్చే ఏడాదికి సంబంధించిన గ్రామ సమగ్ర అభివృద్ధి ప్రణాళికను ప్రజలతో చర్చించి ఆమోదించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ఉపాధి హామీ ద్వారా కూలీలకు పని కల్పించడంతో పాటు గ్రామాలకు శాశ్వత ఆస్తులను సృష్టించడమే లక్ష్యమని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు ప్రాధాన్యం
మహిళా సంఘాలను బలోపేతం చేయడం ద్వారా పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి సీతక్క తెలిపారు. మహిళలు వ్యాపారాలు చేసుకునేందుకు బ్యాంకుల ద్వారా రుణాలు అందిస్తున్నామని, ఇప్పటివరకు రూ.67 వేల కోట్ల బ్యాంకు రుణాలు అందించినట్లు చెప్పారు. దీంతో సుమారు 6 లక్షల వరకు కుటీర, చిన్న తరహా వ్యాపారాలను మహిళలు ఏర్పాటు చేసుకోగలిగారని వెల్లడించారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, ఇందిరమ్మ ఇళ్లను సైతం మహిళల పేరుపైనే మంజూరు చేస్తున్నామని మంత్రి సీతక్క అన్నారు. ఆడబిడ్డ ఇంటికి యజమాని అయినందున వారి గౌరవం పెరుగుతోందన్నారు. ఇళ్ల నుంచి మహిళలను వెళ్ళగొట్టే సంస్కృతి పోయిందన్నారు.







