మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తమ దర్యాప్తును తీవ్రతరం చేసింది. ఈ కేసులో భారీ ఎత్తున మనీలాండరింగ్, హవాలా లావాదేవీలు చోటుచేసుకున్నాయన్న కోణంలో విచారణ జరుపుతున్న అధికారులు, రెండో నిందితుడైన (A2) సునీల్ యాదవ్‌ను హైదరాబాద్‌లోని తమ ప్రాంతీయ కార్యాలయంలో వరుసగా రెండో రోజు కూడా సుదీర్ఘంగా విచారిస్తున్నారు.
హత్యకు ముందు, ఆ తర్వాత జరిగిన అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు, బ్యాంక్ ఖాతాల వివరాలు, రూటింగ్‌పై ఈడీ అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు. హత్య కోసం దాదాపు రూ.40కోట్ల సుపారీ డీల్ జరిగిందనే ఆరోపణలు, అందులో భాగంగా రూ.5కోట్ల నిధుల మళ్లింపు, అప్రూవర్‌గా మారిన దస్తగిరికి రూ.1కోటి ఇచ్చారనే అంశాలపై ఈడీ అధికారులు సునీల్ యాదవ్‌ను ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటికే గత రెండు రోజుల్లో గంటల తరబడి సాగిన విచారణలో సునీల్ యాదవ్ తన బ్యాంక్ ఖాతాల వివరాలను అధికారులకు సమర్పించినట్లు తెలుస్తోంది. మరోవైపు, ఈ కేసులో ఏ-1గా ఉన్న ఎర్రగంగిరెడ్డి, ఏ-3 ఉమాశంకర్‌రెడ్డిలకు కూడా ఈడీ సమన్లు జారీ చేసి, ఈ నెల 27, 28 తేదీల్లో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.
వివేకా హత్య కేసు వెనుక ఉన్న ఆర్థిక మూలాలను, నిధుల మూలాలను సమగ్రంగా వెలికితీసేందుకు ఈడీ శ్రమిస్తోంది. సునీల్ యాదవ్ , ఇతర నిందితుల నుంచి సేకరించిన సమాచారం, దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా రాబోయే రోజుల్లో ఈ కేసుతో సంబంధం ఉన్న మరికొందరు ముఖ్యమైన రాజకీయ నాయకులకు, కీలక వ్యక్తులకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.












