రాష్ట్రవ్యాప్తంగా గణపతి నిమజ్జన ఉత్సవాలు ఎంతో వైభవంగా,భక్తుల కోలాహలం నడుమ కొనసాగుతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా గణనాథులు గంగమ్మ ఒడికి చేరుకుంటున్నారు. లా అండ్ ఆర్డర్ సమస్య రాకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు.క్యూ లైన్లలో గణపయ్యలు నిమజ్జనం కోసం బారులు తీరాయి. యువత నిమజ్జన వేడుకల్లో ఆటపాటలతో సందడి చేస్తున్నారు.
ఇదిలాఉండగా, హైదరాబాద్ మహానగరంలో అత్యంత వైభవంగా, కోలాహలంగా వినాయక నిమజ్జన మహోత్సవాలు కొనసాగుతున్నాయి. తొమ్మిది రోజుల పాటు నగరవాసులు ఎంతో భక్తిశ్రద్ధలతో పూజించిన ప్రసిద్ధ ఖైరతాబాద్ శ్రీ పంచముఖ సంకటహర మహా గణపతి నిమజ్జన ప్రక్రియ ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేసిన క్రేన్ నెం.5 వద్ద ప్రశాంతంగా ముగిసింది. భక్తుల జయధ్వానాలు, ‘గణపతి బప్పా మోరియా’ నినాదాల నడుమ మహాగణపతికి అశేష భక్తజనం భావోద్వేగంతో.. ‘మళ్లీ రావయ్య గణపయ్యా’ అంటూ బడా గణేశ్‌కు వీడ్కోలు పలికారు.
ఇదిలాఉండగా, ఉదయం క్రేన్‌లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా శోభాయాత్ర ప్రారంభం కాస్త ఆలస్యమైంది. అధికారుల సమన్వయంతో నిర్ణీత సమయానికి శోభాయాత్ర ప్రశాంతంగా కొనసాగింది. టెలిఫోన్ భవన్, సెక్రటేరియట్ మీదుగా హుస్సేన్‌సాగర్ వద్దకు మహా గణపతి చేరుకున్నాడు. బడా గణేషుడిని కడసారి కళ్లారా చూసేందుకు, నిమజ్జన వేడుకలో భాగం అయ్యేందుకు వేలాదిగా తరలివచ్చిన భక్తులతో హుస్సేన్‌సాగర్ తీరం కిటకిటలాడింది.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు, మున్సిపల్ అధికారులు, వివిధ శాఖల సమన్వయంతో పకడ్బందీ భద్రత మధ్య నిమజ్జన ఘట్టాన్ని పూర్తి చేశారు. నగరవ్యాప్తంగా సాగిన వినాయక నిమజ్జన శోభాయాత్ర ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, నగరం నలుమూలల నుంచి తరలివచ్చిన గణనాధుల నిమజ్జనం కొనసాగుతోంది. ట్రాఫిక్ నియంత్రణలో పోలీసులు, అధికారులు నిమగ్నమయ్యారు.












