రుద్రాక్షలు ధరించడం వల్ల ఏం జరుగుతుంది.. అనే విషయానికి సనాతన ధర్మంలో ఎంతో లోతైన ఆధ్యాత్మిక అర్థం ఉంది. రుద్రాక్ష అంటే శివునికి అత్యంత ప్రీతికరమైనదిగా శైవ సంప్రదాయంలో భావించే పవిత్ర మాల అని పండితులు చెబుతారు.
రుద్ర అంటే పరమశివుడు.. అక్ష అంటే కన్ను లేదా కన్నీటి బిందువు అనే అర్థాలు ఉన్నాయి. పురాణల విశ్వాసం ప్రకారం, లోకక్షేమం కోసం పరమశివుడు ధ్యానంలో లీనమైనప్పుడు ఆయన నేత్రాల నుంచి జారిన కన్నీటి బిందువుల నుంచి రుద్రాక్ష వృక్షాలు ఉద్భవించాయని చెబుతారు. అందుకే రుద్రాక్షను శివుని అనుగ్రహానికి ప్రతీకగా భావిస్తారు.
ఇక రుద్రాక్షను మెడలో ధరించడం, చేతికి కట్టుకోవడం లేదా జపమాలగా ఉపయోగించడం అనేది భక్తుడిని శివస్మరణలో నిలిపే సాధనగా పరిగణిస్తారు. ముఖ్యంగా రుద్రాక్ష మాలతో ఓం నమః శివాయ వంటి మంత్రాలను జపించడం ద్వారా మనస్సును ఏకాగ్రం చేసుకునే ఆధ్యాత్మిక అభ్యాసం కొనసాగుతుందని పేర్కొంటారు. మన ఆధ్యాత్మిక సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన రుద్రాక్షలు ప్రధానంగా 14 రకాలుగా లభిస్తాయి.
అవి ఏక ముఖి, ద్వి ముఖి, త్రి ముఖి, చతుర్ముఖి, పంచ ముఖి, షణ్ముఖి, సప్త ముఖి, అష్ట ముఖి, నవ ముఖి, దశ ముఖి, ఏకాదశ ముఖి, ద్వాదశ ముఖి, త్రయోదశ ముఖి మరియు చతుర్దశ ముఖి రుద్రాక్ష. ఇవే కాకుండా గౌరీ శంకర్, గణేష్ రుద్రాక్షలు కూడా ప్రసిద్ధి చెందాయి. మన సంప్రదాయంలో ఒక్కో ముఖికి ఒక్కో దేవతా తత్త్వాన్ని, ఆధ్యాత్మిక ప్రాధాన్యాన్ని అనుసంధానించారు.
అయితే రుద్రాక్ష ధరించడం మాత్రమే జీవితంలోని సమస్యలను మాయ చేస్తుందనే భావన కంటే.. దానిని భక్తి, నియమం, సద్భావనతో కూడిన సాధనలో భాగంగా చూడటం శాస్త్రోక్త సంప్రదాయానికి దగ్గరగా ఉంటుంది. అలాగే రుద్రాక్ష ధరించిన వ్యక్తి శుచిత్వం, సాత్విక ఆహారం, మంచి ఆలోచనలు, దైవస్మరణ వంటి నియమాలను పాటించాలనే ఆచారం కూడా కొన్ని సంప్రదాయాల్లో కనిపిస్తుంది.
ఇక శివుడిని స్మరిస్తూ రుద్రాక్షను ధరించినప్పుడు.. అది మనకు ఒక ఆధ్యాత్మిక సందేశాన్ని గుర్తుచేస్తుంది. అహంకారాన్ని తగ్గించుకోవాలి.. మనస్సును ప్రశాంతంగా ఉంచాలి.. కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి.. ధర్మబద్ధమైన జీవనాన్ని కొనసాగించాలని అందుకే రుద్రాక్షను ధరించడం అంటే శివతత్త్వాన్ని జీవితంలోకి ఆహ్వానించుకునే ఒక భక్తి సంకల్పంగా సనాతన సంప్రదాయం భావిస్తుంది. రుద్రాక్షతో పాటు శివస్మరణ, మంత్రజపం, ధ్యానం, సాత్విక జీవనం కలిసినప్పుడే దాని ఆధ్యాత్మిక ప్రయోజనం మరింత అర్థవంతంగా మారుతుందని మన శాస్త్రాలు వివరిస్తున్నాయి..
గమనిక: ఇక్కడ అందించిన వివరాలు కేవలం సాంప్రదాయ పురాణ విశ్వాసాలు మరియు ఆధ్యాత్మిక భావనల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటిని కేవలం మతపరమైన విశ్వాసాల కోణంలోనే చూడాలి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత రంగ నిపుణులను సంప్రదించడం మంచిది.












