దేశంలో దొంగ బాబాలు, అఘోరీల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. మంత్రాల పేరిట అమాయకులను మోసం చేయడం వారికి అలవాటుగా మారింది. పూజలు చేస్తే లాభాలు బాగా వస్తాయని ఎదుటి వ్యక్తులను నమ్మించి మోసం చేయడంతో పాటు అందినకాడికి దోచుకుని డబ్బులతో ఉడాయిస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవలి కాలంలో అనేకం వెలుగుచూస్తున్నాయి. పోలీసులు ఇలాంటి వారి మీద చర్యలు తీసుకుంటున్నా వారి ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేదని పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగుచూసింది. గుర్తుతెలియని మోసగాడు అఘోరీ వేషంలో ఓ బంగారు షాపులోకి వచ్చాడు.హర్ హర్ మహదేవ్ అనుకుంటూ ఎంట్రీ ఇవ్వడంతో పాటు అక్కడే ఉన్న యజమానికి మాయమాటలు చెప్పాడు. మీ భవిష్యత్ చెప్తానంటూ జ్యువెలరీ షాప్ ఓనర్‌ను నమ్మించేందుకు అఘోరీ యత్నించాడు. పెట్టుబడుల్లో లాభాలు వచ్చేలా చేస్తానని, ఓ నోట్ల కట్ట అడిగి తీసుకున్నాడు. ఏవేవో మంత్రాలు చదువుతూ ఆ నోట్ల కట్టను దుకాణదారుడికి తెలియకుండా దాచేశాడు.
చివర్లో ఆశీర్వదీస్తానని చెప్పి డబ్బులు నోట్లో పెట్టుకున్నట్టు నటించి అక్కడి నుంచి మెల్లిగా జారుకున్నాడు.హర్ హర్ మహదేవ్ అని ప్రార్థిస్తూ.. జారుకున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, డబ్బుల కట్టతో ఉడాయించిన అఘోరీ బాబా మీద బాధిత దుకాణా యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు యూపీ పోలీసులు తెలిపారు. గుర్తుతెలియని మోసగాళ్లు బాబాల రూపంలో వచ్చి బిజినెస్ పెంచుతామని, పూజలు చేస్తామని వివరాలు అడిగినా ఇవ్వొద్దని.. అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. కాగా, పూజల పేరిట మహిళలను లోబరుచుకుని వారిని బ్లాక్ మెయిల్ చేయడంతో పాటు డబ్బులు గుంజుతున్న ఘటనలు ఇప్పటివరకు చాలానే వెలుగుచూసిన విషయం తెలిసిందే.










