ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ యువశక్తి నైపుణ్యాలపై పసందైన ప్రశంసల వర్షం కురిపించారు. అంతరిక్ష పరిశోధనల నుంచి అంతర్జాతీయ శాస్త్ర పోటీల వరకు భారతీయ యువత సాధిస్తున్న విజయాలు దేశానికే గర్వకారణంగా నిలుస్తున్నాయని వ్యాఖ్యానించారు. యువతలో దాగి ఉన్న అపారమైన సామర్థ్యమే రేపటి 'వికసిత్ భారత్' నిర్మాణానికి బలమైన పునాది అని ఆయన ఉద్ఘాటించారు.
తన రేడియో ప్రసంగం 'మన్ కీ బాత్' ద్వారా ప్రధాని మాట్లాడుతూ.. ఇటీవల విజయవంతమైన 'విక్రమ్-1' రాకెట్ ప్రయోగాన్ని భారత అంతరిక్ష రంగంలో ఒక చారిత్రాత్మక మలుపుగా ప్రధాని అభివర్ణించారు. ఒకప్పుడు ప్రభుత్వానికే పరిమితమైన అంతరిక్ష రంగాన్ని ప్రైవేటు భాగస్వామ్యానికి తెరిచి యువతకు అవకాశాలు కల్పించడం వల్లనే ఈరోజు నూతన ఆవిష్కరణలు సాధ్యమవుతున్నాయని తెలిపారు. మన యువ ఆవిష్కర్తల నైపుణ్యం, పట్టుదలతో సాధించిన ఈ విజయం ప్రతి భారతీయుడి హృదయాన్ని గర్వంతో నింపిందని కొనియాడారు.
అంతరిక్షంతో పాటు సైన్స్ విభాగంలోనూ మన విద్యార్థులు ప్రపంచ వేదికలపై భారత జెండాను రెపరెపలాడించారని ప్రధాని ఆనందం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన అంతర్జాతీయ సైన్స్ ఒలింపియాడ్స్‌లో మన విద్యార్థులు అపూర్వమైన ప్రతిభ చూపారని కొనియాడారు. ముఖ్యంగా ఫిజిక్స్ ఒలింపియాడ్‌లో ఐదుగురు విద్యార్థులూ స్వర్ణ పతకాలు సాధించి భారత్‌ను అగ్రస్థానంలో నిలపగా, కెమిస్ట్రీలో పాల్గొన్న వారందరూ స్వర్ణాలు సాధించి ఆల్-టైమ్ రికార్డు సృష్టించారని చెప్పారు.
వీటితో పాటు బయాలజీ, మ్యాథమెటిక్స్ (రెండు స్వర్ణాలు, నాలుగు రజతాలు) విభాగాల్లోనూ సాధించిన పతకాలు భారత విద్యా ప్రమాణాలకు నిదర్శనమని పేర్కొన్నారు. దేశ యువత ప్రదర్శిస్తున్న ఈ అసమాన ప్రతిభ ప్రతి ఒక్కరిలోనూ నూతన ఉత్సాహాన్ని నింపుతోందని మోదీ ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో మన యువత మరిన్ని హ్యాకథాన్లు, గ్లోబల్ ఒలింపియాడ్లలో భాగస్వాములై దేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచవ్యాప్తంగా మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తారనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.












