ప్రేమకు సరిహద్దులు లేవని, హృదయాల కలయికకు సంస్కృతుల భేదం అడ్డంకి కాదని తణుకులో జరిగిన ఓ వినూత్న పెళ్లి వేడుక నిరూపించింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పాతవూరుకు చెందిన బొప్పనపల్లి ప్రియదర్శిని, స్పెయిన్ దేశానికి చెందిన అమిన్ అల్ రహాద్ దంపతులు తెలుగు సంప్రదాయబద్ధంగా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. స్థానిక సీఎం ఫంక్షన్ హాలులో ఇరు కుటుంబాల పెద్దల ఆశీస్సులతో వైభవంగా జరిగిన ఈ కల్యాణం స్థానికులను విశేషంగా ఆకట్టుకుంది.
ఉన్నత విద్యను అభ్యసించే క్రమంలోనే ఈ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఏడేళ్ల క్రితం ఎంఎస్ చదివేందుకు స్పెయిన్ వెళ్లిన ప్రియదర్శినికి, మాడ్రిడ్‌కు చెందిన పీహెచ్‌డీ పరిశోధకుడు అమిన్ అల్ రహాద్‌తో పరిచయం ఏర్పడింది. కాలక్రమేణా ఒకరి సంస్కృతిని, వ్యక్తిత్వాన్ని మరొకరు అర్థం చేసుకుంటూ పెంచుకున్న ఆ అనుబంధం గాఢమైన ప్రేమగా మారింది. ఒకరికొకరు తోడుగా జీవితాంతం కలిసుండాలని భావించిన ఈ జంట, తమ ప్రేమను వివాహ బంధంగా మార్చుకోవాలని నిర్ణయించుకుంది.
కష్ట సమయాల్లో అండగా నిలిచిన తల్లి ప్రేమ, ఇరు కుటుంబాల ఆమోదం ఈ ప్రేమకథకు హ్యాపీ ఎండింగ్ ఇచ్చింది. తండ్రి లేని లోటు తెలియకుండా ప్రైవేట్ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తూ కుమార్తెను ఉన్నత చదువులు చదివించిన తల్లి భారతి, కుమార్తె ఇష్టాన్ని గౌరవిస్తూ పెళ్లికి సంతోషంగా అంగీకరించారు. అటు స్పెయిన్‌లోని అమిన్ కుటుంబ సభ్యులు కూడా ఈ బంధాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానించడంతో పెళ్లి పీటల వరకు చేరింది.
ఈ అరుదైన వేడుక కోసం అమిన్ కుటుంబ సభ్యులు స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ నుంచి ప్రత్యేకంగా తణుకు రావడం విశేషం. మన పద్ధతులు, కట్టుబాట్లను పాటిస్తూ సాగిన ఈ వివాహ మహోత్సవంలో ఇరు దేశాల సంస్కృతుల సమ్మేళనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ అరుదైన జంటను ఆశీర్వదించారు.












