International

Saudi Arabia: పశ్చిమాసియాలో ఉద్రిక్తత.. సౌదీ అరామ్‌కో రిఫైనరీపై హూతీల డ్రోన్ దాడి?

రచన: Venu5 నిమిషాల పఠనం

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. ఒకవైపు అమెరికా–ఇరాన్ ఘర్షణలతో పరిస్థితులు ఆందోళనకరంగా మారగా.. మరోవైపు సౌదీ అరేబియా–హూతీ తిరుగుబాటుదారుల మధ్య దాడులు ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నాయి.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. ఒకవైపు అమెరికా–ఇరాన్ ఘర్షణలతో పరిస్థితులు ఆందోళనకరంగా మారగా.. మరోవైపు సౌదీ అరేబియా–హూతీ తిరుగుబాటుదారుల మధ్య దాడులు ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నాయి. ఇరాన్ మద్దతు ఉన్న హూతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాలోని కీలక చమురు సంస్థలను లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రకటించారు.

సౌదీ అరేబియాలోని అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రాల్లో ఒకటైన రాస్ తనురా రిఫైనరీపై డ్రోన్ దాడి జరిగినట్లు సమాచారం. ఈ రిఫైనరీ సౌదీ అరామ్‌కోకు చెందిన కీలక చమురు సంస్థల్లో ఒకటి. దాడి అనంతరం రిఫైనరీ పరిసరాల్లో భారీగా మంటలు ఎగిసిపడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

దాడి నేపథ్యంలో రిఫైనరీని తాత్కాలికంగా మూసివేసినట్లుతెలుస్తుంది.. అయితే, ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చినట్లు సమాచారం. ఈ ఘటనలో ఇప్పటివరకు జరిగిన ప్రాణ, ఆస్తి నష్టంపై పూర్తి వివరాలు ఇంకా తెలియలేదు.

మరోవైపు యెమెన్‌పై సౌదీ అరేబియా జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారంగానే ఈ దాడులు చేపట్టినట్లు హూతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. యెమెన్‌పై కొనసాగుతున్న దిగ్బంధనాన్ని ఎత్తివేసే వరకు ఎర్ర సముద్రంలో నౌకల రాకపోకలను అడ్డుకుంటామని హెచ్చరించారు. అంతేకాదు.. సౌదీ అరేబియాకు చెందిన నౌకలను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని కూడా హూతీలు ప్రకటించినట్లు సమాచారం.

దీంతో ఎర్ర సముద్ర ప్రాంతంలో పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే అమెరికా–ఇరాన్ ఘర్షణల కారణంగా అంతర్జాతీయ చమురు మార్కెట్లు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో చమురు సరఫరాపై ఆందోళనలు పెరిగాయి.

ఇప్పుడు హూతీ తిరుగుబాటుదారులు మరో కీలక సముద్ర మార్గమైన బాబ్ ఎల్-మాండెబ్ జలసంధిని మూసివేస్తామని ప్రకటించడం మరింత ఆందోళనకు కారణమవుతోంది. ఎర్ర సముద్రాన్ని గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌తో అనుసంధానించే బాబ్ ఎల్-మాండెబ్ జలసంధి.. ఆసియా, యూరప్ మధ్య సముద్ర వాణిజ్యానికి అత్యంత కీలకమైన మార్గం. ఈ మార్గంలో అంతరాయం ఏర్పడితే చమురు రవాణాతో పాటు ప్రపంచ వాణిజ్య సరఫరా వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.

హర్ముజ్ జలసంధి, బాబ్ ఎల్-మాండెబ్ వంటి కీలకమైన సముద్ర మార్గాల్లో ఉద్రిక్తతలు కొనసాగితే.. చమురు రవాణా నౌకలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాల్సి రావచ్చు. దీనివల్ల రవాణా సమయం, ఖర్చులు పెరగడంతో పాటు ప్రపంచ మార్కెట్లలో చమురు ధరలపై మరింత భారం పడే అవకాశం ఉంది. ఇక ప్రపంచ చమురు రవాణాకు హర్ముజ్ జలసంధి.. బాబ్ ఎల్-మాండెబ్ జలసంధి.. ముఖ్యమైన మార్గాలు.. రెండు మార్గాల్లో ఉద్రిక్తతలు నెలకొనడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది.

#International#Arabia-Houthis#Saudi Aramco#Hormuz#drone attack
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి