తోటి కళాకారులు ఆపదలో ఉన్నప్పుడు వారికి అండగా నిలవడంలో మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ ముందుంటారు. తాజాగా బ్రెయిన్ స్ట్రోక్‌తో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నటుడు రమేశ్ కుటుంబానికి ఆయన ఆర్థిక సాయం అందించి మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. అయితే.. ఇది ఒక్క రమేశ్ కుటుంబానికే పరిమితమైన సహాయం కాదు. పలు సందర్భాలలో మెగా కుటుంబం కళాకారులకు, అభిమానులకు, ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలుస్తోంది.
ఇక గబ్బర్ సింగ్ తో పాటు పలు చిత్రాల్లో నటించిన నటుడు రమేశ్ ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి.. ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి రమేశ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి చికిత్స కోసం రమేష్ భార్యకు రూ.3 లక్షల చెక్కును అందించారు.
అలాగే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్య బీమా పథకం ద్వారా అవసరమైన సహాయం అందేలా సిఫార్సు చేస్తానని హామీ ఇచ్చారు. మరోవైపు చిరంజీవి సోదరుడు, నటుడు నాగబాబు కూడా తన వంతు సాయంగా రమేశ్ కుటుంబానికి రూ.2 లక్షల చెక్కును అందించారు. ఇక మెగా స్టార్ చిరంజీవి సేవా కార్యక్రమాలు కేవలం వ్యక్తిగత ఆర్థిక సాయానికే పరిమితం కాలేదు. ఆయన స్థాపించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రక్తదానం, నేత్రదానం వంటి కార్యక్రమాలు ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్నాయి.
ఈ సేవల ద్వారా అనేకమంది రోగులకు రక్తం అందడంతో పాటు.. నేత్రదానం, కార్నియా మార్పిడి ద్వారా పలువురికి చూపు లభించింది. కరోనా సమయంలో సినీ పరిశ్రమకు చెందిన వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయినప్పుడు కూడా చిరంజీవి ముందుకొచ్చారు. సినీ కార్మికులకు నిత్యావసర సరుకులు, వైద్య సహాయం అందించేందుకు ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ ఛారిటీ ద్వారా పరిశ్రమలోని అనేక కుటుంబాలకు సహాయం అందించారు.
సీనియర్ నటి పావలా శ్యామ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సమయంలో కూడా చిరంజీవి ఆమెకు ఆర్థిక సాయం అందించారు. అనంతరం ఆమెకు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ద్వారా లభించే సభ్యత్వం, పెన్షన్, బీమా వంటి ప్రయోజనాలు అందేలా అండగా నిలిచారు. ఇలా కష్టాల్లో ఉన్న కళాకారులు, సినీ కార్మికుల విషయంలో చిరంజీవి పలుమార్లు తన మానవత్వాన్ని చాటుకున్నారు.
ఇక మెగాస్టార్ చిరంజీవి మాత్రమే కాదు.. ఆయన సోదరుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సీనియర్ నటి పాకీజా (వాసుకి)కి పవన్ కల్యాణ్ రూ.2 లక్షల ఆర్థిక సాయం అందించారు. అలాగే అరుదైన జన్యు వ్యాధితో బాధపడుతున్న ఓ అభిమాని చికిత్స కోసం కూడా తన వంతు ఆర్థిక సహాయం అందించి.. ఆ కుటుంబానికి భరోసా కల్పించారు.. ఈ క్రమంలో రమేశ్ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి సాధారణ జీవితంలోకి రావాలని చిరంజీవి ఆకాంక్షించారు.












