రేవంత్ సర్కార్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఎంప్లాయీ హెల్త్ బెనిఫిట్ స్కీం( ఈహెచ్ఎస్) పనిచేయడం లేదని తెలుస్తున్నది. త్వరలోనే ఉద్యోగులకు డిజిటల్ హెల్త్ కార్డ్స్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. వారి జీతాల నుంచి ఈహెచ్ఎస్ కోసం ప్రభుత్వం ప్రతినెలా డబ్బులు కూడా కట్ చేస్తున్నది. తీరా ఉద్యోగులు, పెన్షనర్లు వైద్యం కోసం ఆస్పత్రికి వెళ్లితే డాక్టర్లు చెప్పే మాట విని ఈహెచ్ఎస్ లబ్దిదారులు నోరెళ్లబెడుతున్నారు.
రాష్ట్రంలో పథకం ప్రారంభమై 10 రోజులు గడుస్తున్నా ఆసుపత్రుల్లో ఈహెచ్ఎస్ కార్డులు పనిచేయడం లేదని లబ్ధిదారులు అంటున్నారు. మొత్తంగా 8 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్ల కుటుంబ సభ్యులకు (29.80 లక్షల మంది లబ్ధిదారులకు) ఉచిత వైద్యం అందించేందుకు ఈ నెల 17వ తేదీన ఈహెచ్ఎస్ కార్డులను సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే.
https://x.com/TeluguScribe/status/2081255483252654198?s=20
ఈహెచ్ఎస్ కార్డుల కోసం గత రెండు నెలలుగా ఉద్యోగుల జీతం నుంచి 1.5% ప్రభుత్వం కోత పడుతోంది. 17న పథకం ప్రారంభం కావడంతో వైద్యం కోసం లబ్ధిదారులు లిస్టెడ్ ఆసుపత్రులకు వెళ్తున్నారు. ‘మీ కార్డులు పని చేయవని, డబ్బులు చెల్లించి వైద్యం చేయించుకోవాలని’ ఆసుపత్రి యాజమాన్యాలు తెలపడంతో వారు తీవ్ర నిరాశతో వెనుదిరుగుతున్న తెలిసింది.
ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి నిర్దిష్టమైన ప్రణాళికలు లేకపోవడం, జీవో విడుదల కాకపోవడం, ఆసుపత్రి యాజమాన్యాలకు సరైన మార్గదర్శకాలు అందకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని లబ్ధిదారుల ఆందోళన చెందుతున్నారు.
ఈ విషయంలో ఉద్యోగ సంఘాల నాయకులు, ట్రస్ట్ సభ్యులకు ఫోన్ చేసి మీరు ఏం చేస్తున్నారు? మీకు బాధ్యత లేదా? అంటూ లబ్ధిదారుల ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. మరోవైపు, తమకు రావాల్సిన రూ.570 కోట్ల పాత బకాయిలు చెల్లించి, ప్యాకేజీ రేట్లను సవరిస్తేనే ఈహెచ్ఎస్ పథకానికి సహకరిస్తామని ఆసుపత్రి యాజమాన్యాలు తేల్చి చెబుతున్నాయి. స్వయంగా చీఫ్ సెక్రెటరీ చైర్మన్‌గా ట్రస్ట్ ఏర్పాటు చేసినా, కార్డుల అమలులో పురోగతి లేకపోవడంతో లబ్ధిదారులు ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తుందని వాపోతున్నారు.












