టాప్ న్యూస్

Cauvery Water Dispute: కావేరి వివాదం.. సరిహద్దుల్లో స్థంభించిన రవాణా!

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

కావేరి నదీ జలాల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. కన్నడ సంఘాల ఆందోళనల నేపథ్యంలో రాజకీయాన్ని, రవాణాను తీవ్రంగా ప్రభావితం చేసింది. మేకెదాటు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా చెలరేగిన నిరసనల కారణంగా తమిళనాడు నుంచి కర్ణాటక వైపు వెళ్లే బస్సు సర్వీసులను అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు.

కావేరి నదీ జలాల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. కన్నడ సంఘాల ఆందోళనల నేపథ్యంలో రాజకీయాన్ని, రవాణాను తీవ్రంగా ప్రభావితం చేసింది. మేకెదాటు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా చెలరేగిన నిరసనల కారణంగా తమిళనాడు నుంచి కర్ణాటక వైపు వెళ్లే బస్సు సర్వీసులను అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా హోసూరు సరిహద్దు వద్దే వాహనాలను నిలిపివేయడంతో, తమిళనాడు-కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఈ ఆకస్మిక నిర్ణయంతో బెంగళూరు దిశగా వెళ్లే ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. తమిళనాడు వైపు నుంచి వచ్చిన బస్సులను హోసూరు వద్దే పరిమితం చేశారు. దీంతో గమ్యస్థానాలకు చేరేందుకు ప్రజలు ప్రత్యామ్నాయ దారులు వెతుక్కోవాల్సి వస్తోంది. కొందరు స్థానిక వాహనాల్లో సరిహద్దు వరకు చేరుకుని, అక్కడి నుంచి ఆటోలు, ఇతర ప్రైవేట్ వాహనాల ద్వారా అత్తిబెలె దాటి కర్ణాటకలోకి అడుగుపెట్టారు. దీంతో ప్రయాణ సమయం పెరగడమే కాకుండా, సాధారణ ప్రయాణికులపై అదనపు ఆర్థిక భారం పడింది.

అయితే బస్సులను మాత్రమే నియంత్రించిన యంత్రాంగం, ప్రైవేటు కార్లు, వాణిజ్య సరుకు రవాణా వాహనాల రాకపోకలకు మాత్రం వెసులుబాటు కల్పించింది. అదేవిధంగా కర్ణాటక నుంచి తమిళనాడు వైపు వచ్చే సర్వీసులు యథావిధిగా కొనసాగాయి. సరిహద్దుల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చూసేందుకు హోసూరు-అత్తిబెలె చెక్‌పోస్టుల వద్ద, ఇతర సున్నిత ప్రాంతాల్లో పోలీసు బలగాలను భారీగా మోహరించి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

దశాబ్దాలుగా కొనసాగుతున్న కావేరి జలాల రచ్చ, తాజాగా మేకెదాటు వద్ద కర్ణాటక నిర్మించ తలపెట్టిన రిజర్వాయర్ ప్రతిపాదనతో మళ్లీ పతాక స్థాయికి చేరింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే తమకు అందాల్సిన నీటి వాటా కోతపడుతుందని, ట్రిబ్యునల్ తీర్పులను ఉల్లంఘించడమేనని తమిళనాడు పట్టుబడుతోంది. ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొన్నప్పటికీ, అధికారులు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు.

 

#CauveryDispute#Karnataka#TamilNadu#MekedatuProject#HosurBorder#TransportHalt
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి