రాజకీయాల్లో మాటల యుద్ధాలు, విమర్శలు సర్వసాధారణమే. కానీ వ్యవస్థలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించిన విద్యార్థులను ఉద్దేశించి ఒక ఉన్నతాధికారి నోటి వెంట వచ్చిన ఆ ఒక్క చిన్న పదం.. దేశం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసింది. నీట్ (NEET) పరీక్షల లీకేజీలు, వరుస అక్రమాలపై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్న సమయంలో, నిరసనకారులను చిన్నచూపు చూడటాన్ని విద్యార్థులు అస్సలు జీర్ణించుకోలేకపోయారు. ఆ అవమానాన్నే తమ బలంగా మార్చుకుని, ఏకంగా ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) పేరిట ఒక చారిత్రాత్మక హక్కుల పోరాటానికి ఊపిరి పోశారు.
"బొద్దింకలు" (Cockroaches) అనే పదాన్ని ప్రయోగించారనే ఆరోపణల నుంచి ఈ పేరు పుట్టుకొచ్చింది. వ్యవస్థ తమ ఆవేదనను ఆలకించకపోగా, అవమానకరంగా మాట్లాడటాన్ని సవాల్‌గా తీసుకున్న విద్యార్థులు.. ఆ పదాన్నే తమ పోరాట ఆయుధంగా మలుచుకున్నారు. 'కాక్రోచ్ జనతా పార్టీ'(CJP) సంప్రదాయ రాజకీయ పార్టీ కాకపోయినా, యువత ఆక్రోశానికి, పట్టుదలకు ఈ ఉద్యమం ఒక నిలువుటద్దంగా నిలిచింది.
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ యువతను(Gen Z)/నిరసనకారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘యువత బొద్దింకల్లాంటి వాళ్లు. వారికి ఉద్యోగాలు ఉండవు. పనులూ ఉండవు. వారిలో కొందరు విలేకర్లు, సోషల్ మీడియా కార్యకర్తలు, సమాచార హక్కు చట్టం ప్రచార కార్యకర్తలుగా మారి అందరిపైనా దాడులు చేస్తారు’ అని వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలను నిరసిస్తూ ఆన్‌లైన్ ప్రచారాన్ని అభిజీత్ దీప్కే జూన్ 6న ప్రారంభించారు.
బోస్టన్ (USA)లో విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థి, సామాజిక కార్యకర్త అభిజీత్ దీప్కే ఈ వినూత్న Gen Z ఉద్యమానికి ప్రధాన శక్తిగా నిలిచారు. నీట్ (NEET) ప్రశ్నాపత్రాల లీకేజీతో భవిష్యత్తు అంధకారంలో పడిన వేలాది మంది బాధితులు, విద్యార్థులు ఈ ఉద్యమం కింద ఒకటయ్యారు. సోషల్ మీడియా వేదికగా ఆయన మే 16న ప్రారంభించిన CJP క్షణాల్లో వైరల్ అయింది. కొద్ది రోజుల్లోనే ప్రధాన పార్టీలను దాటేసి 2కోట్ల మంది ఫాలోవర్లను సంపాదించారు.
"మీరు మమ్మల్ని బొద్దింకలు అని చిన్నచూపు చూసినా సరే.. బొద్దింకల తరహాలోనే మేము ఏ పరిస్థితుల్లోనైనా తట్టుకుని నిలబడతాం, మా హక్కులను సాధించేవరకు అంతరించిపోం!"అంటూ వ్యంగ్యాత్మకంగా ఈ 'కాక్రోచ్ జనతా పార్టీ'కి శ్రీకారం చుట్టారు. కేవలం డిజిటల్ ప్రచారానికే పరిమితం కాకుండా, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వీరు చేపట్టిన ధర్నాలు, ఆందోళనలు జాతీయ స్థాయిలో కలకలం రేపాయి. నీట్ పరీక్షల లీకేజీ, అక్రమాలపై పూర్తిస్థాయి నిష్పాక్షిక విచారణ, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా, మెరిట్ విద్యార్థులకు న్యాయం చేయాలంటూ వీరి ప్రధాన డిమాండ్లు.
ఉద్యమం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చడం, విద్యార్థుల నిరసనలకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభించడంతో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. 'కాక్రోచ్ జనతా పార్టీ'కి వస్తున్న ఆదరణ, పెరుగుతున్న నిరసన జ్వాలల ముందు లొంగక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఆఖరికి కేంద్ర విద్యాశాఖ మంత్రి తన పదవికి రాజీనామా చేయక తప్పలేదు. ఒక చిన్న ప్రతీకాత్మక పేరుతో మొదలైన విద్యార్థుల నిరసన.. ఏకంగా కేంద్ర మంత్రి దిగివచ్చేలా చేయడమనేది భారత ప్రజాస్వామ్య చరిత్రలోనే అరుదైన ఘట్టం.












