ఈ కాలంలో మనుషులను నమ్మాలంటే సందేహిస్తున్నారు కావచ్చు.. కానీ సోషల్ మీడియాను మాత్రం గుడ్డిగా నమ్మే వారు ఎక్కువే అని చెప్పవచ్చు.. ఇందుకు ఉదాహరణ.. రూ.99కే స్మార్ట్‌వాచ్, రూ.149కే అన్‌లిమిటెడ్ బిర్యానీ, ఒకటి కొంటే రెండు ఉచితం, రూ.500కే మూడు బ్రాండెడ్ షర్టులు, ప్యాంట్లు వంటి ఆఫర్ లు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టడం కనిపిస్తుంది.
ఏ రీల్ ఓపెన్ చేసినా ఇలాంటి ఆఫర్లే కనిపిస్తున్నాయి. ఇన్‌ఫ్లుయెన్సర్లు చేసే ప్రమోషనల్ వీడియోలను నమ్మి షాపులకు వెళ్తున్న వినియోగదారులకు మాత్రం అక్కడ చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఉదయం లేచింది మొదలు మనిషి నిత్య జీవితంలో ఉపయోగించే దుస్తులు, ఆహారం, సబ్బులు, హోమ్ నీడ్స్, ఎలక్ట్రానిక్స్, మొబైల్స్.. ఇలా ప్రతి వస్తువుపైనా భారీ డిస్కౌంట్లు, ఉచిత ఆఫర్లు అంటూ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి.
అయితే ఆ వీడియోల్లో కనిపించే ఆఫర్లు నిజంగా అందరికీ వర్తిస్తాయా? లేక కస్టమర్లను షాపుల వరకు రప్పించేందుకు చేసే ప్రచారమా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్.. మొబైల్ కొంటే సైకిల్ ఉచితం అంటూ ఓ స్టోర్‌ను ప్రమోట్ చేశాడు. ఈ వీడియోను చూసిన పలువురు కస్టమర్లు మొబైల్ కొనుగోలు చేసేందుకు స్టోర్‌కు వెళ్లారు. అయితే అక్కడికి వెళ్లిన తర్వాత అసలు విషయం తెలిసి షాక్ అయ్యారు.
అధిక ధర ఉన్న ఒక నిర్దిష్ట బ్రాండ్ మొబైల్ కొంటేనే సైకిల్ ఉచితంగా ఇస్తాం. అది కూడా పరిమిత కాల ఆఫర్ అని స్టోర్ నిర్వాహకులు చెప్పడంతో కస్టమర్లు అవాక్కయ్యారు. ఈ షరతులేవీ ఇన్‌ఫ్లుయెన్సర్ చేసిన వీడియోలో స్పష్టంగా చెప్పకపోవడంతో.. ఓ కస్టమర్ నేరుగా అతడికి ఫోన్ చేసి నిలదీశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మరో వీడియోలో ఒక సబ్బు కొంటే రెండు ఉచితం.. హోమ్ నీడ్స్‌పై 70 శాతం వరకు డిస్కౌంట్ అంటూ ప్రచారం చేశారు. ఈ ఆఫర్‌ను నమ్మిన ఓ గృహిణి సరుకులు కొనుగోలు చేసేందుకు దుకాణానికి వెళ్లారు. ట్రాలీలో సరుకులు నింపుకుని, బిల్లింగ్ కౌంటర్ వద్దకు వెళ్లిన తర్వాత అసలు షరతు బయటపడింది. రూ.5,000కు పైగా కొనుగోలు చేస్తేనే సబ్బుల ఆఫర్ వర్తిస్తుందని సిబ్బంది చెప్పడంతో ఆమెకు షాక్ తగిలింది.
అప్పటికే సరుకులన్నీ ట్రాలీలో పెట్టడం, చాలాసేపు క్యూలో నిలబడటంతో.. ఖాళీ చేతులతో వెళ్లలేక సాధారణ ధరకే సరుకులు కొనుగోలు చేయాల్సి వచ్చింది. మరోవైపు రూ.500కే మూడు బ్రాండెడ్ షర్టులు, ప్యాంట్లు.. వెంటనే రండి అంటూ ఓ ఇన్‌ఫ్లుయెన్సర్ చేసిన వీడియోను చూసిన ఓ యువకుడు సుమారు 15 కిలోమీటర్లు ప్రయాణించి షాపుకు వెళ్లాడు. అయితే వీడియోలో చూపించిన నాణ్యమైన దుస్తులు కాకుండా పాత స్టాక్‌ను చూపించారు.
మంచి క్వాలిటీ దుస్తులు కావాలంటే రూ.2,000 చెల్లించాలి. వీడియోలో చూపించిన స్టాక్ ఇదే అని షాపు నిర్వాహకులు చెప్పడంతో.. సమయం, పెట్రోల్ వృథా చేసుకుని తిరిగి వెనక్కి వెళ్ళవలసి వచ్చింది. అలాగే మరోచోట ఒక చికెన్ బిర్యానీ కొంటే రెండు ఫ్రీ.. కేవలం రూ.250 మాత్రమే అంటూ ఓ ఫుడ్ వ్లాగర్ ప్రచారం చేసిన వీడియోను చూసి నలుగురు స్నేహితులు హోటల్‌కు వెళ్లారు. అక్కడ అప్పటికే భారీగా కస్టమర్లు క్యూలో ఉన్నారు.
అయితే వారు కౌంటర్ వద్దకు రాగానే.. ఈ ఆఫర్ మొదటి 50 మందికి మాత్రమే అని సిబ్బంది చెప్పడంతో.. ఆ షరతు ముందుగా ఎందుకు చెప్పలేదని ప్రశ్నించగా.. బోర్డు పెట్టడం మర్చిపోయాం అని సమాధానం ఇచ్చారు. దీంతో చేసేదేమీ లేక ఎక్కువ మొత్తానికి బిర్యానీ కొనుగోలు చేయాల్సి వచ్చిందని వారు వాపోయారు. ఇక ఒక స్టోర్ ఓపెనింగ్ ఆఫర్.. కేవలం రూ.99కే బ్రాండెడ్ స్మార్ట్‌వాచ్, ఇయర్‌బడ్స్ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ ప్రమోషన్ నిర్వహించారు.
ఈ వీడియో చూసిన ఓ కాలేజీ విద్యార్థిని వెంటనే షాపుకు వెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత ఆఫర్ కేవలం గంటసేపు మాత్రమే. ఇప్పుడు కొనాలంటే రూ.1,500 చెల్లించాలని సిబ్బంది చెప్పారు. దీంతో కస్టమర్లను షాపుకు రప్పించేందుకే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారనే విషయం ఆమెకు అర్థం అయ్యి అక్కడి నుండి వెళ్లిపోయారట.. అయితే సోషల్ మీడియాలో ఇన్‌ఫ్లుయెన్సర్లు చేసే ప్రతి వీడియోను నిజమైన రివ్యూగా భావించకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
చాలా సందర్భాల్లో కంపెనీలు లేదా వ్యాపార సంస్థలు డబ్బులు చెల్లించి తమ ఉత్పత్తులు, ఆఫర్లను ప్రమోట్ చేయించుకుంటుంటాయని చెబుతున్నారు. అందుకే కొందరు ఇన్‌ఫ్లుయెన్సర్లు ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పకుండా.. తాము స్వయంగా ఉపయోగించి సిఫార్సు చేస్తున్నట్లుగా వీడియోలు చేస్తుంటారు. ఫలితంగా వారి మాటలను నమ్మే సామాన్యులు మోసపోయే పరిస్థితి ఏర్పడుతోంది.
ఇక సోషల్ మీడియాలో ఏదైనా ఆఫర్ వీడియో కనిపించిన వెంటనే అక్కడికి వెళ్లకుండా ముందుగా కొన్ని విషయాలు పరిశీలించాలని నిపుణులు చెబుతున్నారు. ముందుగా వీడియో కింద ఉన్న కామెంట్లను పూర్తిగా చదవడం వల్ల.. ఇప్పటికే అక్కడికి వెళ్లిన కస్టమర్ల అనుభవాలు తెలుస్తాయి. మరోవైపు దుకాణానికి ఫోన్ చేసి ఆఫర్ నిబంధనలు, షరతులు స్పష్టంగా అడగాలి.
ఆఫర్ ఎప్పటి వరకు ఉంటుంది? ఎవరికి వర్తిస్తుంది? స్టాక్ ఎంత ఉంది? అనే విషయాలను తెలుసుకోవాలి. వీడియోలో చూపించిన వస్తువే ఆఫర్‌లో ఉందా? లేక వేరే ఉత్పత్తి కొనాల్సి ఉంటుందా? అని నిర్ధారించుకోవాలి. యాడ్‌కి, నిజమైన రివ్యూకి మధ్య తేడాను గుర్తించాలి.
సోషల్ మీడియాలో కనిపించే ప్రతి ఆఫర్ నిజమైన ఆఫర్ కాదు. కొన్ని సందర్భాల్లో అవి కేవలం కస్టమర్లను షాపుల వరకు రప్పించే మార్కెటింగ్ వ్యూహాలు మాత్రమే కావచ్చని గుర్తుంచుకోవాలని ఎక్స్ పర్ట్స్ అంటున్నారు. లేకపోతే డిస్కౌంట్ కోసం వెళ్లి.. చివరికి మీ డబ్బు, సమయం, పెట్రోల్ మూడింటినీ నష్టపోయే పరిస్థితి రావచ్చని సూచిస్తున్నారు..












