National

Rahul letter to amithshah: ‘విద్యార్థులపై పెల్లెట్ తుపాకులతో దాడి చేస్తారా..?’ అమిత్‌షాకు రాహుల్ గాంధీ ఘాటు లేఖ

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసు బలగాలు విరుచుకుపడటంపై పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఆదివారం ఉదయం 10.50గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఆయన ఒక ఘాటు లేఖ రాశారు.

ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసు బలగాలు విరుచుకుపడటంపై పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఆదివారం ఉదయం 10.50గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఆయన ఒక ఘాటు లేఖ రాశారు. ఈ మేరకు అట్టి లేఖను తన ‘ఎక్స్’ ఖాతాలో షేర్ చేశారు. జూలై 20న విద్యార్థులపై లాఠీఛార్జ్ చేయడం, బాష్పవాయు గోళాలు ప్రయోగించడం ప్రజాస్వామ్య విరుద్ధమని రాహుల్ ఖండించారు.

నిరసనకారులను అణచివేసేందుకు పెల్లెట్ తుపాకులు ఉపయోగించడం అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయమని లేఖలో పేర్కొన్నారు. ఈ దాడి కారణంగా చోటుచేసుకున్న నష్టాన్ని ప్రస్తావిస్తూ, పెల్లెట్ గన్ ప్రయోగం వల్ల 19 ఏళ్ల సాహిల్ లోచాబ్ అనే విద్యార్థి తీవ్రంగా గాయపడి కంటిచూపు కోల్పోయే స్థితికి వచ్చాడని ఆందోళన వ్యక్తం చేశారు. అసలు శాంతియుత ఆందోళనకారులపై పెల్లెట్ తుపాకులు, బలప్రయోగానికి ఎవరు అనుమతి ఇచ్చారో కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

అంతేకాకుండా, నిరసనకారులను లాఠీలతో తీవ్రంగా కొట్టిన సివిల్ డ్రెస్ వ్యక్తులు అసలు పోలీసులా లేక ఏవైనా ప్రైవేట్ ముఠాల వాలంటీర్లా? అని రాహుల్ గాంధీ లేఖలో నేరుగా ప్రశ్నించారు. ఈ అణచివేత చర్యల్లో యువతులతో సహా వందలాది మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం శాంతియుతంగా నిరసన తెలపడం ప్రజాస్వామ్యానికి మూలస్తంభమని, నిరసనకారులకు రక్షణ కల్పించాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వంపైనే ఉంటుందని గుర్తుచేశారు.

విద్యార్థుల సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించాల్సింది పోయి, వారిపై దాష్టీకానికి దిగడం సరికాదని రాహుల్ గాంధీ హితవు పలికారు. అణచివేతకు ఉసిగొల్పిన వారి వివరాలు బయటపెట్టాలని విద్యార్థులు కోరుతున్నారని స్పష్టం చేశారు.పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న సమయానికి సరిగ్గా ముందు రోజు రాహుల్ గాంధీ ఈ లేఖ రాయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర ప్రాధాన్యం సంతరించుకుంది.
https://x.com/RahulGandhi/status/2081248237193966055?s=20

 

#RahulGandhi#AmitShah#DelhiNews#StudentProtest#PelletGuns#ParliamentSession#IndianPolitics#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి