ప్రముఖ ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి వ్యవహారం కీలక మలుపు తిరిగింది. తాను మోసపోయానని బాధితురాలు మాధురి రాథోడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ నగరంలోని నార్సింగి పోలీసులు ఈశ్వర్ సాయిపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఈశ్వర్ సాయి పోలీసులకు అందుబాటులో లేకుండా పోవడంతో నిందితుడు పరారీలో ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు.
కొన్ని రోజుల క్రితం ఒక హోటల్ గదిలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. నగరంలోని ఒక హోటల్ గదిలో మాధురి రాథోడ్‌తో కలిసి ఉన్న సమయంలో ఈశ్వర్ సాయిని ఆయన భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఆ సమయంలో భార్య, ఈశ్వర్ సాయి, మాధురిల మధ్య తీవ్రస్థాయిలో గొడవ, రచ్చ జరిగాయి. ఈ ఘటన మీడియా, సోషల్ మీడియా వ్యాప్తంగా వైరల్ కావడంతో తీవ్ర దుమారం రేగింది. దీంతో ఈశ్వర్ సాయి రంగంలోకి దిగి, ఆ గొడవతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తనపై వస్తున్న ఆరోపణలన్నీ అబద్ధాలని చెప్పుకుంటూ తన ప్రవర్తనను సమర్థించుకునే ప్రయత్నం చేశాడు.
అయితే ఈశ్వర్ సాయి చేసిన ప్రకటనలను తిప్పికొడుతూ బాధితురాలు మాధురి రాథోడ్ చట్టపరమైన చర్యలకు పూనుకుంది. తనను నమ్మించి గొంతు కోశాడని, నమ్మించి శారీరకంగా లొంగదీసుకుని ఇప్పుడు ఏమీ తెలియనట్లు నటిస్తున్నాడని ఆధారాలతో సహా పోలీసులకు వివరించింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు తీవ్రతను గుర్తించిన నార్సింగి పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి విచారణ వేగవంతం చేశారు. పరారీలో ఉన్న ఈశ్వర్ సాయిని అరెస్ట్ చేయడానికి పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
నార్సింగి సీఐ ఆధ్వర్యంలో నిందితుడి ఆచూకీ కోసం రెండు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించి తీవ్రంగా గాలిస్తున్నారు. నిందితుడు దాక్కునే అవకాశం ఉన్న పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. పెళ్లి పేరుతో మోసం చేయడం, శారీరకంగా వాడుకోవడం వంటి తీవ్రమైన ఆరోపణలు ఉండటంతో ఈ కేసులో చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని, నిందితుడిని త్వరలోనే కస్టడీలోకి తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.











