రాష్ట్ర రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ అంశం కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. ఆమెకు ఢిల్లీ నుంచి పిలుపురావడంతో హుటాహుటిన బయలుదేరివెళ్లారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, మంత్రి పదవి నుంచి తొలగించాలని క్రమశిక్షణా కమిటీ నివేదిక ఇవ్వడంతో ఆమె సీడబ్ల్యూసీ మెంబర్ కేసీ వేణుగోపాల్ అపాయింట్‌మెంట్ కోరినట్టు సమాచారం. అయితే, ఢిల్లీకి వచ్చి మాట్లాడాలని ఆయన చెప్పడంతో మంత్రి హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరినట్టు తెలిసింది. కాగా, ఆమె విజ్ఞప్తిని అధిష్టానం ఆలకిస్తుందా? లేదా?? అనేది తెలియాల్సి ఉంది.
ఇదిలాఉండగా, సీఎం రేవంత్ రెడ్డి సైతం నేడు ఢిల్లీకి వెళ్లనున్నారని సమాచారం. అధిష్టానం నుంచి ఆయనకు సైతం పిలుపు రావడంతో వెళ్లనున్నట్టు తెలిసింది. కొండా సురేఖ అంశంపై అధిష్టానంతో చర్చలు జరుపుతారని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌తో రేవంత్ రెడ్డి సమావేశం అయ్యి.. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించాలని కోరనున్నట్లు తెలుస్తోంది.
అయితే, బీసీ సామాజిక వర్గానికి చెందిన కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగిస్తే.. బీసీల నుంచి తీవ్ర వ్యతిరేకత రావొచ్చని, అందుకే ఆమె మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పలువురు మంత్రులు అధిష్టానానికి విన్నవించినట్టు సమాచారం. ఇటీవల అదే బీసీ సామాజిక వర్గానికి చెందిన టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సైతం.. ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పించడం జరగదని పరోక్షంగా హింట్ ఇచ్చారు. ఆమెను తొలగించి మరో బీసీకి చాన్స్ ఇవ్వడం ఎందుకు? అన్నట్టు ఆయన వ్యాఖ్యానించారు.
కాగా, కాంగ్రెస్ పార్టీ, తన మీద కొండా సుస్మిత చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్‌గా ఉన్నట్టు సమాచారం. తోటి మంత్రులు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నా, కొండా సురేఖ అంశంలో వెనక్కి తగ్గేది లేదని తన సన్నిహితులతో రేవంత్ రెడ్డి చెప్పినట్టు టాక్ వినిపిస్తోంది. కొండాను మంత్రి పదవి నుంచి తప్పించేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన హైకమాండ్‌ను కోరునున్నట్టు తెలుస్తోంది.









