తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో చాణక్య స్ట్రాటజీస్ నిర్వహించిన రాజకీయ సర్వే ఆసక్తికర అంశాలను వెల్లడించింది. రాష్ట్ర రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలు, కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజాభిప్రాయం, బీఆర్ఎస్, బీజేపీల ప్రభావం, ముఖ్యంగా జెన్-జీ(Gen Z), యువ ఓటర్ల రాజకీయ ఆలోచనలపై ఈ సర్వే కీలక సంకేతాలు ఇచ్చినట్లు చాణక్య స్ట్రాటజీస్ పేర్కొంది.
బీఆర్ఎస్‌కు పెరుగుతున్న మద్దతు?
2023అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం బీఆర్ఎస్ గ్రాఫ్ గణనీయంగా పెరిగిందని చాణక్య స్ట్రాటజీస్ సర్వే పేర్కొంది. 2023అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కంటే కేవలం ఒక శాతం ఓటు శాతం ఎక్కువగా సాధించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, కానీ ప్రస్తుతం కాంగ్రెస్‌తో పోలిస్తే బీఆర్ఎస్ గ్రాఫ్ ఐదు శాతం పెరిగినట్లు సర్వేలో వెల్లడైనట్లు పేర్కొంది. అయితే, బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రభావం కూడా రాజకీయంగా పనిచేస్తోందని చాణక్య స్ట్రాటజీస్ విశ్లేషించింది.
గతంలో బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా పనిచేసిన కొందరు జర్నలిస్టులు సైతం ఇప్పుడు ఆ పార్టీకి మద్దతు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తోందని పేర్కొంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వ్యవస్థ పూర్తిగా విఫలమైందని, ప్రజల్లో ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా తీసుకెళ్లడంలో కాంగ్రెస్ సోషల్ మీడియా అట్టర్ ఫ్లాప్ అయిందని చాణక్య స్ట్రాటజీస్ అభిప్రాయపడింది.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు?
రాబోయే ఖమ్మం, నల్గొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు స్పష్టంగా కనిపిస్తోందని చాణక్య స్ట్రాటజీస్ నిర్వహించిన సర్వేలో వెల్లడైనట్లు పేర్కొంది. ముఖ్యంగా వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున ఏనుగుల రాకేష్ రెడ్డి విజయం సాధించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని సర్వే అంచనా వేసినట్లు తెలిపింది.
మల్కాజ్‌గిరిలో వన్‌సైడెడ్ విక్టరీ?
మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 74 డివిజన్లలో బీఆర్ఎస్ 48 నుంచి 50 సీట్ల వరకు గెలుచుకుని వన్‌సైడెడ్ విక్టరీ సాధించే అవకాశం ఉందని చాణక్య స్ట్రాటజీస్ సర్వే పేర్కొంది. అదే విధంగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో కూడా బీఆర్ఎస్ వన్‌సైడెడ్‌గా విజయం సాధించబోతోందని సర్వే అంచనా వేసినట్లు తెలిపింది.
హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల విషయానికి వస్తే మాత్రం రాజకీయ సమీకరణాలు భిన్నంగా ఉండే అవకాశం ఉందని సర్వే సంకేతాలు ఇస్తోంది. ఎంఐఎం, కాంగ్రెస్ కలిసి పొత్తుగా ఎన్నికల్లోకి వెళ్లినట్లయితే విజయం సాధించే అవకాశం ఉందని చాణక్య స్ట్రాటజీస్ నిర్వహించిన సర్వేలో వెల్లడైనట్లు పేర్కొంది.
బీజేపీపై ఆశలు లేవు?
తెలంగాణ యువతకు ప్రస్తుతం బీజేపీపై పెద్దగా ఆశలు లేవని చాణక్య స్ట్రాటజీస్ సర్వేలో వెల్లడైనట్లు పేర్కొంది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణ యువత బీజేపీ వైపు ఆశగా చూసిందని, అయితే ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల కారణంగా యువతలో బీజేపీకి ఉన్న మద్దతు తగ్గిపోయిందని సర్వేలో విశ్లేషించినట్లు తెలిపింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా బీజేపీ గ్రాఫ్ గణనీయంగా పడిపోయిందని చాణక్య స్ట్రాటజీస్ పేర్కొంది. అనేక నియోజకవర్గాల్లో బీజేపీ ప్రభావం 50శాతానికి పైగా దిగజారిపోయిందని సర్వేలో తేలినట్లు తెలిపింది. కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి నిర్వహించిన సర్వేలో ప్రస్తుతం ఉన్న 11మంది బీజేపీ కార్పొరేటర్లు కూడా ఓటమి బాటలో ఉన్నారని సర్వే అంచనా వేసినట్లు పేర్కొంది.
Gen-Z తీర్పు ఏంటి?
ఈ సర్వేలో అత్యంత కీలకంగా మారిన అంశం జెన్-జీ ఓటర్ల రాజకీయ ధోరణి. 2023 ఎన్నికలకు ముందు యువత బీజేపీని ఒక ప్రత్యామ్నాయంగా చూసినప్పటికీ, ఆ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని సర్వే సంకేతాలు ఇస్తోంది. ప్రస్తుతం యువతలో బీజేపీపై ఆశలు తగ్గిపోగా, రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ప్రత్యామ్నాయాల కోసం ఎదురుచూసే పరిస్థితి కనిపిస్తోందని చాణక్య స్ట్రాటజీస్ పేర్కొంది.
మొత్తంగా వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలన తర్వాత తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఏర్పడుతున్నాయని ఈ సర్వే చెబుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఒకవైపు సానుకూల ప్రభావం చూపుతున్నప్పటికీ, రాజకీయంగా బీఆర్ఎస్ తన గ్రాఫ్‌ను పెంచుకుంటోందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీకి ముఖ్యంగా తెలంగాణ యువతలో మద్దతు తగ్గడం, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పార్టీ గ్రాఫ్ పడిపోవడం మరో కీలక పరిణామంగా కనిపిస్తోంది. అదే సమయంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రభావం పెరగడం, కాంగ్రెస్ సోషల్ మీడియా విఫలమవడం కూడా రాజకీయ పోరాటంలో ప్రభావం చూపుతున్న అంశాలుగా చాణక్య స్ట్రాటజీస్ సర్వే పేర్కొంది. ఈ సర్వేపై సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ వర్గాలు ఎలా స్పందిస్తాయో సర్వత్రా ఆసక్తి నెలకొంది.










