తెలంగాణ ఆర్టీసీ(TGSRTC) ప్రయాణికులకు అందించే సేవలను మరింత ఆధునికీకరించడంతో పాటు, సంస్థకు అదనపు ఆదాయ మార్గాలను సమకూర్చుకోవడానికి ఒక నూతన ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. కేవలం టికెట్ల విక్రయం ద్వారా వచ్చే ఆదాయంపైనే ఆధారపడకుండా నాన్-ఫేర్ రెవెన్యూ విధానంలో భాగంగా నగరంలోని ఎలక్ట్రిక్ బస్సుల్లో డిజిటల్ అడ్వర్టైజింగ్, ఇన్ఫోటైన్‌మెంట్ తెరలను అమర్చుతోంది. ఈ సరికొత్త డిజిటల్ వ్యవస్థ ఏర్పాటు కోసం ఆర్టీసీ 'రూట్‌వేవ్' అనే ప్రముఖ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది.
ప్రాథమికంగా హయత్‌నగర్-2 డిపోకు చెందిన 10 అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్సుల్లో ఈ సౌకర్యాన్ని ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ నిర్వహణ కోసం నగరంలో అత్యంత రద్దీగా ఉండే హయత్‌నగర్ నుంచి పటాన్‌చెరు మార్గాన్ని అధికారులు ఎంపిక చేశారు. ఈ రూట్‌లో ప్రయాణించే ఎలక్ట్రిక్ బస్సుల్లో అమర్చిన తెరలపై కేవలం వాణిజ్య ప్రకటనలు మాత్రమే కాకుండా మెట్రో రైళ్ల తరహాలోనే రాబోయే బస్ స్టాప్‌ల వివరాలను, ప్రయాణ మార్గంలోని ప్రధాన స్టేజీలను ముందుగానే ప్రదర్శిస్తున్నారు.
హైదరాబాద్ నగరంపై లేదా ఈ మార్గంపై సరైన అవగాహన లేని కొత్త ప్రయాణికులకు, దూరప్రాంతాల నుంచి వచ్చే వారికి తమ గమ్యస్థానం ఎప్పుడు వస్తుందో సులభంగా తెలుసుకోవడానికి, సరైన పాయింట్‌లో సురక్షితంగా దిగడానికి ఈ మెట్రో తరహా ప్రదర్శన ఎంతగానో దోహదపడుతుంది. బస్సుల్లో ఉండే డిజిటల్ తెరలను కేవలం వాణిజ్య ప్రకటనలకే పరిమితం చేయకుండా, ప్రజలకు ఉపయోగపడే కీలక సమాచారాన్ని అందించే వేదికగా కూడా మార్చాలని ఆర్టీసీ యోచిస్తోంది. అదేవిధంగా అత్యవసర మార్గదర్శకాలు, హెల్ప్‌లైన్ నంబర్లను ఈ స్క్రీన్ల ద్వారా నిరంతరం ప్రదర్శిస్తారు.
నగరంలో పర్యావరణహిత ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో, ఈ ప్రయోగం వల్ల వచ్చే నాన్-ఫేర్ రెవెన్యూ, ప్రకటనల ఆదాయం, ప్రయాణికుల నుంచి వచ్చే స్పందనను ఆర్టీసీ ఉన్నతాధికారులు క్షుణ్ణంగా సమీక్షించనున్నారు. హయత్‌నగర్–పటాన్‌చెరు రూట్‌లో చేపట్టిన ఈ పైలట్ ప్రాజెక్ట్ ఆశించిన ఫలితాలను ఇస్తే, రాబోయే రోజుల్లో నగరంలోని మిగిలిన అన్ని డిపోలకు చెందిన ఎలక్ట్రిక్ బస్సులకు కూడా ఈ సాంకేతికతను విస్తరించాలని ఆర్టీసీ యాజమాన్యం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. దీనివల్ల సంస్థ ఆర్థికంగా బలోపేతం కావడానికి మంచి అవకాశం ఏర్పడుతుంది.










