రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీకి గతంలో మాజీ సీఎం కేసీఆర్‌కు పట్టిన గతే పడుతుందని కేంద్రమంత్రి బండి సంజయ్ జోస్యం చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్ రావును హౌస్ అరెస్ట్‌పై చేయడంపై బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులను పరామర్శించేందుకు, నిరసన తెలిపేందుకు వెళ్తున్న నాయకులను అరెస్ట్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ దివాళాకోరుతనానికి నిదర్శనమని మండిపడ్డారు.
దాడులు చేసేవారిని కాపాడటమేనా? కాంగ్రెస్ చెబుతున్న 'ఇందిరమ్మ రాజ్యం'? అని ప్రశ్నించారు. నల్లగొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడి ఇంటిని ధ్వంసం చేసిన నిందితులపై ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు? అని నిలదీశారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై దాడికి పాల్పడిన యూత్ కాంగ్రెస్ నేతలను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపిన వారి ఇళ్లపై దాడులను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందా? ప్రశ్నించారు.
అసలు రాష్ట్రంలో ప్రభుత్వం, పోలీసులు ఏం చేస్తున్నారు? అని అడిగారు. పోలీసులను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ నేతలు రాష్ట్రంలో విధ్వంసకర రాజకీయాలు చేస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నల్గొండకు వెళ్లేందుకు రెడీ అయిన బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావును అక్రమంగా హౌస్ అరెస్ట్ చేయడంతో పాటు అదుపులోకి తీసుకున్న ఇతర నాయకులను సైతం వెంటనే బేషరతుగా విడుదల చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. లేదంటే మున్ముందు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
రాష్ట్రంలో జరిగే ప్రతీ ఘటనకు ప్రభుత్వంతో పాటు పోలీసులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వానికి పట్టిన గతే త్వరలోనే కాంగ్రెస్ పార్టీకి కూడా పడుతుందన్నారు.ఇదిలాఉండగా, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంపై నల్ల రంగు చల్లిన వారి సంగతి తేలుస్తామని బండి హెచ్చరించారు. యూత్ కాంగ్రెస్ నేతలను వెంటనే అరెస్టు చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు. నిరసన శాంతియుతంగా ఉండాలని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని రెచ్చిపోవద్దని హితవు పలికారు.








