Cm Chandrababu: ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. దీంతో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. తాజాగా వైసీపీ అధినేత జగన్ టార్గెట్ గా సీఎం చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎన్నికలు జరగడం గొడ్డలి పార్టీ నాయకుడికి ఇష్టం లేదు అంటూ చంద్రబాబు విరుచుకుపడ్డారు.
మీడియాతో చిట్ చాట్ లో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరగడం వైసీపీ అధినేత జగన్ కు ఇష్టం లేదన్నారు చంద్రబాబు. ఎన్నికలను అడ్డుకునేందుకు గొడ్డలి పార్టీ నాయకుడు ఏదో ఒక రూపంలో కుట్ర చేస్తూనే ఉన్నారని ఆరోపించారు.
ఎన్నికలు వాయిదా పడితే వైసీపీకి లాభం అనుకోవడం దింపుడుకళ్లెం ఆశలే అన్నారు చంద్రబాబు. స్థానిక ఎన్నికలు ప్రత్యక్ష పద్ధతిలో జరిగితేనే రాజకీయ స్థిరత్వం ఉంటుందని తేల్చి చెప్పారు. ఏ ఎన్నికల్లో అయినా బీసీలకు ఎక్కువ టికెట్లు ఇచ్చింది టీడీపీనే అని చంద్రబాబు అన్నారు. 34శాతం అనేది చట్టపరంగా బీసీలకు రక్షణ కల్పించే ప్రయత్నమే అన్న చంద్రబాబు.. గత ఎన్నికల్లో 34శాతం కంటే ఎక్కువే సీట్లు బీసీలకు ఇచ్చామని చెప్పారు.
''పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికలు ప్రత్యక్ష పద్ధతిలో జరగడం జగన్ కు ఇష్టం లేదు. అందుకే ఎస్ఐఆర్ విషయంలో వైసీపీ కోర్టుకు వెళ్లింది. ఎన్నికలు జాప్యం అయ్యే కొద్దీ అధికార పార్టీకి నష్టం వాటిల్లుతుందని జగన్ ఆశ పడుతున్నారు. జగన్ ది దింపుడుకళ్లెం ఆశే. ఎన్నికలు ప్రత్యక్ష పద్ధతిలోనే జరిగితేనే రాజకీయ స్థిరత్వానికి నాంది'' అని చంద్రబాబు అన్నారు.












