విదేశాల్లో ఉన్నత విద్య చదవాలనుకునే విద్యార్థుల కలలను నిజం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది. ఆర్థిక ఇబ్బందులు ప్రతిభకు అడ్డంకిగా మారకూడదని పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులు సైతం ఉన్నత శిఖరాలు అందుకోవాలని ఆశిస్తున్న ప్రజా ప్రభుత్వం యువత ఆశలకు, ఆశయాలకు అండగా నిలుస్తోంది. ఇందులో భాగంగా బీసీ, ఈబీసీ విద్యార్థులకు శుభవార్త చెప్పింది.
మహాత్మా జ్యోతిబా ఫూలే ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద యువత నుండి దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ విడతలో మొత్తం 350 మంది విద్యార్థులను ఎంపిక చేయనున్నారు. ఇందులో 250 మంది బీసీ విద్యార్థులు, మరో 100 మంది ఈబీసీ విద్యార్థులు ఉండనున్నట్టు పేర్కొన్నారు.. విదేశీ విశ్వవిద్యాలయాల్లో నాణ్యమైన ఉన్నత విద్యను అభ్యసించాలనే ప్రతిభ ఉన్నప్పటికీ.. ఆర్థిక పరిస్థితులు అడ్డంకిగా మారుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు ఈ పథకం అండగా నిలుస్తోంది.
మరోవైపు ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే విద్యార్థులు గ్రాడ్యుయేషన్‌లో కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. అర్హత కలిగిన విద్యార్థులు సెప్టెంబర్ 1 నుంచి 30వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు పేర్కొంటున్నారు.. అలాగే విద్యార్థుల ఉన్నత విద్యకు అందిస్తున్న ఈ సహకారం వారి భవిష్యత్తుకు ఆధారంగా మారనుందని ప్రభుత్వం ఆశిస్తుంది.
అదేవిధంగా ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులు దేశంలోనే కాకుండా.. ప్రపంచ స్థాయి విద్యా సంస్థల్లో చదువుకునేలా విద్యా ప్రోత్సాహకాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు, ఓవర్సీస్ విద్యా పథకాల ద్వారా అండగా నిలుస్తోంది. ముఖ్యంగా విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి.. అంతర్జాతీయ స్థాయిలో నైపుణ్యాలు సాధించి.. తిరిగి సమాజానికి, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడేలా యువతను ప్రోత్సహించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశంగా తెలుస్తుంది.
ఈ నేపథ్యంలో విదేశాల్లో చదువుకోవాలనే విద్యార్థుల కలలను సాకారం చేసేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. అర్హత ఉన్న విద్యార్థులు గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు..












