ఏపీలో మరోసారి తీవ్ర విషాదం నెలకొంది. గోదావరిలో దూకి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది. వీరి మరణానికి ఆర్థిక ఇబ్బందులే కారణమని సమాచారం. అయితే, దంపతులు చనిపోయే ముందు తమ మూడేళ్ల పాపను స్కూటీ మీదే వదిలేసి నీళ్లలోకి దూకినట్టు తెలిసింది. అంతకుముందు పాప తండ్రి తమ మరణానికి గల కారణాలను ఆడియో రూపంలో రికార్డు చేసి పెట్టినట్టు సమాచారం.
వివరాల్లోకివెళితే.. తణుకు మండలం వేల్పూరుకు చెందిన దొడ్డా సాయి(29), శిరీష(28) దంపతులకు మూడేళ్ల పాప ఉన్నది. వీరికి ఆరేళ్ల కిందట వివాహం అవ్వగా.. ఉపాధి కోసం సాయి కృష్ణ హైదరాబాద్‌కు వెళ్లి డ్రైవర్‌గా పనిచేస్తుండేవాడు. అక్కడ అప్పుల పాలు అయినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే రెండు నెలల క్రితం భీమవరంలోని బంధువుల ఇంటికి సాయికృష్ణ ఫ్యామిలీతో వచ్చినట్టు సమాచారం.ఈ క్రమంలోనే పశ్చిమ గోదావరి జిల్లాలోని చించినాడ బ్రిడ్జి వద్దకు కుటుంబంతో కలిసి చేరుకున్న సాయి.. తన కూతురిని స్కూటీ మీద వదిలేసి భార్యాభర్త ఇద్దరూ గోదావరిలోకి దూకేశారు.
చీకట్లో చలికి వణుకుతూ ఆ చిన్నారి అమ్మా.. నాన్న అంటూ ఏడుస్తూ ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పాప పేరెంట్స్ ఆత్మహత్యకు యత్నించారని గుర్తించిన పోలీసులు వెంటనే నదిలో గాలింపు చర్యలు చేపట్టారు.అనంతరం విచారణ చేపట్టగా.. వీరి మరణానికి సంబంధించిన కారణాలను పోలీసులు బయటపెట్టారు.
స్నేహితుడు తాకట్టు పెట్టమని ఇచ్చిన ఉంగరం విషయంలో ఎదురైన వేధింపుల వల్లే తాము బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు సాయి మాట్లాడిన ఓ ఆడియో క్లిప్‌ను పోలీసులు గుర్తించారు. బతకాలని ఉన్నా బతకలేకపోతున్నామని, నాన్న జాగ్రత్త అంటూ ఆత్మహత్యకు ముందు రికార్డు చేసిన ఆడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ మేరకు కేసు నమోదు చేసి సాయికృష్ణ దంపతులు ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన అంశాలపై విచారణ చేయనున్నట్టు పోలీసులు తెలిపారు.












