భారీగా అక్రమాస్తులు కూడబెట్టిన కేసులో జయశంకర్ భూపాలపల్లి జిల్లా గనుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ (Mines AD) జయరాజ్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. గురువారం ఆయన నివాసాలు, బంధువుల ఇళ్లలో విస్తృతంగా సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు, లెక్కింపునకు మించి ఉన్న భారీ ఆస్తులను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, శుక్రవారం ఉదయం ఆయనను ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి 14రోజుల రిమాండ్ విధించడంతో అధికారులు ఆయనను వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు.
ఏసీబీ అధికారుల తనిఖీల్లో ఏడీ జయరాజ్ అక్రమాస్తుల చిట్టా బయటపడింది. ఆయనకు ఒక జి+2 భవనం, హైదరాబాద్ కేపీహెచ్‌బీ (KPHB) ప్రాంతంలో ఒక ఫ్లాట్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో 5 విలువైన ప్లాట్లు, 3.21 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు గుర్తించారు. అలాగే తనిఖీల్లో రూ.10.03 లక్షల నగదు, 629 గ్రాముల బంగారు ఆభరణాలు, వివిధ బ్యాంకు ఖాతాల్లో రూ.71 లక్షల నగదు నిల్వలు లభ్యమయ్యాయి. వీటితో పాటు ఎల్‌ఐసీ, మాక్స్ లైఫ్, పోస్ట్ ఆఫీస్ పొదుపు ఖాతాల్లో దాదాపు రూ.40లక్షలకు పైగా డిపాజిట్లు ఉన్నట్లు ఏసీబీ లెక్క తేల్చింది.
ఇసుక రవాణా వ్యాపారుల నుంచి ఏడీ జయరాజ్ దందాలు నడుపుతూ భారీగా లంచాలు వసూలు చేసినట్లు అధికారుల విచారణలో ఆధారాలు లభించాయి. వ్యాపారుల నుంచి నేరుగా తీసుకోకుండా తన వ్యక్తిగత డ్రైవర్ ద్వారా లంచం డబ్బులను వసూలు చేయించి, ఆ తర్వాత తన కుమార్తె బ్యాంకు ఖాతాకు డిజిటల్ మార్గంలో బదిలీ చేయించినట్లు ఏసీబీ అధికారులు సాంకేతిక ఆధారాలు సేకరించారు. సదరు డ్రైవర్ ఖాతా నుంచి ఏడీ కుమార్తె ఖాతాకు దాదాపు రూ.24లక్షల మేర అక్రమ లావాదేవీలు జరిగినట్లు తేలింది. ఈ వ్యవహారంపై మరింత లోతుగా విచారణ జరిపేందుకు నిందితుడిని కస్టడీకి కోరే ఆలోచనలో ఏసీబీ ఉంది.
తాజా దర్యాప్తులో ఏసీబీ అధికారులు మరిన్ని సంచలనాత్మక విషయాలను వెలుగులోకి తెచ్చారు. రికార్డుల ప్రకారం స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ దాదాపు రూ.3.06 కోట్లుగా నమోదైనప్పటికీ, బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ రూ.60కోట్ల నుంచి రూ.100కోట్ల వరకు ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, ఇటీవలే జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జయరాజ్ 'ఉత్తమ అధికారి'గా అవార్డు అందుకోవడం, ఆ మరుసటి వారంలోనే అవినీతి కేసులో ఏసీబీకి చిక్కడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. గతంలోనూ ఇసుక అక్రమ రవాణాదారులతో కుమ్మక్కయ్యారనే అభియోగాలపై శాఖాపరమైన హెచ్చరికలు ఎదుర్కొన్నప్పటికీ ఆయన వైఖరిలో మార్పు రాకపోవడంతోనే ఈ దాడులు నిర్వహించినట్లు అధికారులు స్పష్టం చేశారు.












