మనిషి అభివృద్దిలో ఎంత ఎదిగినా.. ప్రకృతి ముందు ఒడిపోతూనే ఉన్నాడు.. మరణాన్ని జయించే దిశగా ప్రయోగాలు జరుగుతున్న.. ప్రకృతి సృష్టించే విపత్తుల ముందు తన తెలివి, తన బలం, ఈ టెక్నాలజీ నిలవలేక పోతున్నాయి. ఇందుకు ఉదాహరణగా ఎన్నో ప్రకృతి వైపరీత్యాలను పేర్కొనవచ్చు.. వందల సంవత్సరాల అభివృద్ది సైతం ఒక బలమైన ప్రకృతి ప్రకోపానికి నామ రూపాలు లేకుండా పోవచ్చు.. అంటే మానవుడు మేధస్సులో ఉన్నతుడైన ప్రకృతి ముందు బలహీనుడే అని ఎప్పటికప్పుడు ఈ వైఫ్యల్యాలు నిరూపిస్తున్నాయి..
ఇక ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడుతున్న ప్రకృతి విలయానికి ఎన్నో దేశాలు తమ స్వరూపాన్ని కోల్పోయాయి.. అంతెందుకు ఒక్క హిమనీనదం విరిగిపడటంతో నేపాల్‌లో ఎంతటి విధ్వంసం జరిగిందో కళ్లారా చూస్తున్నాం..! అలాంటిది ఏడాది మొత్తం కురవాల్సిన వర్షం.. కేవలం మూడు రోజుల్లోనే ముంచెత్తితే..! 62 ఆనకట్టలు ఒకే రాత్రి వరద ఉద్ధృతికి తెగిపోతే..! ఆ మహా జలప్రళయం ఎలా ఉంటుందో ఊహించడం కూడా కష్టమే..!
సరిగ్గా 51 ఏళ్ల క్రితం చైనా ఇలాంటి ఘోర విపత్తునే చవిచూసింది. 1975 జులై చివర్లో ఫిలిప్పీన్స్ సముద్రంలో టైఫూన్ నీనా ఏర్పడింది. కొద్ది రోజుల్లోనే అది బలపడి తైవాన్ మీదుగా వేగంగా కదులుతూ చైనా లోని ఫుజియాన్ ప్రావిన్స్‌లో తీరం దాటింది. ఆ సమయంలో హెనాన్ ప్రాంతంలో అది సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. ఆ సమయంలో కురిసిన కుంభవృష్టి వల్ల 24 గంటల్లో 1000 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది.
ఆగస్టు 5 నుండి 7 తేదీల మధ్య ఏకంగా 1605 మిల్లీమీటర్ల వర్షం పడింది. దీంతో హెనాన్‌లోని బాంకియావో డ్యామ్‌కు వరద పోటెత్తింది. సెకనుకు 13వేల క్యూబిక్ మీటర్ల చొప్పున ఈ రిజర్వాయర్‌లో నీరు చేరింది. ఫలితంగా బాంకియావో డ్యామ్ రక్షణ గోడ పై నుంచి నీరు ఉధృతితో ప్రవహించడం మొదలుపెట్టింది. ఇది జరిగిన కొద్ది గంటల్లోనే ఈ రిజర్వాయర్ ధ్వంసమై పెద్ద ఎత్తున నీరు బలమైన వేగంతో అంటే సుమారు గంటకు 30-50 కిలోమీటర్ల వేగంతో నీరు పల్లానికి ప్రవహించింది.
అదే సమయంలో ఈ రిజర్వాయర్‌కు 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిమన్‌తాన్ డ్యామ్ కూడా పొంగిపొర్లింది. అమెరికా సహా పలు అంతర్జాతీయ సంస్థల అధ్యయనాల ప్రకారం.. ఆ రాత్రి ఏకంగా 62 డ్యామ్‌లు ధ్వంసమైనట్లు సమాచారం. దీంతో తెల్లవారకముందే భారీ వరద ఉప్పెన గ్రామాలపై విరుచుకుపడింది. ఎన్నో ప్రాణాలు జలసమాధి అయ్యాయి. ఊళ్లకు ఊళ్లు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి.
రైల్వే లైన్లు, రహదారులు, వేల ఎకరాల్లో పొలాలు నీటమునిగాయి. ఈ విపత్తు కారణంగా 26వేల మంది మరణించారని 2017 నాటి అధ్యయనం వెల్లడించింది. అయితే ఈ విధ్వంసం జరిగిన తర్వాత ఏర్పడిన పరిస్థితులు జనజీవనం మీద తీవ్ర ప్రభావాన్ని చూపించినట్టు వార్తలు వెలువడ్డాయి.. కొన్ని లక్షల జనం అంటువ్యాధుల బారిన పడి మరణించినట్లు కథనాలు వెలువడ్డాయి.. మరోవైపు ఈ మహా విషాదం మిగిల్చిన నష్టాన్ని చైనా 20ఏళ్ల పాటు దాచిపెట్టింది.
కేవలం డ్యామ్‌లు కూలిన విషయాన్ని మాత్రమే ఆ సమయంలో స్థానిక మీడియా ప్రసారం చేయడం గమనార్హం. ఈ విలయానికి సంబంధించిన కొన్ని అధికారిక రికార్డులైతే ఏకంగా 30 ఏళ్ల పాటు రహస్యంగా ఉంచినట్లు సమాచారం. అలాగే బాంకియావో డ్యామ్ తెగడంతో ఆ దిగువ ప్రాంతాల్లోని లక్షలాది మంది ప్రజలు దాదాపు 9 రోజుల పాటు జలదిగ్బంధనంలో భయంకరమైన పరిస్థితుల మధ్య గడపాల్సి వచ్చిందట.
ఆ సమయంలో కొందరు రోజుల తరబడి చెట్లపై ఉండాల్సి వచ్చిందని, తిండిలేక ఆకులు తిని ప్రాణాలు కాపాడుకున్నట్లు కథనాలు వెలువడ్డాయి.. అలాగే ఈ విపత్తు ప్రత్యక్షంగా, పరోక్షంగా 2.3లక్షల మరణాలకు కారణమైనట్లు కొన్ని అధ్యాయనాలు పేర్కొన్నాయి.. ఇక 1995లో ఈ నివేదిక వెలువడటంతో ఈ జలప్రళయం గురించి ప్రపంచానికి తెలిసింది. మరోవైపు ఈ పెను విషాదం తాలూకు చేదు జ్ఞాపకాలు.. చరిత్రలోనే అత్యంత భయానకమైన ఆనకట్ట విపత్తుల్లో ఒకటిగా మిగిలిపోయాయి.
ఆ వరద సృష్టించిన విధ్వంసం.. ప్రకృతి ప్రకోపం ఎంతటి మహా విపత్తుకు దారితీయగలదో ప్రపంచానికి మరోసారి గుర్తుచేసింది.. అయిన మానవుడు ప్రకృతి నుండి నేర్చుకోవడం మానేసి.. ప్రకృతి వినాశనానికి కారణం అవుతున్నాడు. అంటే ఇప్పుడు ఇక రాబోయే తరాలు ఎదుర్కొనే భయంకరమైన పరిస్థితులకు మానవ మేధస్సు కారణం అని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న.. మనిషిని ఆశ అనే మైకం కమ్మితే వినాశనం వెంటే ఉంటుందని నేడు ప్రకృతి ప్రపంచానికి సూచనలు చేస్తున్నా.. వాటిని పట్టించుకునే స్థితిలో మనిషి లేడని అంటున్నారు..












