తన కూతురు కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలతో ఇరకాటంలో పడిన మంత్రి కొండా సురేఖకు పదవీ గండం పొంచి ఉన్న విషయం తెలిసిందే. ఆమెను మంత్రి పదవి నుంచి తప్పించాలని పలువురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు క్రమశిక్షణా కమిటీకి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి మీద కొండా సుస్మిత వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం.. వాటిని మంత్రి కొండా ఖండించకపోవడంతో అధిష్టానం సైతం ఈ విషయంపై సీరియస్‌గా ఉన్నట్టు తెలిసింది.
ఈ క్రమంలోనే క్రమశిక్షణా కమిటీ ఎదుట హాజరైన మంత్రి కొండా.. తన కూతురు సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని,వాటితో తనకు సంబంధం లేదని కమిటీ పెద్దలకు సమాధానం ఇచ్చారు. మంత్రి వివరణపై క్రమశిక్షణా కమిటీ సంతృప్తి వ్యక్తం చేయలేదు. దీంతో మంత్రి పదవి నుంచి కొండాను తప్పించాలని పార్టీ అధిష్టానానికి క్రమశిక్షణా కమిటీ రిపోర్టు పంపించినట్టు తెలిసింది. సీడబ్ల్యూసీ కీలక నేత కేసీ వేణుగోపాల్ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నందున ఆయన తిరిగి రాగానే కొండా పదవీ ఉంటుందా?ఊడుతుందా? అనేది తెలియనుంది.
ఇదిలాఉండగా, ఇవాళ రాఖీ పండుగ కావడంతో మంత్రి కొండా సురేఖ, మరో మంత్రి సీతక్క సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనకు బంగారు రాఖీ కట్టారు. అయితే, సీఎం రేవంత్ మీద కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యలను ఇంతవరకూ కొండా సురేఖ ఖండించలేదు. ఈ విషయంలో సీఎం సైతం నారాజ్‌గా ఉన్నట్టు తెలిసింది. అధిష్టానం నిర్ణయం ప్రకటించగానే కేబినెట్ నుంచి కొండాను సీఎం తప్పిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయం సీఎంకు ముందే తెలుసు అని కూడా పార్టీలో ప్రచారం జరుగుతోంది. లండన్ పర్యటన అనంతరం రాష్ట్రానికి వచ్చిన సీఎం మీడియాతో మాట్లాడారు.
కానీ, కొండా సురేఖ అంశంలో ఎటువంటి కామెంట్స్ చేయలేదు. క్రమశిక్షణా కమిటీ చూసుకుంటుందని సింగిల్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయనకు కొండా మీద కోపం ఉన్నా బయటకు వ్యక్తపరచలేదని టాక్ వినిపించింది. అయితే,తాజాగా కొండా సురేఖ ఆయనకు బంగారు రాఖీ కట్టడంతో ఆమె కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యల పట్ల సీఎంకు కోపం పోయిందా? లేదా కొండాను కేబినెట్ నుంచి సీఎం రేవంత్ తప్పిస్తారా? లేక అధిష్టానంతో మాట్లాడి ఈ సారికి క్షమించి వదిలేస్తారా? అని పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. ఒకవేళ మంత్రి కొండాను సీఎం క్షమించి వదిలేస్తే ఈసారి పదవీ గండం గట్టెక్కినట్టే? అని తెలుస్తోంది. కాగా, మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిశారు. పదవీ పోకుండా ఆపాలని కోరగా ఆయన చేతులెత్తేసినట్టు సమాచారం. ఈ నాటకీయ పరిణామాల నడుమ ఏం జరుగుతుందో అని అంతా ఎదురుచూస్తున్నారు.
మంత్రి కొండా ట్వీట్..
‘నేడు రాఖీ పౌర్ణమి సందర్భంగా సహచర మంత్రి సీతక్కతో కలిసి సోదరులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వారి నివాసంలో కలసి, రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశాను. మహిళల సంక్షేమం, సాధికారతకు ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ, రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డకు పెద్దన్నగా అండగా నిలుస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మీ నాయకత్వంలో తెలంగాణ మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను’ అని పేర్కొన్నారు.
https://x.com/iamkondasurekha/status/2093224074449433050?s=20












