Ramchander Rao: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు ఫైర్ అయ్యారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం.. రెండూ కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు మర్చిపోయాయని విమర్శించారు. హైదరాబాద్ ను విశ్వ నగరంగా చేస్తామని ప్రగల్బాలు పలికి.. విషాద నగరంగా మార్చాయని ధ్వజమెత్తారు.
రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేస్తామని రాంచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని మూడు కార్పొరేషన్లలో బీజేపీదే విజయం అని విశ్వాసం వెలిబుచ్చారు. ప్రధాని మోదీ, బీజేపీ విధానాలకు ఆకర్షితులై పలువురు మేధావులు, విద్యావంతులు, ప్రముఖులు తమ పార్టీలో చేరుతున్నారని చెప్పారు. పార్టీ బలోపేతానికి సమన్వయంతో కృషి చేయాలని కార్యకర్తలంతా పిలుపునిచ్చారు రాంచందర్ రావు.
''గత బీఆర్ఎస్, ఇప్పటి కాంగ్రెస్.. హైదరాబాద్‌ను విశ్వనగరం చేస్తామని గొప్పలు చెప్పాయి. కానీ విషాద నగరంగా మార్చేశాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో మౌలిక వసతులు లేమితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత, ప్రస్తుత పాలకుల నిర్లక్ష్యంతో హైదరాబాద్ అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. హైదరాబాద్ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని నగర ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హైదరాబాద్ ప్రజలు మూడు కార్పొరేషన్లలోనూ బీజేపీని గెలిపించాలన్న సంకల్పం తీసుకున్నారు'' అని రాంచందర్ రావు అన్నారు.


