తెలుగు తెరపై నటుడిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాగబాబు.. జనసేన పార్టీ ఆవిర్భావం నుండి రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. పార్టీలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ, శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తూ వచ్చిన ఆయన... ఇటీవలే ఏపీ శాసనమండలికి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
సభ్యుడిగా శాసనసభలో అడుగుపెట్టిన అనంతరం, ప్రభుత్వం ఆయన అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని తొలిసారిగా ఓ అత్యున్నత బాధ్యతను అప్పగించింది. ఈ క్రమంలో నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్‌గా నాగబాబు అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. మంగళగిరిలోని అరణ్యభవన్‌లో జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఆయన తన భార్య పద్మజతో కలిసి పాల్గొన్నారు.
వేదపండితుల మంత్రోచ్ఛారణలు, ప్రత్యేక పూజల నడుమ ఈ నామినేటెడ్ పదవీ బాధ్యతలను స్వీకరించారు. అనంతరం వేదపండితులు ఆయనకు వేదాశీర్వచనాలతో పాటు తీర్థప్రసాదాలు అందజేశారు. ఇక రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణను అత్యంత ప్రాధాన్య అంశంగా భావిస్తున్న ఏపీ ప్రభుత్వం.. ఏపీ గ్రీన్ ప్రాజెక్టును వేగవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకే నాగబాబుకు ఈ కీలక బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం.
మరోవైపు ఏపీ ప్రభుత్వం 2047 నాటికి రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో అటవీ, పచ్చదనం శాతాన్ని ఏకంగా 50 శాతానికి పెంచాలనే భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఈ ప్రతిష్ఠాత్మక లక్ష్యాన్ని సాధించేందుకు గాను, నాగబాబుకు ఏకంగా కేబినెట్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. రాష్ట్ర గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన నాగబాబుకు వివిధ శాఖల అధికారుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి.
పీసీసీఎఫ్ చలపతిరావు, పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజలతో పాటు పలువురు ఐఏఎస్ అధికారులు, అటవీ శాఖ సీనియర్ అధికారులు, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఇక పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపుదలపై ప్రభుత్వం రూపొందించిన భారీ ప్రాజెక్టును నాగబాబు తనదైన శైలిలో ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారో అనే ఆసక్తి ఏపీ రాజకీయాల్లో నెలకొంది.












