ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక సమరానికి తెరలేస్తోంది.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ప్రతిపక్ష వైసీపీ నేతలకు తీవ్రమైన టెన్షన్ తెచ్చిపెడుతున్నట్టు పొలిటికల్ సర్కిల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.. ముఖ్యంగా రాష్ట్రంలో పదహారు కార్పొరేషన్లలో మేయర్ స్థానాలు, పలు మున్సిపాలిటీల్లో ఛైర్మన్ అభ్యర్థుల ఎంపిక వైసీపీ నియోజకవర్గ ఇన్ ఛార్జులకు నిద్రలేకుండా చేస్తోందని చర్చించుకుంటున్నారు..
మేయర్, ఛైర్మన్ ఎన్నికలు నేరుగా ప్రజల ద్వారా జరిగే ప్రత్యక్ష పోరు కావడంతో, ప్రలోభాలకు లొంగకుండా చివరి నిమిషం వరకూ పోరాడే బలమైన అభ్యర్థుల కోసం ఇప్పటి నుండే ఆరా తీస్తున్నట్టు చెప్పుకొంటున్నారు.. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని స్థానిక ఎన్నికల్లో ఎదుర్కోవడం వైసీపీకి అంత తేలిక కాదు. రాబోయే మూడేళ్లు కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది కాబట్టి.. అభివృద్ధి పనులు జరగాలంటే అధికార పార్టీ నేతలను గెలిపించుకోవడమే మేలని ప్రజలు భావించే అవకాశాలున్నాయి.
ఇక సాధారణంగా అధికారపక్షంపై ఉండే రాజకీయ అసంతృప్తి స్థానిక పోరులో బయటపడదు. దీనికితోడు కూటమి ప్రభుత్వం అధికారిక యంత్రాంగం సహకారంతో పాటు ఆర్థికంగా కూడా చాలా బలంగా ఉంటుంది. అధికార పక్షం ఉపయోగించే సామ, దాన, భేద, దండోపాయాల ఒత్తిళ్లను తట్టుకోవాలంటే వైసీపీ అభ్యర్థికి కేవలం ప్రజాదరణ ఉంటే సరిపోదు, తిరుగులేని ధనబలం కూడా ఉండాలని నేతలు భావిస్తున్నట్టు సమాచారం.
ఎందుకంటే తాను ఖర్చు పెట్టుకోవడమే కాకుండా, తన వార్డు మెంబర్లకు కూడా ఆర్థికంగా అండగా నిలబడే నేత మాత్రమే ఈ ఎన్నికల్లో నిలబడగలడని భావిస్తున్నారట.. అందుకే ఈ విషయంలో వైసీపీ నాయకత్వం తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోందని అనుకొంటున్నారు. మరోవైపు స్థానిక ఎన్నికలు ఏకగ్రీవాలైతే వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కదన్న జగన్ హెచ్చరికలు ఇన్ ఛార్జుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. అందుకే ఒకరిద్దరు నేతలను సిద్ధం చేసి చివరి నిమిషంలో ఒకరిని బరిలోకి దింపాలని భావిస్తున్నా, పార్టీ అధికారంలో లేకపోవడంతో సొంత డబ్బులు ఖర్చు పెట్టేందుకు బలమైన నాయకులు ముందుకు రావడం లేదనే ప్రచారం జరుగుతుంది.
మరోవైపు వైసీపీకి క్షేత్రస్థాయి ఓటు బ్యాంకు, జగన్ ఇమేజ్ బలంగా ఉన్నప్పటికీ, నాయకుల్లో నెలకొన్న నిరాశ పార్టీకి పెద్ద మైనస్‌గా మారినట్టు తెలుస్తుంది.. అదేవిధంగా కూటమికి అధికార బలంతో పాటు బలమైన అభ్యర్థుల మద్దతు ఉన్నా, మూడు పార్టీల మధ్య స్థానికంగా వచ్చే పదవుల కేటాయింపు, అభ్యర్థుల మధ్య సమన్వయం అతిపెద్ద సవాలుగా మారే అవకాశం ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.. ఏది ఏమైనా, నామినేషన్ల ఘట్టం పూర్తయి ఎన్నికలు ముగిసే వరకూ వైసీపీ ఇన్ ఛార్జులకు టెన్షన్, జగన్ కు తలనొప్పి తప్పేలా లేదని ఏపీ ప్రజలు అనుకుంటున్నారు..












