KTR: రేడియల్ రోడ్ల ప్రాజెక్టు కేటాయింపుల్లో పారదర్శకతను తుంగలో తొక్కి తమకు కావాల్సిన వారికే టెండర్లు కట్టబెట్టారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వానికి ఏకంగా రూ.600 కోట్ల మేర లాస్ వచ్చేలా సాగిన ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు. రూల్స్‌కి విరుద్ధంగా పెద్ద పెద్ద పనులను చిన్న చిన్న ప్యాకేజీలుగా ముక్కలు చేసి, తక్కువ కోట్ చేసిన బిడ్డర్లను పక్కనపెట్టి ఎక్కువ రేట్లకు కోట్ చేసిన కాంట్రాక్టర్లకే దక్కేలా చక్రం తిప్పారని కేటీఆర్ ధ్వజమెత్తారు.
"ప్రజాధనాన్ని కొల్లగొట్టేలా సాగిన ఈ రేడియల్ రోడ్ల టెండర్లను ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలి. బిడ్ ఓపెనింగ్, కంపారిటివ్ స్టేట్మెంట్లు, మూల్యాంకన కమిటీ వివరాలన్నింటినీ ప్రజల ముందు ఉంచుతూ వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలి" అని కేటీఆర్ డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఈ రూ.600 కోట్ల నష్టంపై కూడా సమగ్ర విచారణ జరిపించాలని, అవకతవకలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.











