Jio: రిలయన్స్ జియో తమ యూజర్లకు అదిరిపోయే పండుగ ఆఫర్ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వాడుతున్న ప్రముఖ విజువల్ డిజైన్ ప్లాట్‌ఫామ్ ‘కాన్వా’ తో జియో కీలక భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా అర్హులైన కస్టమర్లకు ఏకంగా ఏడాది పాటు కాన్వా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందించేందుకు రంగం సిద్ధం చేసింది. గ్రాఫిక్ డిజైనర్లు, కంటెంట్ క్రియేటర్లు, విద్యార్థులకు ఇది ఊహించని గుడ్ న్యూస్‌గా మారింది.
ఒక్క రూపాయి చెల్లించకుండా ఏడాది పాటు ప్రీమియం
సాధారణంగా వేల రూపాయలు వెచ్చిస్తే తప్ప దక్కని కాన్వా ప్రో, కాన్వా ప్రో లైట్ సబ్‌స్క్రిప్షన్లను జియో యూజర్స్ ఉచితంగా పొందవచ్చు. ఈ ఆఫర్ ద్వారా కేవలం ప్రీమియం టూల్స్ మాత్రమే కాకుండా.. కాన్వా ప్రో లైట్ యూజర్లకు 50 జీబీ, కాన్వా ప్రో వినియోగదారులకు ఏకంగా 100 జీబీ క్లౌడ్ స్టోరేజ్ అదనపు బెనిఫిట్‌గా లభించనుంది. ఇప్పటికే సెప్టెంబర్ 16 నుంచి ఈ సరికొత్త ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. అర్హత కలిగిన యూజర్లు ‘మైజియో’ యాప్ ద్వారా ఈ ఆఫర్‌ను నేరుగా యాక్టివేట్ చేసుకోవచ్చు.
ఈ ఆఫర్ వర్తించే ప్లాన్లు ఇవే..
28 రోజుల వ్యాలిడిటీతో వచ్చే రూ.399 రీఛార్జ్ ప్లాన్‌తో యూజర్లకు పూర్తిస్థాయి ‘కాన్వా ప్రో’ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా దక్కుతుంది. రోజుకు 2.5 జీబీ చొప్పున మొత్తం 70 జీబీ డేటా, అపరిమిత ఉచిత కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. వీటికి తోడు జియో హాట్‌స్టార్ మొబైల్, జియో ఏఐ క్లౌడ్ సదుపాయాలు సైతం అందుబాటులో ఉంటాయి.
రోజుకు 2 జీబీ చొప్పున మొత్తం 56 జీబీ డేటా అందించే రూ.349 ప్రీపెయిడ్ ప్లాన్‌తో ‘కాన్వా ప్రో లైట్’ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, జియో హాట్‌స్టార్ మొబైల్, జియో ఏఐ క్లౌడ్ ప్రయోజనాలు కూడా వర్తిస్తాయి.
రూ.349 కంటే ఎక్కువ రీఛార్జ్ విలువ కలిగి ఉండి, రోజుకు 2 జీబీ లేదా అంతకంటే ఎక్కువ హైస్పీడ్ డేటా లభించే అన్ని ప్రీపెయిడ్ ప్లాన్లపైనా ‘కాన్వా ప్రో లైట్’ ఉచిత సబ్‌స్క్రిప్షన్ లభిస్తుందని జియో స్పష్టం చేసింది. డిజైనింగ్, సోషల్ మీడియా పోస్టర్లు, ప్రజెంటేషన్లు తయారు చేసుకునే వారికి కాన్వా ప్రో అత్యంత ఉపయోగకరమైన సాధనం. అలాంటి టూల్‌ను సాధారణ రీఛార్జ్‌తోనే ఏడాది పాటు ఉచితంగా అందుబాటులోకి తీసుకురావడం ద్వారా జియో మరోసారి కస్టమర్లను ఆకట్టుకునే మాస్టర్ స్ట్రోక్ ఇచ్చిందని అంటున్నారు.









