RS Praveen Kumar: తెలంగాణలో ‘ఎల్ నినో’ తెచ్చిన కరువు కంటే.. రేవంత్ సర్కార్ తెచ్చిన ‘ఎల్ కాంగో’ తెగులు వల్లే రాష్ట్రం అతలాకుతలమవుతోందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన అధికార కాంగ్రెస్ పార్టీ అవినీతి, శాంతిభద్రతల వైఫల్యాలను ఎండగడుతూ పలు దిగ్భ్రాంతికర అంశాలను బట్టబయలు చేశారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి సన్నిహితుడికి సంబంధించిన గెస్ట్ హౌస్ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ ఆయన సంధించిన ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
సీఎం సన్నిహితుడి గెస్ట్ హౌస్ ఎవరిది? తేల్చే దమ్ముందా?
రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రకటనల కోసం ముఖ్యమంత్రి అత్యంత సన్నిహితుడిని కలిసిన ఓ మహిళా వ్యాపారవేత్తకు ఎదురైన చేదు అనుభవాన్ని ఆయన బయటపెట్టారు. ఆ మహిళను సదరు వ్యక్తి నేరుగా ‘గెస్ట్ హౌస్’కు రమ్మని వేధించాడని, ఈ దారుణాన్ని స్వయంగా బాధితురాలే సోషల్ మీడియా వేదికగా వెల్లడించినా ప్రభుత్వం ఎందుకు కిమ్మనడం లేదని ప్రశ్నించారు. "ప్రైవేట్ వ్యక్తుల ఆస్తులపైకి పోలీస్ పహారాతో వెళ్లే కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలకు దమ్ముంటే ఆ గెస్ట్ హౌస్ ఎవరిది? ఆ వివాదాస్పద సన్నిహితుడు ఎవరో తేల్చి ఆ మహిళకు న్యాయం చేయాలి" అని సూటి సవాల్ విసిరారు. రాష్ట్రంలో మహిళా హోంగార్డుపై దాడి, మైనర్లపై అఘాయిత్యాలు, వరుస హత్యలు నిత్యకృత్యంగా మారాయని, హోంశాఖ కూడా లేని ఈ అరాచక పాలనలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా కుప్పకూలిందని మండిపడ్డారు.
రూ.8 లక్షల జీతభత్యాలు తీసుకుంటూ గల్లీ పంచాయితీలా?
కాంగ్రెస్ ఎంపీల తీరుపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రజలు పార్లమెంట్‌కు పంపితే.. ప్రజాధనం నుంచి నెలకు రూ.8 లక్షల విలువైన జీతభత్యాలు, విలాసవంతమైన సదుపాయాలు అనుభవిస్తూ గల్లీ స్థాయి చిల్లర రాజకీయాలకు దిగుతున్నారని ఎద్దేవా చేశారు. ఢిల్లీ వేదికగా కొట్లాడి రాష్ట్రానికి రావాల్సిన మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు, రైల్వే బడ్జెట్ నిధులు రాబట్టడంలో ఎంపీలు చేతులెత్తేశారని ధ్వజమెత్తారు. సొంత నియోజకవర్గాల్లో సమస్యలను గాలికొదిలేసి, ప్రైవేట్ వ్యక్తుల భూములపైకి దాడులకు వెళ్లడం ఏంటని నిలదీశారు. ప్రైవేట్ ఆస్తుల్లోకి ఎంపీలు చొరబడేందుకు రాజ్యాంగంలో ఎక్కడ చట్టం ఉందని, వారి వెనుక పోలీసు బందోబస్తు పంపడంపై డీజీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
భూ కబ్జాలపై నోరెందుకు మెదపరు?
మహేశ్వరం మండలం తుమ్మలూరులో పేద రైతులకు వారసత్వంగా వచ్చిన 51 ఎకరాల భూమిని తాండూరు ఎమ్మెల్యే అనుచరులు కబ్జా చేసి అక్రమ రియల్ ఎస్టేట్ వెంచర్లు వేస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. అలాగే కొల్లూరులో 22ఏ పరిధిలోని మాజీ సైనికుల భూములను నకిలీ దస్తావేజులతో కాజేసిన వ్యవహారాలు కళ్లముందే కనిపిస్తున్నా చర్యలు ఎందుకు లేవని నిలదీశారు. తమ పార్టీ నేతల భూబాగోతాలు బయటకు రాకుండా ఉండేందుకే కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.







