Komatireddy Venkat Reddy: దేవరకద్ర నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గులాబీ బాస్ కేసీఆర్, కేటీఆర్‌లపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పాలమూరు ప్రజల ఆదరణ వల్లే కేసీఆర్ సీఎం అయ్యారని గుర్తుచేసిన ఆయన.. కేటీఆర్‌ను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేయడంతో సభా ప్రాంగణం ఒక్కసారిగా హోరెత్తింది.
పాలమూరు ప్రజల అండ లేకపోతే అడుక్కుతింటుండే
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. "ఆనాడు మహబూబ్‌నగర్ ప్రజలు ఎంపీగా గెలిపించకపోతే కేసీఆర్ ఇంట్లోనే పడుకుంటుండే. పాలమూరు ప్రజలు పెట్టిన రాజకీయ బిక్ష వల్లే కేసీఆర్ ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. వారి అండదండలే లేకుంటే బయట అడుక్కుతింటుండేవాళ్లు. అలాంటిది పదేళ్లు రాష్ట్రాన్ని ఏలిన కేసీఆర్.. తనను గెలిపించిన పాలమూరు గడ్డకు చేసిందేంటి? పదేళ్ల పాలనలో తెలంగాణ మీద పడి రాష్ట్రాన్ని నిలువునా దోచుకుని లక్షల కోట్ల అప్పులపాలు చేశారు. చివరకు తండ్రీకొడుకులు కలిసి 100 ఎకరాల అక్రమ ఆస్తులను కూడబెట్టడమే పనిగా పెట్టుకున్నారు" అంటూ నిప్పులు చెరిగారు.
చావు దినాల్లోనూ శవ రాజకీయాలా?
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కోమటిరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "ఓ బచ్చాగాడు నిన్న ఇక్కడికి వచ్చి అడ్డగోలుగా ప్రేలాపనలు చేస్తున్నాడు. కనీసం చావు దినాలకు వచ్చినప్పుడు కూడా చిల్లర రాజకీయాలు మాట్లాడటానికి సిగ్గుండాలి. జూరాల, నెట్టెంపాడు వంటి ప్రాజెక్టులను ఏ ప్రభుత్వ హయాంలో పూర్తి చేశారో ప్రజలకు స్పష్టంగా తెలుసు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు తర్వాత మొదలుపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును ఎలాగూ కట్టి కూల్చేశారు. కానీ పాలమూరు ప్రాజెక్టుకు మాత్రం నయాపైసా నిధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేసిందే బీఆర్ఎస్ నేతలు. 90 శాతం పనులు పూర్తి చేశామని పచ్చి అబద్ధాలు చెబితేనే మొన్నటి ఎన్నికల్లో పాలమూరు ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టారు" అని ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
రైతుల పొలాల్లో మొసలి కన్నీళ్లు
ప్రస్తుతం మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో ఎల్ నినో ప్రభావంతో వర్షాలు లేక తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని కోమటిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన ఎస్‌ఎల్‌బీసీ సహా ఇతర పెండింగ్ ప్రాజెక్టులను గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసి ఉంటే, నేడు అన్నదాతలకు ఇంత గోస ఉండేది కాదని అన్నారు. ప్రాజెక్టులను నాశనం చేసిన గులాబీ నాయకులే ఇప్పుడు ఏమీ తెలియనట్లు రైతుల పొలాల్లోకి వెళ్లి మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు సంక్షేమం, ప్రజాసేవ మాత్రమే తెలుసని, బీఆర్ఎస్ పాలనలో దోపిడీ తప్ప ప్రజలకు దక్కిందేమీ లేదని మంత్రి కోమటిరెడ్డి అన్నారు.









