Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తున్న క్రేజీ చిత్రాల్లో ఒకటి మైసా. దర్శకుడు రవీంద్ర పుల్లె తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని అన్‌ఫార్ములా ఫిల్మ్స్ పతాకంపై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇక, ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మైసా టీజర్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఈ టీజర్ ఒక్కటి చాలు సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందో.
రష్మిక మందన్న ఇప్పటివరకు గ్లామరస్ పాత్రల్లో నటించి ఆకట్టుకుంది. పుష్ప లాంటి సినిమాలో డీ గ్లామర్ పాత్రలో నటించి పాన్ ఇండియా హీరోయిన్‌గా పాపులర్ అయింది. అయితే, వాటన్నిటికీ పూర్తి భిన్నంగా రష్మిక మైసా మూవీలో నటించింది. డార్క్, రా అండ్ రస్టిక్ అవతారంలో కనిపించి షాకిచ్చిందనే చెప్పాలి. ఇప్పటి వరకూ పోస్టర్స్ చూసిన ప్రేక్షకులు ఒక అంచనాలో మాత్రమే ఉన్నారు. ఇప్పుడు, వచ్చిన టీజర్‌తో ఆ అంచనాలన్నీ ఎక్కడికో చేరుకున్నాయి.
ఇక, తాజా టీజర్ చూస్తే.. గ్రామీణ నేపథ్యం, అడవి వాతావరణంలో జరిగే ఒక హెవీ రివెంజ్ డ్రామాగా మైసా సినిమాను రూపొందిస్తున్నట్లు అర్థమవుతోంది. తండ్రి కోసం ఒక కూతురు చేసే పోరాటం అని..శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించేలా రష్మిక చూపించిన హావభావాలు, మాస్ యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాకి హైలెట్‌గా నిలవనున్నాయని టీజర్ తో క్లారిటీ వచ్చింది. ముఖ్యంగా, జేక్స్ బిజోయ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా రేంజ్‌ను ఎక్కడికో తీసుకెళుతుందని టీజర్ ద్వారా అర్థమవుతోంది.
అంతేకాదు, తాజా టీజర్‌లో ఉన్నటువంటి పవర్‌ఫుల్ డైలాగ్స్ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. 'యుద్ధానికి ఆయుధం అంటే భయం కావచ్చు.. కానీ ఆయుధం ఏ యుద్ధానికి భయపడదు' అని రావు రమేష్ చెప్పే డైలాగ్ .. మైసా పాత్రను తారా స్థాయిలో నిలిపింది. ఇప్పటివరకు, కేవలం హీరోల సినిమాల్లోనే చూసిన ఇంటెన్స్ యాక్షన్, ఎలివేషన్లను ఇప్పుడు రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన మైసా సినిమాలో చూపించడం గొప్ప విశేషం.
ఇక అండర్ వాటర్ లో రష్మిక చావు నుండైనా నీకోసం వస్తాను నాన్న..అని చెప్పే డైలాగ్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసింది. ఇప్పటివరకు రష్మిక చేసిన సినిమాలనీ లెక్క.. మైసా ఒక్కటే ఒక లెక్క అని టీజర్ తోనే అర్ధమవుతోంది. ఖచ్చితంగా, అనుష్క శెట్టి తర్వాత మళ్ళీ టాలీవుడ్‌లో అంతకుమించిన లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ రావడం గ్యారెంటీ అనిపిస్తోంది. కాగా, ఈ సినిమాను నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు.








