ఇంట్లో చిన్న విషయానికే గొడవలు.. మాట మాటకూ మనస్పర్థలు.. ఒకే కుటుంబంలో ఉంటూ కూడా ప్రశాంతత లేకపోవడం.. ఇలాంటి పరిస్థితులను మన పెద్దలు కేవలం బయట కనిపించే కారణాలతోనే చూడలేదు. కుటుంబంలో శాంతి క్షీణించడానికి మనిషి ప్రవర్తన, ఆలోచనలు, ధర్మాచరణ కూడా కారణమవుతాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి.
భగవద్గీతలో శ్రీకృష్ణుడు కుటుంబ ధర్మం క్షీణిస్తే అధర్మం పెరుగుతుందని వివరిస్తాడు. కుటుంబాన్ని నిలబెట్టే విలువలు, పరస్పర గౌరవం, పెద్దల పట్ల మర్యాద, ధర్మబద్ధమైన జీవనం తగ్గిపోతే కలహాలకు వాతావరణం ఏర్పడుతుందని ఈ బోధలో అంతర్లీనమైన సందేశం.
అలాగే గీతలో మరో ముఖ్యమైన విషయాన్ని శ్రీకృష్ణుడు చెబుతాడు. మనసు ఒక విషయంపై పదేపదే నిలిస్తే దానిపై ఆసక్తి పెరుగుతుంది.. ఆసక్తి కోరికగా మారుతుంది.. కోరిక నెరవేరకపోతే కోపం పుడుతుంది. ఆ కోపమే చివరికి వివేకాన్ని దెబ్బతీస్తుంది.
అందుకే ఇంట్లో నిత్యం కలహాలు ఉంటే ముందుగా పరిశీలించాల్సిన అంశాలలో.. కోపం, అహంకారం, అసూయ, అనవసర అనుమానం, కఠినమైన మాటలు, ఒకరినొకరు గౌరవించకపోవడం వంటి మనసులోని దోషాలు. మహాభారతంలోని శాంతి బోధలు కూడా కోపాన్ని అదుపులో పెట్టుకోవడం, కఠినమైన మాటలను నివారించడం, స్నేహితులతోనూ బంధువులతోనూ అనవసరంగా కలహించకపోవడం ధర్మమని చెబుతున్నాయి.
ఆధ్యాత్మికంగా చూస్తే.. ఇంట్లో దేవుడి పూజ ఉండటం మాత్రమే కాదు, ఆ ఇంట్లో ఉండే మనుషుల మాటల్లోనూ ధర్మం కనిపించాలి. ఉదయం దీపం వెలిగించి, సాయంత్రం నామస్మరణ చేసినా.. ఒకరినొకరు బాధపెడితే ఆ సాధనకు అంతరార్థం తగ్గిపోతుంది. కాబట్టి కుటుంబ కలహాలకు పరిష్కారం కోసం కేవలం దోష నివారణలకే పరిమితం కాకుండా.. ఇంట్లో సత్యం, సహనం, పరస్పర గౌరవం, క్షమ, ప్రేమ పెంచుకోవాలి.
పెద్దలను గౌరవించడం.. అన్నదమ్ములు, భార్యాభర్తలు, పిల్లలు ఒకరినొకరు అర్థం చేసుకోవడం.. మాటకు ముందు మనసును అదుపులో పెట్టుకోవడం.. ఇవే శాస్త్రాలు సూచించే నిజమైన శాంతి మార్గాలు.. ఇంట్లో శాంతి రావాలంటే ముందుగా మనసులోని కోపం చల్లారాలి. ఎందుకంటే ఆధ్యాత్మిక దృష్టిలో.. ఇంటి శాంతిని చెడగొట్టే పెద్ద దోషం బయట ఎక్కడో ఉండకపోవచ్చు.. మన మాటలో, మన కోపంలో, మన అహంకారంలోనే ఉండొచ్చని శాస్త్రాలు తెలియచేస్తున్నాయి..
గమనిక: ఇక్కడ అందించిన వివరాలు కేవలం సాంప్రదాయ పురాణ విశ్వాసాలు మరియు ఆధ్యాత్మిక భావనల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటిని కేవలం మతపరమైన విశ్వాసాల కోణంలోనే చూడాలి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత రంగ నిపుణులను సంప్రదించడం మంచిది.












