ఆకలి వేసినప్పుడు కడుపులో గుడుగుడు, గురుగురు అంటూ శబ్ధాలు రావడం చాలా సాధారణం. చాలామందికి ఇవి ఆకలికి సంకేతంగా భావిస్తారు. అయితే ఈ శబ్ధాలు కేవలం కడుపు ఖాళీగా ఉండటం వల్ల మాత్రమే రావు. జీర్ణవ్యవస్థలో జరిగే సహజ కదలికలే దీనికి ప్రధాన కారణం అని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
మన కడుపు, పేగుల్లో ఆహారం లేకపోయినా జీర్ణవ్యవస్థ పూర్తిగా నిశ్చలంగా ఉండదు. కొంత సమయం గడిచిన తర్వాత కడుపు, చిన్నపేగుల్లో కండరాలు తరంగాల్లా కుదుస్తూ, లోపల ఉన్న ద్రవాలు, గాలి, జీర్ణరసాలను ముందుకు కదిలిస్తాయి. దీనినే వైద్యపరంగా మైగ్రేటింగ్ మోటార్ కాంప్లెక్స్ అంటారు. ఈ కదలికల సమయంలో గాలి, ద్రవాలు పేగుల్లో కదలడంతో గుడుగుడు శబ్ధాలు వినిపిస్తాయి.
ఇక ఆకలి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ శబ్ధాలు స్పష్టంగా వినిపించడానికి మరో కారణం ఉంది. కడుపులో ఆహారం లేకపోవడంతో శబ్ధాలను తగ్గించే పదార్థం అక్కడ ఉండదు. అందువల్ల పేగుల కదలికల వల్ల ఏర్పడే ధ్వని మరింత స్పష్టంగా బయటికి వినిపిస్తుంది. కొన్నిసార్లు తిన్న తర్వాత కూడా కడుపులో శబ్ధాలు రావచ్చు. ఎందుకంటే ఆహారం జీర్ణమవుతున్న సమయంలో కూడా పేగుల కదలికలు కొనసాగుతూనే ఉంటాయి.
సాధారణంగా ఆకలితో వచ్చే కడుపు శబ్ధాలకు ఎలాంటి చికిత్స అవసరం లేదు. సమయానికి ఆహారం తీసుకోవడం, నెమ్మదిగా తినడం, తగినంత నీరు తాగడం, గ్యాస్‌ను పెంచే ఆహారాలను అధికంగా తీసుకోకపోవడం వల్ల ఈ అసౌకర్యం తగ్గవచ్చు. అయితే శబ్ధాలతో పాటు తీవ్రమైన కడుపునొప్పి, నిరంతర ఉబ్బరం, వాంతులు, విరేచనాలు లేదా మలబద్ధకం వంటి లక్షణాలు తరచుగా ఉంటే వైద్యుడిని సంప్రదించడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.. కాబట్టి ఆకలి వేసినప్పుడు కడుపులో వినిపించే ఆ గుడుగుడు శబ్ధం చాలాసార్లు శరీరంలో జీర్ణవ్యవస్థ సహజంగా పనిచేస్తోందనడానికి ఒక సాధారణ సంకేతమే అని అంటున్నారు..
ముఖ్య గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇది నిపుణుల లేదా వైద్యుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునే ముందు ఖచ్చితంగా మీ డాక్టర్‌ను సంప్రదించాల్సిందిగా మనవి!..












