తెలంగాణ యువత భవిష్యత్తుపై ఆందోళన కలిగించే విషయాలను తాజా గణాంకాలు బయటపెడుతున్నాయి. చదువుకోవాల్సిన, ఉద్యోగం చేయాల్సిన లేదా ఏదైనా నైపుణ్యం నేర్చుకోవాల్సిన వయసులో.. రాష్ట్రంలోని గణనీయమైన సంఖ్యలో యువత ఈ మూడింటికీ దూరంగా ఉంటున్నట్టు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే గణాంకాలు చెబుతున్నాయి.
15 నుంచి 29 ఏళ్ల మధ్య ఉన్న తెలంగాణ యువతలో 26.5 శాతం మంది NEET కేటగిరీలో ఉన్నారు. అంటే.. ఉద్యోగంలో లేరు, విద్యను కొనసాగించడం లేదు, ఎలాంటి వృత్తి నైపుణ్య శిక్షణ కూడా పొందడం లేదు. ఇది కేవలం నిరుద్యోగ సమస్యతో సమానం కాదు. ఉద్యోగం కోసం ప్రయత్నించే నిరుద్యోగులతో పోలిస్తే.. విద్య, ఉపాధి, స్కిల్లింగ్ మూడింటికీ దూరంగా ఉన్న వర్గం కావడంతో NEET పరిస్థితి మరింత ఆందోళన కలిగించే అంశంగా మారుతోంది.
ఇందులో పురుషుల వాటా 38 శాతంగా, మహిళల వాటా 26 శాతంగా ఉన్నట్టు గణాంకాలు సూచిస్తున్నాయి. జిల్లాలవారీగా చూస్తే భద్రాద్రి కొత్తగూడెంలో NEET రేటు అత్యధికంగా 42.7 శాతంగా నమోదైంది. ఖమ్మంలో 38.2 శాతం, నిజామాబాద్‌లో 31.6 శాతం ఉంది. హైదరాబాద్‌లోనూ దాదాపు 25 శాతం మంది యువత ఈ కేటగిరీలో ఉన్నారు. కామారెడ్డిలో మాత్రం ఈ రేటు 17.2 శాతంగా ఉంది.
ఇక నిరుద్యోగ రేటు విషయానికి వస్తే.. భద్రాద్రి కొత్తగూడెంలో 9.5 శాతం, ఖమ్మంలో 7.8 శాతం, రంగారెడ్డిలో 6.7 శాతంగా నమోదైంది. నల్గొండలో ఇది 2.7 శాతంగా ఉంది. మరోవైపు లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్‌లో జగిత్యాల 70.3 శాతం, వికారాబాద్ 70.2 శాతంతో ముందున్నాయి.
ఈ పరిస్థితికి విద్యా వ్యవస్థకు, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలకు మధ్య ఉన్న అంతరం, స్థానికంగా ఉపాధి అవకాశాల కొరత, ఉన్నత విద్యను కొనసాగించలేకపోవడం వంటి కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ గ్యాప్‌ను తగ్గించేందుకు తెలంగాణలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలపై శిక్షణ అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అలాగే డిజిటల్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌చేంజ్ ఆఫ్ తెలంగాణ.. అంటే DEET ద్వారా ఉద్యోగార్థులను, సంస్థలను అనుసంధానించే వ్యవస్థను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఈ కార్యక్రమాల ప్రభావం పూర్తిగా కనిపించేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే.. యువతకు డిగ్రీతో పాటు మార్కెట్‌కు అవసరమైన స్కిల్, ఆ స్కిల్‌కు తగ్గ ఉద్యోగం అందేలా అవకాశాలు కల్పించడం.. తెలంగాణలో NEET సమస్యను తగ్గించడంలో కీలకంగా మారనుంది..












