ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నిహితుడు తనను వేధించినట్టు ఓ మహిళా వ్యాపారవేత్త సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.ఈ మేరకు సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా నిన్న ఆమె సంచలన పోస్టుపెట్టింది. ‘సాయం కోరితే సీఎం సన్నిహితుడు గెస్ట్ హౌస్‌కు రమ్మని పిలిచాడు. అడ్వర్టైజింగ్ రంగంలో కాంట్రాక్ట్ కోసం న్యాయబద్ధంగా అవకాశం ఇవ్వమని అడిగితే, సీఎంకు సన్నిహితుడైన ఒక వ్యక్తి గెస్ట్ హౌస్‌కు రావాలని పిలిచాడు’ అంటూ కె.శోభా రెడ్డి అనే మహిళా వ్యాపారవేత్త ఆవేదన వ్యక్తం చేసింది. ఎవరి పేర్లు చెప్పలేను కానీ ఇలాంటి అంశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను అంటూ తన పోస్టులో పేర్కొంది. ఆమె పోస్టు నెట్టింట వైరల్ అవ్వడంతో పలు న్యూస్ చానెల్స్ వాళ్లు ఆమెను ఇంటర్వ్యూ చేసిన ఆడియాలు బయటకు వచ్చాయి.
అయితే,ఇది ప్రతిపక్షాల పని అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఓ మహిళను అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి మీద,కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ కొందరు నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా దీనిపై సదరు బాధిత మహిళా వ్యాపారవేత్త స్పందించారు. ఈసారి ఏకంగా వీడియో సందేశం విడుదల చేశారు.తనపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని వీడియో సందేశంలో మిధున అడ్వర్టైజింగ్ ఏజెన్సీ యజమాని శోభారెడ్డి కన్నీటి పర్యంతం అయ్యారు.
సీఎం రేవంత్ రెడ్డి తనకు ఒక్క అపాయిట్మెంట్ ఇస్తే మున్సిపల్ శాఖలో శాఖలో జరుగుతున్న అవినీతిపై ఆధారాలు కూడా బయటపెడతానని పేర్కొన్నారు. తనని గెస్ట్‌హౌస్‌కి రమ్మని వేధించిన వ్యక్తి గురించి సీఎంకే నేరుగా చెబుతానని చెప్పారు.తన వెనుక ఏ రాజకీయ పార్టీ లేదని, కాంగ్రెస్ నేత వల్ల తాను ఇబ్బంది పడింది నిజమని స్పష్టంచేశారు. ఫయీం ఖురేషి , రోహిన్ రెడ్డిలను తాను అన్నా అని పిలుస్తానని, అడ్వర్టయింగ్ కాంట్రాక్ట్ పై వీళ్ళిద్దర్నీ సాయం అడిగితే చేస్తామన్నారు కానీ చేయలేదన్నారు.
అందుకే సీఎం సన్నిహితుడైన మరో నేత దగ్గరకు వెళ్లాల్సి వచ్చిందని, దయచేసి సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేయొద్దని శోభారెడ్డి వేడుకున్నారు. ముగ్గురు పిల్లలు ఉన్నారని, తాను పేదరికం నుంచి వచ్చినట్టు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సార్ ఒక్క అపాయిట్మెంట్ ఇవ్వండి ప్లీజ్ అంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.












