హైదరాబాద్ ప్రజా రవాణా వ్యవస్థలో కీలక మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఎంఎంటీఎస్, మెట్రో రైలు, టీజీఎస్‌ఆర్టీసీ బస్సులను ఒకే వ్యవస్థలోకి తీసుకొచ్చేలా కామన్ టికెటింగ్ విధానాన్ని సిద్ధం చేశారు. ఇక ప్రయాణికులు వేర్వేరు రవాణా మార్గాలకు ప్రత్యేకంగా టికెట్లు తీసుకునే అవసరం లేకుండా.. ఒకే కామన్ టికెట్‌తో ప్రయాణించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
కేవలం టికెటింగ్‌కే పరిమితం కాకుండా.. ప్రయాణికులకు రియల్‌టైమ్ సమాచారాన్ని అందించేలా ప్రత్యేక మొబైల్ యాప్‌ను కూడా రూపొందిస్తున్నారు. మెట్రో, ఎంఎంటీఎస్, ఆర్టీసీకి సంబంధించిన రూట్లు, సమయాలు, అందుబాటులో ఉన్న సేవల వివరాలు యాప్‌లో అందుబాటులోకి రానున్నాయి.
మరోవైపు మొదటి, చివరి మైలు కనెక్టివిటీపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. మెట్రో లేదా ఎంఎంటీఎస్ స్టేషన్ నుంచి ప్రయాణికులు తమ గమ్యస్థానానికి సులభంగా చేరుకునేలా ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి ప్రైవేట్ రవాణా సేవలను అనుసంధానించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. అలాగే ఎంఎంటీఎస్ స్టేషన్ల నుంచి సమీప కాలనీలకు షేర్డ్ వాన్లు, షటిల్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే ప్రతిపాదన కూడా ఉంది.
ప్రతి ఎంఎంటీఎస్ స్టేషన్ పరిధిలోని బస్‌స్టాప్‌లు, రూట్లను మ్యాపింగ్ చేసి.. స్టేషన్ వారీగా కనెక్టివిటీని రూపొందించాలని టీజీఎస్‌ఆర్టీసీ, జీహెచ్ఎంసీలకు సూచించారు. దీంతో ప్రజా రవాణా వినియోగం పెరగడంతో పాటు నగరంలో రహదారి రద్దీని తగ్గించే అవకాశం ఉంది.
ఇప్పటికే కామన్ టికెట్‌కు సంబంధించిన అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా దీన్ని ప్రారంభించేందుకు అధికారులు సమయం కోసం ఎదురుచూస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. వారం రోజుల్లో హైదరాబాద్‌లో కామన్ టికెటింగ్ విధానం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు ఆశిస్తున్నారు..












