తుమ్మలూరు గ్రామ పరిధిలో పీటీ భూముల్లో కబ్జా కుట్రలు
కొడుకులతో కలిసి 51 ఎకరాలపై మనోహర్ రెడ్డి కన్ను
సర్వే నంబర్లు 371, 372, 373, 377 భూములు కొట్టేసేందుకు స్కెచ్
రెవెన్యూ అధికారులను చేతిలో పెట్టుకుని అక్రమ రిపోర్టులు
ఫ్యూచర్ సిటీలో దర్జాగా జరుగుతున్న కబ్జా
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లిన బాధితులు
ప్రభుత్వాన్ని నిలదీసి తమకు న్యాయం చేయాలని వినతి
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల,
9848070809,
స్వేచ్చ న్యూస్ చైర్మన్ .
తెలంగాణకు ఫ్యూచర్ సిటీయే ఫ్యూచర్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి తెగ ఊదరగొడుతున్నారు. భారీ పెట్టుబడులు అంటూ ఏ కార్యక్రమానికి వెళ్లినా చెప్పిందే చెబుతున్నారు. అయితే, ఫ్యూచర్ సిటీ చుట్టూ భూ కబ్జాలు భారీగానే జరుగుతున్నాయి. ఏకంగా 51 ఎకరాలపై కన్నేసిన తాండూరు ఎమ్మెల్యే రెవెన్యూ అధికారులతో కలిసి రికార్డులను తారుమారు చేస్తున్నారు. మొత్తం భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనికి సంబంధించిన విషయాలను స్వేచ్ఛ న్యూస్ గతంలోనే కథనాలను ఇచ్చింది. తాజాగా బాధితులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు లేఖ రాయడంతో ఈ అంశం మరోసారి చర్చనీయాంశమైంది. కేటీఆర్‌కు రాసిన లేఖను పరిశీలిస్తే, బాధితులు రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం మండల కేంద్రానికి చెందిన గద్దగూటి యెల్లయ్య వారసులు. వారి పూర్వీకులకు సంబంధించిన తుమ్మలూరు గ్రామ పరిధిలోని సర్వే నెంబర్లు 371, 372, 373, 377లో మొత్తం 51.02 ఎకరాల్లో ప్రొటెక్టెడ్ టెనెన్సీ(పీటీ) హక్కులు కలిగి ఉన్నారు. గద్దగూటి యెల్లయ్య, వారసులు ఎవరికీ ఈ పీటీ హక్కులను ఎప్పుడూ ఎవరికీ సరెండర్ చేయలేదు. కానీ, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, ఆయిన కుమారులు అవినాష్ కుమార్ రెడ్డి, శివ కుమార్ రెడ్డిలు రెవెన్యూ అధికారులతో కలిసి ఈ భూమిపైన రికార్డులను తారుమారు చేస్తూ కాజేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, అధికారుల అక్రమ చర్యలపై ప్రజల తరఫున కేటీఆర్ గొంతు వినిపిస్తున్నారు కనుక ఈ సమస్యను మీ దృష్టికి తీసుకొస్తున్నామని అన్నారు.
ఫ్యూచర్ సిటీ పేదల భూములు గుంజుకునేందుకా?
తెలంగాణ ప్రభుత్వం ఫ్యూచర్ సీటీ పేరుతో ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ, భూముల ధరలు పెంచుతోంది. దీనివల్ల సామాన్య రైతులు, భూ యజమానులు పీటీ హక్కులు ఉన్న కుటుంబాలు తమ భూములను కాపాడుకోవడానికి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ పరిస్థితిని చూస్తే ఫ్యూచర్ సీటీ అభివృద్ధి వల్ల పెరుగుతున్న భూముల విలువను కొంతమంది రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తులు, రియల్ ఎస్టేట్ కోసం ఉపయోగించుకుంటున్నారనే విషయం అందరికీ అర్థం అవుతోంది. అధికార పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు, వారి కుటుంబ సభ్యులు, వారితో సంబంధం ఉన్న వ్యక్తులు రియల్ ఎస్టేట్ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. రెవెన్యూ అధికారులపై రాజకీయ ప్రభావం చూపి భూములకు సంబంధించిన రికార్డులు, అనుమతులు, ఇతర ప్రభుత్వ వ్యవహారాలను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. తుమ్మలూరు గ్రామంలోని తమ ప్రొటెక్టెడ్ టెనెన్సీ భూములు సమస్యే అందుకు నిదర్శనమని తెలిపారు.
ఎమ్మార్వో రిపోర్టులు తారుమారు
తుమ్మలూరు గ్రామంలోని సర్వే నెంబర్లు 371, 372, 373, 377లో మొత్తం 51.02 ఎకరాలు ఉండగా, తమ పూర్వీకులైన గద్దగూటి యెల్లయ్య, గద్దగూటి వెంకయ్య పేర్లపై ప్రొటెక్టెడ్ టెనెంట్స్‌గా పాత ప్రొటెక్టెడ్ టెనెన్సీ రిజిస్టర్, ఇతర రెవెన్యూ రికార్డుల్లో నమోదై ఉన్నాయని బాధితులు తెలిపారు. తమ కుటుంబం వద్ద ఉన్న పాత రికార్డుల ప్రకారం, గద్దగూటి యెల్లయ్య 371, 372, 373, 377 సర్వే నెంబర్లలో తన పీటీ హక్కులును ఎవరికీ ఎప్పుడు సరెండర్ చేయలేదని, ఈ విషయం రెవెన్యూ అధికారుల వద్ద రికార్డుల్లో కూడా ఉందని తెలిపారు. అయితే ఈ భూములను తమ పేరు పైన రికార్డ్ చేయాలని తాము కోరుతున్నా కూడా రెవెన్యూ శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. కానీ, రాజకీయ నాయకుల ఒత్తిడికి తలొగ్గి, ఆ భూమిపైన తమకు హక్కులు లేకుండా చేయాలని రికార్డులనే తారుమారు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మహేశ్వరం ఎమ్మార్వో/తహసీల్దార్ అప్పల నాయుడు ఒకే ఫైల్ నెంబర్ బీ/123/2026తో 12.03.2026న ఒక రిపోర్ట్, 30.03.2026న మరో రిపోర్ట్ ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
మొదటి రిపోర్టులో ఉన్న విషయం 18 రోజుల్లో ఎందుకు మారింది?
12.03.2026న ఇచ్చిన రిపోర్టులో గద్దగూటి యెల్లయ్య 371, 372, 373, 377 సర్వే నెంబర్లలో తన పీటీ హక్కులును ఎవరికీ సరెండర్ చేయలేదని చెప్పారని, కానీ కేవలం 18 రోజుల తర్వాత (30.03.2026) అదే ఫైల్ నెంబర్‌తో మరో రిపోర్ట్ ఇచ్చి, గద్దగూటి యెల్లయ్యకు ఈ సర్వే నెంబర్లలో పీటీ హక్కునే లేదు అంటూ రెవెన్యూ రికార్డులకి పూర్తి వ్యతిరేకంగా ఇచ్చారని తెలిపారు. అన్ని రికార్డుల్లో గద్దగూటి యెల్లయ్యకు పీటీ హక్కులు ఉన్నట్టుగా నమోదు చేసి ఉన్నా కూడా వాటిని పట్టించుకోకుండా ఇతర వ్యక్తులకు మేలు జరిగేలా మరో రిపోర్ట్ ఇచ్చారని చెప్పారు. మొదటి రిపోర్టులో ఉన్న విషయం 18 రోజుల్లో ఎందుకు మారింది? రెండో రిపోర్ట్ ఆధారం ఏంటి? కొత్తగా ఏ పత్రాలు వచ్చాయి? ఆ పత్రాలు ఎప్పుడు తయారయ్యాయి? వాటిని ఎవరు ఇచ్చారు? అసలు ప్రభుత్వ రికార్డులతో వాటిని ఎవరు ధృవీకరించారు? ఈ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో తాండూరు ఎమెల్యే మనోహర్ రెడ్డి, ఆయన కుమారులు సర్వే నెంబర్లలోని కొంతభాగాన్ని ఇతర పట్టాదారుల నుండి తీసుకున్నారని, మొత్తం భూమిని కాజేయాలనే ఉద్దేశంతో సర్వే నెంబర్లలో పీటీ హక్కులను ఇల్లీగల్‌గా తొలగించాలని రెవెన్యూ అధికారులతో తప్పుడు రిపోర్టులని తయారు చేయించున్నారని ఆరోపించారు.
ఇది ఒక కుటుంబం సమస్య కాదు
ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ విజ్ఞప్తి మేరకు ప్రభుత్వాన్ని ఈ విషయంలో ప్రశ్నించాలని బాధితులు లేఖ ద్వారా కోరారు. అధికారుల అక్రమ చర్యలపై ప్రజల తరఫున గొంతు వినిపిస్తున్నందున తమ సమస్యను మీ దృష్టికి తీసుకువస్తున్నామని చెప్పారు. ఈ సమస్య కేవలం ఒక కుటుంబానికి సంబంధించినది కాదని, ఫ్యూచర్ సిటీ పేరుతో భూముల ధరలు పెరుగుతున్న సమయంలో, సామాన్య రైతులు, పాత పీటీ హక్కులు ఉన్న కుటుంబాల భూములను రాజకీయ పలుకుబడితో కబ్జా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి ప్రజల భవిష్యత్ కోసం ఉండాలి కానీ, కొంతమంది రాజకీయ నాయకులు, వారి కుటుంబాల రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసం ఉండకూడదని అన్నారు. అందువల్ల, దయచేసి ఈ తుమ్మలూరు పీటీ భూముల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, అసెంబ్లీ, సంబంధిత ప్రభుత్వ అధికారులను ప్రశ్నించాలని కేటీఆర్‌ను కోరారు. ఎమ్మార్వో ఇచ్చిన రిపోర్టులను, ఇతర పత్రాలను కూడా కేటీఆర్‌కు పంపించారు. దయచేసి ఈ విషయాన్ని ప్రజల సమస్యగా తీసుకుని ప్రభుత్వ స్థాయిలో లేవనెత్తి, తమ పీటీ హక్కులను కాపాడాలని బాధితులు కోరారు.












