తల్లిదండ్రులు ఏమరపాటు చిన్నారుల ప్రాణాల మీదకు తెస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. చిన్నారులు ఆడుకుంటూ రెప్పపాటులో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి.ఆడుకుంటున్నారు కదా? అని పేరెంట్స్ కొంచెం వారి దృష్టి మరలిస్తే అంతలోనే విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగుచూసింది. కారులో ఆడుకుంటున్న చిన్నారి డోర్స్ లాక్ కావడంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయింది.
ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర విషాదం నింపింది. వివరాల్లోకివెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వినోభానగర్ గ్రామ సర్పంచ్ నవీన్, ఐశ్వర్య దంపతులకు ఇద్దరు పిల్లలు తన్విత శ్రీ (4), సురక్ష ఉన్నారు.ఆదివారం స్కూలుకు సెలవు కావడంతో, ఇంటి వద్ద ఆడుకుంటూ ఉన్నారు. పేరెంట్స్ ఏదో పనిలో ఉండగా..పెద్ద కూతురు తన్విత శ్రీ లాక్ చేయని కారులో ఎక్కింది.
ఆడుకుంటున్న క్రమంలోనే ఒక్కసారిగా కారు డోర్ లాక్ అయ్యింది. దీంతో ఊపిరాడక కాసేపటికే నాలుగేళ్ల చిన్నారి స్పృహ తప్పింది. కూతురు కనిపించడంలేదని తల్లి చెప్పడంతో కుటుంబసభ్యులు ఊరంతా వెతికారు. అనుమానం వచ్చి కారులో చూడగా స్పృహ తప్పి పడిపోయిన తన్వితశ్రీని గుర్తించారు. అనంతరం స్థానికుల సాయంతో పాపను కారు నుంచి బయటకు తీశారు.
చలనం లేకుండా పడి ఉన్న తన్విత శ్రీని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. కూతురు లేదని తెలియడంతో పేరెంట్స్ గుండెలవిసేలా విలపించారు. కుటుంబసభ్యులు సైతం కన్నీరుమున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి వివరాలు సేకరించారు. అనంతరం పాప మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అందజేసినట్టు సమాచారం.












