ఆకాశంలో దూసుకెళ్లే రాకెట్లపై కొత్త చర్చ..
ప్రైవేటీకరణ వద్దంటున్న ఉద్యోగులు
ఇస్రో ఉద్యోగ సంఘాల సమష్టి గళం
ఇస్రోలో అసలేం జరుగుతోంది..?
భారత అంతరిక్ష ప్రయాణంలో ఇస్రోది ప్రత్యేక స్థానం. రాకెట్లు.. ఉపగ్రహాలు.. ప్రయోగాలు.. అంతరిక్ష పరిశోధనలు.. ఏది మాట్లాడినా ముందుగా గుర్తొచ్చే పేరు ఇస్రోనే. కానీ ఇప్పుడు అదే ఇస్రో భవిష్యత్ పాత్రపై కొత్త చర్చ మొదలైంది. అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థలకు మరింత పెద్దపీట వేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానంతో.. రాకెట్ల తయారీ వంటి కీలక కార్యకలాపాలు క్రమంగా ఇస్రో నుంచి బయటకు వెళ్లనున్నాయా? ఈ మార్పు ఇస్రో ఉద్యోగుల భవిష్యత్‌పై ప్రభావం చూపనుందా? అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.
తొమ్మిది సంఘాలు.. ఒకే గళం
ఇస్రోకు చెందిన తొమ్మిది ఉద్యోగ సంఘాలు తొలిసారి సమష్టిగా గళం విప్పాయి. ఇస్రో ఛైర్మన్, అంతరిక్ష శాఖ కార్యదర్శి వి. నారాయణన్‌కు రెండ్రోజుల కిందట లేఖ రాశాయి. కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానం ఏంటి? భవిష్యత్‌లో ఇస్రో పాత్ర ఏమిటి? ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగుల పరిస్థితి ఏంటి? కొత్త నియామకాలపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? వంటి అంశాలపై అధికారిక వివరణ ఇవ్వాలని కోరాయి.
గోయెంకా వ్యాఖ్యలతో మొదలైన కలకలం
ఉద్యోగ సంఘాల ఆందోళనకు ప్రధాన కారణం IN-SPACe ఛైర్మన్ పవన్ కుమార్ గోయెంకా చేసిన వ్యాఖ్యలు. భవిష్యత్‌లో ఇస్రో స్వయంగా లాంచ్ వెహికల్స్ తయారు చేయకుండా.. వాటి తయారీ బాధ్యతలను ప్రైవేట్ లేదా ప్రభుత్వ రంగ సంస్థలకు అప్పగించే దిశగా మార్పులు జరుగుతున్నాయని గోయెంకా చెప్పినట్లు ఉద్యోగ సంఘాలు లేఖలో ప్రస్తావించాయి.
ప్రస్తుతం ఈ ప్రక్రియ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్.. SSLVతో మొదలైందని, భవిష్యత్‌లో PSLV, LVM3 వంటి కీలక రాకెట్ల తయారీకి కూడా ఇదే విధానం విస్తరించే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి.
ఉద్యోగాలపై ప్రభావం ఉంటుందా?
ఇక్కడే ఇస్రో ఉద్యోగుల్లో అసలు భయం మొదలైంది. రాకెట్ తయారీ, సాధారణ ఉపగ్రహాల ఉత్పత్తి వంటి కార్యకలాపాలు ఇస్రో నుంచి బయటకు వెళ్తే సంస్థలో అంతర్గత పనిభారం తగ్గే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. దాని ప్రభావం ఉద్యోగుల సంఖ్యపై పడుతుందా? ప్రమోషన్లు తగ్గుతాయా? నైపుణ్యాభివృద్ధి అవకాశాలు తగ్గిపోతాయా? భవిష్యత్‌లో నియామకాలు ఎలా ఉంటాయి? అనే ప్రశ్నలను లేవనెత్తాయి.
ఇప్పటికే ఇస్రోకు చెందిన దాదాపు 120 సాంకేతికతలను ప్రైవేట్ రంగానికి బదిలీ చేసినట్లు ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. కులశేఖరపట్నంలో ప్రతిపాదిత స్పేస్ లాంచ్ కాంప్లెక్స్ వంటి కొత్త మౌలిక వసతులను కూడా ప్రైవేట్ సంస్థలకు అందుబాటులోకి తీసుకురావడంపై ప్రశ్నలు సంధించాయి.
ప్రైవేట్ రంగానికి మేం వ్యతిరేకం కాదు
అయితే ఉద్యోగ సంఘాల వైఖరి పూర్తిగా ప్రైవేట్ రంగానికి వ్యతిరేకం కాదు. అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యాన్ని స్వాగతిస్తున్నామని అవి స్పష్టం చేశాయి. NSIL ద్వారా వాణిజ్య కార్యకలాపాలు, పరిశ్రమలతో భాగస్వామ్యాలను ముందుకు తీసుకెళ్లడాన్ని తాము వ్యతిరేకించడం లేదని తెలిపాయి.
అయితే ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించడం ఒకటైతే.. ఇస్రో సొంత తయారీ సామర్థ్యాన్ని పూర్తిగా తొలగించడం మరోటని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. ఈ రెండింటి మధ్య స్పష్టమైన లైన్ ఉండాలని డిమాండ్ చేస్తున్నాయి.
రాకెట్ తయారీ అంటే కాంట్రాక్ట్ మాత్రమే కాదు
ఉద్యోగ సంఘాల వాదనలో మరో కీలక అంశం ఉంది. లాంచ్ వెహికల్ డిజైన్ చేయడం మాత్రమే కాదు.. దాని తయారీ, అసెంబ్లీ, ఇంటిగ్రేషన్, పరీక్షలు, ప్రయోగం వరకు ప్రతి దశలో ఇస్రోకు దశాబ్దాల అనుభవం ఉంది. ఇవి కేవలం తయారీ కాంట్రాక్టులు కావని.. ఇస్రోకు చెందిన కీలక సాంకేతిక సామర్థ్యం, సంస్థాగత అనుభవం, వ్యూహాత్మక నైపుణ్యంలో భాగమని సంఘాలు చెబుతున్నాయి.
ఈ కార్యకలాపాలు పూర్తిగా ఇతర సంస్థలకు వెళ్లిపోతే.. భవిష్యత్‌లో ఇస్రో కేవలం పరిశోధన, డిజైన్ సంస్థగా మాత్రమే మిగిలిపోయే ప్రమాదం ఉందన్నది ఉద్యోగ సంఘాల ప్రధాన ఆందోళన.
నారాయణన్‌కు కీలక ప్రశ్నలు
ఇస్రో ఛైర్మన్ నారాయణన్ నుంచి ఉద్యోగ సంఘాలు స్పష్టమైన సమాధానాలు కోరుతున్నాయి. గోయెంకా చేసిన వ్యాఖ్యలు నిజంగా కేంద్ర ప్రభుత్వ అధికారిక విధానమా? లేక వ్యక్తిగత అభిప్రాయమా? SSLV, PSLV, LVM3తో పాటు భవిష్యత్ లాంచ్ వెహికల్స్ డిజైన్, అభివృద్ధి, తయారీ, ఇంటిగ్రేషన్, పరీక్షలు, ప్రయోగ బాధ్యతలు ఇస్రో వద్దే కొనసాగుతాయా? అనే అంశాలపై అధికారిక ప్రకటన చేయాలని కోరాయి.
కేంద్రం విధానం మాత్రం స్పష్టమే
మరోవైపు అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థల పాత్రను పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ దిశ ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తోంది. 2023 స్పేస్ పాలసీ ద్వారా ప్రైవేట్ రంగానికి మరింత విస్తృతమైన అవకాశాలు కల్పించింది. IN-SPACe ప్రైవేట్ సంస్థలకు అనుమతులు, ప్రోత్సాహం, పర్యవేక్షణలో కీలకంగా మారగా.. NSIL అంతరిక్ష కార్యకలాపాల వాణిజ్యీకరణ, పరిశ్రమల భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్తోంది.
2025-26లో IN-SPACe, NSIL, ISRO కలిసి 100 టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ ఒప్పందాలు పూర్తి చేసినట్లు కేంద్రం వెల్లడించింది. ఇందులో SSLV టెక్నాలజీని HALకు బదిలీ చేయడం అత్యంత కీలకమైన పరిణామంగా నిలిచింది. PSLV, LVM3 టెక్నాలజీ బదిలీ ప్రక్రియ కూడా ముందుకు సాగుతున్నట్లు కేంద్రం తెలిపింది.
ఇస్రో భవిష్యత్ పాత్ర ఏంటి?
అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థల ప్రవేశం పెరగడం వల్ల పెట్టుబడులు, ఉత్పత్తి సామర్థ్యం, ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. అంతరిక్ష ఆర్థిక వ్యవస్థను భారీ స్థాయికి తీసుకెళ్లాలన్న లక్ష్యానికి ఇది ఉపయోగపడొచ్చు. కానీ అదే సమయంలో దశాబ్దాలుగా ఇస్రోలో నిర్మితమైన సాంకేతిక నైపుణ్యం, తయారీ సామర్థ్యం, మానవ వనరుల అనుభవం బలహీనపడకూడదన్నది ఉద్యోగ సంఘాల వాదన.
అందుకే ఇప్పుడు అసలు చర్చ ప్రైవేట్ వర్సెస్ ఇస్రో కాదు. ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తూనే.. ఇస్రోకు ఉన్న కీలక సాంకేతిక, తయారీ సామర్థ్యాలను ఎలా కాపాడాలి? ఇస్రో, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ కంపెనీలు కలిసి పనిచేసే భవిష్యత్ మోడల్ ఎలా ఉండాలి? అన్నదే కీలకంగా మారింది.
భారత అంతరిక్ష రంగం ఇప్పుడు కీలకమైన మలుపు వద్ద నిలిచింది. ఒకవైపు ప్రైవేట్ రంగానికి ఆకాశం తెరుచుకుంటోంది. మరోవైపు ఆ ఆకాశాన్ని అందుకోవడానికి దశాబ్దాలుగా పునాది వేసిన ఇస్రో తన భవిష్యత్ పాత్రపై స్పష్టత కోరుతోంది.
రాకెట్లను డిజైన్ చేసిన మేధస్సు.. వాటిని తయారు చేసిన నైపుణ్యం.. పరీక్షించిన అనుభవం.. ప్రయోగించిన సంస్థాగత జ్ఞానం.. ఇవన్నీ కలిసిందే ఇస్రో. అందుకే.. ప్రైవేట్ రంగానికి తలుపులు తెరిచిన కేంద్రం.. ఇస్రోకు ఎలాంటి స్థానం ఇవ్వబోతోందనేది ఆసక్తిగా మారింది.








