మన సనాతన ధర్మంలో పదహారు కళల గురించి ప్రస్తావన ఉంది. ఇవి కేవలం మానవుని లౌకిక నైపుణ్యాలు మాత్రమే కావు... ఆధ్యాత్మిక సాధనలో జీవాత్మ, పరమాత్మ తత్త్వాన్ని పొందే క్రమంలో వికసించే దివ్య శక్తులు. షోడశ కళా పూర్ణుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్మ స్వరూపాన్ని ప్రతిబింబించే ఆ 16 దివ్య కళల ఆధ్యాత్మిక అంతరార్థం ఇప్పుడు తెలుసుకుందాం...
1.. శ్రీ సంపద..
ఇది కేవలం భౌతిక సంపద కాదు.. అంతరంగంలో వెలిగే జ్ఞానము, భక్తి, విరాగాలనే దివ్య ఐశ్వర్యం.
2.. భూ సంపద..
ధరణిని ఏలడం కాదు.. శరీరం, మరియు ఈ సమస్త విశ్వం తన ఆత్మస్వరూపమేననే విశ్వాత్మ భావాన్ని పొందడం.
3.. కీర్తి సంపద..
ప్రచారం కోసం కాదు.. భగవత్ తత్త్వాన్ని, భక్తి పారవశ్యాన్ని లోకంలో ప్రతిష్ఠించడమే నిశ్చలమైన కీర్తి.
4.. వాణీ సమ్మోహనం..
అంతరంగపు లోతుల నుండి బయల్దేరే పరా వాక్కు. ఇది విన్నవారి హృదయాల్లోని అజ్ఞానాన్ని తుడిచిపెట్టి, క్షణకాలంలో ఆత్మానందాన్ని ఇస్తుంది.
5.. లీల..
సంసారాన్ని మిథ్యగా, ఈ జగత్తును భగవంతుని లీలా వినోదంగా భావిస్తూ సుఖదుఃఖాలకు అతీతంగా జీవించడం.
6.. కాంతి..
కుండలిని జాగరణ వల్ల, బ్రహ్మతేజస్సు వల్ల ముఖంలో ప్రసరించే దివ్యమైన ఆభా. ఈ కాంతిని దర్శించగానే మనస్సు ధ్యానమగ్నమవుతుంది.
7.. విద్య.. సా విద్యా యా విముక్తయే... ఏది బంధాల నుండి విముక్తిని ఇస్తుందో, ఆ పరమాత్మను చేరుస్తుందో అదే నిజమైన బ్రహ్మవిద్య.
8.. విమల.. త్రిగుణాలకు అతీతుడై, మాయా ప్రభావం లేని అద్దం లాంటి శుద్ధ చైతన్యాన్ని కలిగి ఉండటం.
9.. ఉత్కర్షిణి శక్తి..
అజ్ఞాన నిద్రలో ఉన్న జీవాత్మను చైతన్యపరిచి, పరమాత్మ వైపు నడిపించే శరణాగతి శక్తి.
10.. నీర-క్షీర వివేకం..
నిత్యమైన ఆత్మ ఏది? అనిత్యమైన ప్రపంచం ఏది? అని వేరుచేసి చూపే "పరమహంస" స్థితి.
11.. కర్మణ్యత..
కర్మఫలాన్ని ఆశించకుండా, ప్రతి పనినీ ఈశ్వరార్పణంగా, యజ్ఞంలా నిర్వహించే నిష్కామ కర్మయోగం.
12.. యోగశక్తి..
జీవాత్మను పరమాత్మతో అనుసంధానించే అత్యున్నత సమాధి స్థితి.
13.. సత్యధారణ..
మార్పు చెందే ఈ జగత్తులో, ఎప్పటికీ మారని ఒకే ఒక్క సత్యమైన బ్రహ్మాన్ని హృదయంలో స్థిరంగా నిలుపుకోవడం.
14.. వినయము..
నేను అనే అహంకారాన్ని తుడిచిపెట్టి, సర్వభూతాలలోనూ భగవంతుడినే చూసే పరమ సాత్విక స్థితి.
15.. ఆధిపత్యం..
ఇతరులపై అధికారం కాదు.. స్వయం ప్రకాశకమైన ఆత్మ స్థితిలో ఉంటూ తన ఇంద్రియాలను, మనస్సును జయించిన స్వరాజ్య స్థితి.
16.. అనుగ్రహ సామర్థ్యం..
భగవంతుని దివ్య కృపకు పాత్రుడై, తన వద్దకు వచ్చే జీవుల పాపాలను పరిహరించి, వారికి మోక్షాన్ని ప్రసాదించే జగద్గురు తత్త్వం.
ఈ 16 దివ్య కళలు సంపూర్ణంగా ప్రకాశించిన పరిపూర్ణ అవతార మూర్తి... మన శ్రీకృష్ణ పరమాత్మ. ఈ దివ్య గుణాలను మన అంతరంగంలో వికసింపజేసుకోవడమే నిజమైన ఆధ్యాత్మిక సాధన. ఓం నమో భగవతే వాసుదేవాయ..
గమనిక: ఇక్కడ అందించిన వివరాలు కేవలం సాంప్రదాయ పురాణ విశ్వాసాలు మరియు ఆధ్యాత్మిక భావనల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటిని కేవలం మతపరమైన విశ్వాసాల కోణంలోనే చూడాలి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత రంగ నిపుణులను సంప్రదించడం మంచిది.












